పీత‌ల సుజాత ఇంట్లో రూ. 10 ల‌క్ష‌లు బ్యాగు ల‌భ్యం!

ఎపీ మంత్రి పీత‌ల సుజాత తండ్రి ఇంటి ఆవ‌ర‌ణ‌లో క‌నిపించిన ఓ సంచి క‌ల‌క‌లం రేపింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వీర‌వాస‌రంలో పీత‌ల సుజాత తండ్రి నివ‌శిస్తున్నారు. త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఓ బ్యాగు క‌నిపించ‌డంతో ఆయ‌న దాన్ని తెర‌చి చూశారు. దాంట్లో పెద్ద మొత్తంలో న‌గ‌దు ఉన్న‌ట్టు గుర్తించారు. వెంట‌నే ఆయ‌న ఇంట్లో ప‌ని చేస్తున్న సుబ్బారావు అనే ప‌ని మనిషి ద్వారా పోలీసుల‌కు ఆయ‌న ఫిర్యాదు చేశారు. పోలీసుల వ‌చ్చి సంచి తెరిచి చూస్తే వారికి ఆశ్చ‌ర్య‌పోయే న‌గ‌దు మొత్తం అందులో క‌నిపించింది. మొత్తం అందులో ఉన్న న‌గ‌దు లెక్కించ‌గా ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లుంది. ఈ మొత్తంతోపాటు బీఈడీ స‌ర్టిఫికెట్లు, డీఎస్సీ హాల్ టికెట్లు కూడా అందులో ఉన్నాయి. ఈ మొత్తం ఓ మ‌హిళ తీసుకువ‌చ్చి అక్క‌డ పెట్టిన‌ట్టు అనుమానిస్తున్నారు. త‌న‌కు టీచ‌ర్ ఉద్యోగం కావాలంటూ ఓ మ‌హిళ త‌మ ఇంటికి వ‌చ్చింద‌ని, బ‌హుశా ఆమే ఈ సంచిని వ‌దిలి వెళ్ళి ఉండ‌వ‌చ్చ‌ని మంత్రి ఇంటిలో ప‌ని చేస్తున్న సుబ్బారావు చెప్పాడు. లంచంగా ఇవ్వ‌డానికే ఆమె ఆ మొత్తాన్ని తెచ్చి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. న‌గ‌దు మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. స‌రిఫికెట్ల‌లో ఉన్న స‌మాచారం ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తును వేగంవంతం చేయడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌న‌పై కుట్ర జ‌రుగుతుంద‌ని, త‌న‌ను అప్ర‌దిష్టపాలు చేయ‌డానికే ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో కూడిన బ్యాగును త‌న తండ్రి ఉన్న‌చోట పెట్టార‌ని మంత్రి పీత‌ల సుజాత ఆరోపించారు. ఈ కేసుపై ద‌ర్యాప్తు జ‌రిపి నిందితుల్ని త్వ‌ర‌గా ప‌ట్టుకోవాల‌ని ఆమె కోరారు.