ఏపీలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు జులై 3న ఎన్నిక‌లు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైంది. జులై 3న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. ఈమేరకు జూన్ 9న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జులై 7న లెక్కింపు ఉంటుందని, నామినేషన్ల గడువు జూన్‌ 16 వరకు, 17న నామినేషన్ల పరిశీలన, 19న ఉపసంహరణ ఉంటుదని అధికారులు చెప్పారు. స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు ఎన్నిక నిర్వహించేందు కోసం కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలును విడుదల చేసింది. 2013-2015 సంవత్సరాల్లో పదవీకాలం పూర్తిచేసుకున్న 11 మంది సభ్యుల స్థానాలకు సాధారణ ఎన్నికతోపాటు 2012లో రాజీనామా చేసిన ఎస్.వి.మోహన్‌రెడ్డి స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు షెడ్యూలును జారీ చేసింది. 2012, 2013లో ఖాళీ అయిన స్థానాలకు అప్పట్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. నాడు స్థానిక సంస్థలు మనుగడలో లేనందున జరపలేకపోయారు. ఆ తరువాత కొద్దికాలానికే రాష్ట్ర విభజన పరిణామాలు చోటు చేసుకున్నాయి.దీంతో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఆల‌స్యం జ‌రిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్ర‌స్తుతం 12 స్థానాలకోసం షెడ్యూలును జారీ చేసింది. కృష్ణా, గుంటూరు, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో రెండు చొప్పున‌, అనంత‌పురం, తూర్పుగోదావ‌రి, చిత్తూరు, ప్ర‌కాశం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక్కొక్క‌టి చొప్పున స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. క‌ర్నూలు జిల్లా స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతుంది.