బాబు పాల‌న‌పై ప్ర‌జ‌లే నిర్ణేత‌లు: జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతం మంగళగిరిలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర దీక్ష బుధవారం ప్రారంభమైంది. ఏడాది పాలనలో ఇచ్చిన హామీల అమలులో టీడీపీ ప్ర‌భుత్వం విఫలమైందని ఆరోపిస్తూ జగన్‌ దీక్ష చేపట్టారు. రెండు రోజులపాటు దీక్ష కొనసాగనుంది. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమరదీక్షకు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు పాల‌న‌పై జ‌గ‌న్ 100 ప్ర‌శ్న‌లతో ప్ర‌జా బ్యాలెట్‌ అస్త్రాన్ని సంధించారు. బాబు పాల‌న‌పై ఎన్ని మార్కులివ్వాలో మీరే నిర్ణ‌యించండి అని ఆయ‌న ప్ర‌జ‌ల్ని కోరారు. బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన వంద హామీలు ఈ బ్యాలెట్ ప‌త్రంలో ఉంటాయ‌ని, ఎస్‌, నో… అనే ఆప్ష‌న్‌తో ఈ ప‌త్రం పూర్తి చేసి మార్కులు వేయండ‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. క‌త్తి లేకుండానే డ్వాక్రా మ‌హిళ‌ల‌ను, రైతుల‌ను ఏపీ సీఎం హ‌త్య చేశార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. అప్పులు తీర్చ‌లేక రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ప‌రిస్థితులు తెచ్చింది చంద్ర‌బాబేన‌ని ఆయ‌న దుయ్య‌బట్టారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల్లో ఒక్క‌టైనా అమ‌ల‌య్యిందా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక‌ హోదా ఇవ్వ‌న‌పుడు కేంద్ర మంత్రివ‌ర్గంలో టీడీపీ మంత్రుల‌ను ఎందుకు ఉంచిన‌ట్టో బాబు స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న అన్నారు. ఏపీ రాజ‌ధానికి భూములు బ‌ల‌వంతంగా తీసుకోవ‌డాన్ని త‌మ పార్టీ వ్య‌తిరేకిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌త్యేక హోదాపై ఎందుకు నిల‌దీయ‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఓటేసిన నిరుద్యోగుల‌కు రూ. 2000 నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జాబు కావాలంటే బాబు రావాల‌న్న నినాదం ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌య్యింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బాబు హామీ న‌మ్మి కోటీ 75 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు భృతి కోసం ఎదురు చూస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. రైతులు ఇంట్లో కూర్చుని కుమిలి పోతున్నారు… డ్వాక్రా మ‌హిళ‌లు రుణాలు తీర్చ‌లేక న‌లిగిపోతున్నారు… వీరంద‌రి ఉసురు బాబుకు త‌గులుతుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని ఆనాడు చెప్పిన చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం న‌వ నిర్మాణ దీక్ష‌లో ప్ర‌త్యేక హోదాతోనే రాష్ట్రం బాగుప‌డిపోద‌ని అన‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.