బాబు కోసం వెంకయ్య రాయబారం?

ఓటుకు నోటు కేసు చంద్రబాబు మెడకు కూడా చుట్టుకునేలా ప‌రిస్థితులు ఉండ‌డంతో పెద్ద త‌ల‌కాయ‌లు రంగంలోకి దిగుతున్నాయ‌ని తెలుస్తోంది. చంద్ర‌బాబు ప్ర‌తిష్ట‌కు మ‌చ్చ లేకుండా ఆయ‌న్ని సుర‌క్షితంగా త‌ప్పించేందుకు కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు పావులు క‌దుపుతున్నార‌ని వినికిడి. చంద్రబాబు నేరుగా స్టీఫెన్‌తో మాట్లాడిన అడియో టేపులు ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. అలాగే చంద్ర‌బాబు-రేవంత్‌రెడ్డి సంభాష‌ణ‌ల రికార్డులు కూడా ఉన్న‌ట్టు తెలంగాణ హోంమంత్రి స్వ‌యంగా చెప్పారు. ఇవి ఉన్నా కూడా చంద్రబాబును ఇంత‌వ‌ర‌కు కేసులో ముద్దాయిగా రికార్డు చేయ‌లేదు. ఈ సాక్ష్యాలు నిజమైతే, కేసిఆర్ ఎందుకు ఊరుకున్నట్లు? అయితే సాక్ష్యాలు ఉండకపోయి ఉండాలి లేదా ఆయ‌న త‌ర‌ఫున‌ ఎవరైనా వ‌త్తాసు ప‌లుకుతూ ఉండాలి. బాబుకు, కేసీఆర్‌కు కామ‌న్‌ మిత్రుడు ఎవరన్నా ఉన్నారంటే అది వెంకయ్య నాయుడే. బహుశా ఈ న‌మ్మ‌కంతోనే రాజ‌కీయ వ‌ర్గాలు వెంక‌య్య రాయ‌బారం న‌డుపుతున్నార‌ని భావించి ఉండ‌వ‌చ్చు. కేంద్ర‌మంత్రిగా వెంక‌య్య మాట‌కు కేసీఆర్ ద‌గ్గ‌ర విలువ ఉంది. పైగా కేంద్రంతో టీఆర్ఎస్ పార్టీకి అవ‌స‌రాలూ ఉన్నాయి. కేంద్ర మంత్రివ‌ర్గంలో స్థానం కోసం క‌విత ఎదురు చూస్తున్న‌ట్టు వార్త‌లూ ఉన్నాయి. ఈ అన్నిటి క‌ల‌బోత‌తో చూస్తే… నిజంగా వెంక‌య్య‌నాయుడు రంగంలోకి దిగితే చంద్ర‌బాబు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. కేసీఆర్‌కు స‌న్నిహితంగా ఉంటున్న‌ మీడియా పెద్ద‌లు కూడా చంద్ర‌బాబు త‌ర‌ఫున రాయ‌బారం నడుపుతున్నార‌ని చెబుతున్నారు.