స్టీఫెన్‌తో చంద్ర‌బాబు మాట్లాడారా?

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడాడ‌ని మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు ఏసీబీ అధికారుల వ‌ద్ద ఉన్నాయ‌ని మీడియాలో వార్త‌లు వస్తున్నాయి. ఇదే నిజ‌మైతే చంద్ర‌బాబుపై కేసు న‌మోదు చేయ‌డానికి టీఆర్ ఎస్‌కు ఎలాంటి అడ్డంకులు లేవు. ఆధారాలు ఉంటే ఎందుకుని ఆగుతున్న‌ట్లు అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. సీఎం కాబ‌ట్టి ఈ విష‌యంలో న్యాయ‌నిపుణుల సల‌హా తీసుకోవ‌డానికి మ‌రికొంత స‌మ‌యం తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న ప్ర‌మేయంతో ఈ వ్య‌వ‌హారం అంతా జ‌రిగింద‌ని, అస‌లు సూత్ర‌ధారి అయిన చంద్ర‌బాబును వ‌ద‌ల‌వ‌ద్ద‌ని టీఆర్ ఎస్ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు.
చంద్ర‌బాబు మౌనం అందుకేనా?
ప్ర‌పంచంలో చీమ చిటుక్కు మ‌న్నా చంద్ర‌బాబు అనుకూల మీడియాలో ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది. ఘ‌ట‌న‌పై ఆయ‌న విచారం వ్య‌క్తం చేశార‌నో, శుభాకాంక్ష‌లు తెలిపార‌నో వార్త‌లు డీఫాల్ట్‌గా వ‌చ్చేస్తుంటాయి. కానీ, ఓ వైపు తెలంగాణ రాష్ర్ట అవ‌త‌రణ వేడుక‌లు జ‌రుగుతున్నా టీడీపీ ఎలాంటి  సంబ‌రాలు నిర్వ‌హించ‌లేదు. నా లేఖ వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింద‌ని చెప్పుకునే చంద్ర‌బాబు క‌నీసం తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర అవ‌త‌ర‌ణ శుభాకాంక్ష‌లు కూడా చెప్ప‌క‌పోవ‌డం వెన‌క ఆంత‌ర్య‌మేంట‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి మొద‌టి నుంచి టీడీపీ తెలంగాణ వ్య‌తిరేక పార్టీగా ముద్ర వేసుకుంది. రేవంత్ ను ప‌రామ‌ర్శించ‌డానికి జైలుకు వెళ్లేందుకు తీరిక ఉంది కానీ, వేడుక‌లు జ‌రిపే స‌మ‌యం లేదా అని టీఆర్ఎస్ ప్ర‌శ్నిస్తోంది. ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయ‌ని అందుకే ఆయ‌న మౌనం వ‌హిస్తున్నార‌ని, తెలుగు త‌మ్ముళ్లు కూడా ఆ విధంగానే ముందుకెళ్తున్నార‌ని టీడీపీ వ్య‌తిరేక వ‌ర్గాలు ప్ర‌చారం చేస్తున్నాయి. నిజంగా అలాంటి ఆధార‌లు ఉంటే.. చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డ్డ‌ట్లే..!