కృష్ణా జలాలు తాగితే ప్ర‌మాదం! 

కృష్ణా జలాలు పవిత్రమే కావచ్చు కానీ నేరుగా తాగేందుకు ఈ నీరు ఏమాత్రం సురక్షితం కాదు. శుద్ధి చేయకుండా అలాగే తాగేస్తే రోగాలు రావడం ఖాయం. కృష్ణానదే కాదు దేశంలోని ఏడు ప్రధాన నదులదీ ఇదే పరిస్థితి. ‘తేరీ’ అనే సంస్థ నిర్వహించిన ప్ర‌జా సర్వేలో జ‌నం వ్య‌క్తం చేసిన అభిప్రాయాలివి. నదీ జలాలు, దాని పరిసరాల్లోని పరిశుభ్రత, వీచే గాలి తదితర అంశాలపై ఇటీవల ఈ సంస్థ అభిప్రాయ సేకరణ జరిపింది. ఈ సంస్థ సర్వేకు ఏడు నదీ నగరాలను ఎంపిక చేసుకుంది. కృష్ణానది (విజయవాడ-ఆంధ్రప్రదేశ్), గంగ (వారణాసి), యమున (ఢిల్లీ), మహానది (కటక్), బ్రహ్మపుత్ర (డిబ్రూగఢ్‌-అస్సాం), నర్మద (జబల్‌పూర్‌-మధ్యప్రదేశ్), తపతి (సూరత్‌- గుజరాత్)లలో అభిప్రాయ సేకరణ జరిపింది. ఇందులో 86 శాతం మంది శుద్ధి చేయనిదే నదీ జలాలను నేరుగా తాగలేమని చెప్పారు. 46 శాతం మంది తమ నగరాల్లో నదీ జలాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, 35 శాతం మంది ఫరవాలేదని, 18 శాతం మంది నదుల్లోని నీరు బాగుందని చెప్పారు. నదుల పరిసరాల్లో పరిశుభ్రత గురించి అడిగిన ప్రశ్నలకు 56 శాతం మంది దుర్గంధం భరించరానిదిగా ఉందన్నారు. పరిస్థితుల్లో ఏమంత మార్పు రాలేదని 24 శాతం మంది, కొంత మార్పు కనిపిస్తోందని 17 శాతం మంది చెప్పారు. నదుల కాలుష్యానికి మురుగు నీరే ప్రధాన కారణమని 92 శాతం మంది అభిప్రాయపడ్డారు.