న‌వ నిర్మాణ‌దీక్ష వైఫ‌ల్యంపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం!

విజ‌య‌వాడ‌లో చేప‌ట్టిన నవ నిర్మాణదీక్ష వైఫల్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచెం స్థలం ఉన్న బెంజిసర్కిల్‌లో సభ ఏర్పాటు చేసినా జ‌నం రాక‌పోవ‌డం ప‌ట్ల‌ అసహనం వ్యక్తం చేశారు. దీక్ష అనంతరం ఫ్రభుత్వ అతిథి గృహంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడారు. స‌భ‌ పేలవంగా జరగడంపై ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే మహానాడుకు, నవ నిర్మాణ దీక్షకు మధ్య సమయం లేకపోవడంతో జన సమీకరణలో ఇబ్బందులు తలెత్తాయని నాయకులు, ప్రజాప్రతినిధులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారి సమాధానాన్ని సిఎం ఏ మాత్రం పట్టించుకోలేదు. నగరంలో మూడు నియోజకవర్గాల నుండి వచ్చినా కనీసం పదివేల మంది ఉండేవార‌ని, ఎందుకు రాలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించినట్లు తెలిసింది. భవిష్యత్‌లో ఇలా జరిగితే ఊరుకోబోనని ఆయ‌న హెచ్చరించారు. దీంతోపాటు స‌భ పేల‌వంగా జ‌రిగింద‌ని, జ‌నం లేర‌ని ప్ర‌జాశ‌క్తి వంటి ప‌త్రిక‌ల్లో వార్త‌లు రావ‌డం కూడా చంద్ర‌బాబు అస‌హ‌నానికి కార‌ణ‌మైందంటున్నారు.కాగా బెంజిసర్కిల్‌లో సభ పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఇక్కడి ప్రజాప్రతినిధులు ఏమాత్రం లక్ష్యపెట్టకుండా అక్కడే ఏర్పాట్లు చేశారు. దీనిపై డిజిపి రాముడు కూడా బెంజిసర్కిల్‌లో సభ ఏంటంటూ స్థానిక పోలీసు అధికారులను ప్రశ్నించారు. రేవంత్‌ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు పదేపదే ఒత్తిడి తెస్తారని, అయినా ఎవరూ నోరెత్తొద్దని చంద్ర‌బాబు సూచించారు. ఎవరైనా నోరుజారితే ఇరుకునపడతామని, పార్టీకీ నష్టమని అన్నారు. గన్నవరం విమానాశ్రయ టెర్మినల్‌ ప్రారంభోత్స వంలో ఆయన మీడియాతో మాట్లాడిన అనంతరం రేవంత్‌ గురించి ప్రశ్నించగానే మారు మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోయారు. రేవంత్‌ వ్యవహారం కొన్ని మీడియాల్లో పదేపదే వస్తోందని, అటువంటి వాటిని చూడకుండా ఉండటం మేలని చెప్పారు.