సహనం (Devotional)

సహనం చాలా గొప్పదే. సహనంగా ఉండడం వల్ల సంఘర్షణకు అవకాశం ఉండదు. కానీ అన్నిచోట్లా సహనం పనికి రాదు. ఎందుకంటే ఆ సహనాన్ని అవకాశంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి పరిస్థితికి అవకాశం ఇవ్వకూడదు. సాధారణంగా చెబుతూ ఉంటారు. దిక్కుతోచకుంటే పిల్లికూడా తిరగబడుతుందని.

            సహనం మనల్ని నిర్వీర్యుల్ని చెయ్యకూడదు. మన చైతన్యాన్ని చంపకూడదు. సహనానికి ఉన్న పరిమితుల్ని మనం గుర్తించాలిప్రపంచంలో మన ఉనికి అన్నది చర్యా ప్రతి చర్యల మీద ఆధారపడి వుంటుంది. అవి హద్దులు దాటనంత మేరకు అంతా సవ్యంగానే సాగుతుంది. అవి హద్దుల్ని దాటితే సంఘర్షణ వస్తుంది. మనం ఈ ప్రపంచంలో ఉన్నది ఇతరుల మీద అధికారం చెలాయించడానికి కాదు. కానీ ఇతరులు మన మీద అధికారం చెలాయించకుండా కూడా మనం అప్రమత్తంగా ఉండడం అవసరం.

            ఒక సాధువు ఒక గ్రామంలో ప్రవచనాలు చెప్పి గ్రామస్థుల్ని సంతోష పెట్టాడు. ఆయన చెప్పే పవిత్ర వాక్యాలు, పిట్ట కథలు అందర్నీ అలరించాయి. మూడు రోజులపాటు ప్రార్థనలతో, పాటలతో సందడిగా గడిచింది.ఆ సాధువు అందరి దగ్గరా సెలవు తీసుకుని వెళ్ళడానికి సిద్ధ పడ్డాడు. అప్పుడు గ్రామస్థులు “స్వామీ! మీరు భగవత్‌ సంకల్పం చెప్పి మమ్మల్ని తరిపంజేశారు. ఇంకో చిన్ని సాయం చేయాలి” అన్నారు. సాధువు “ఏమిటది?” అని అడిగాడు.  గ్రామస్థులు “మా ఊళ్ళో ఒక పాము తిరుగుతోంది. ఇప్పటికే అది ముగ్గుర్ని కాటేసింది. మీరు పశుపక్ష్యాదుల్తో కూడా సంభాషణ చెయ్యగల సమర్ధులని విన్నాం. దయచేసి మీరు ఆ పాముతో మాట్లాడి దాంతో మమ్మల్ని హింసించ వద్దని చెప్పండి. ఆ పని చేయడానికి మీరు సమర్ధులు” అన్నారు.

            సాధువు సరేనని ఊరు చివరికి వెళ్ళి పామును ఆవాహన చేసి దాంతో “నువ్వు ఈ గ్రామంలో ఎవర్నీ కాటు వెయ్యకు” అని చెప్పాడు. పాము సరేనంది. సాధువు గ్రామస్థులకు అభయమిచ్చి వెళ్ళిపోయాడు. మూడు నెలల తరువాత సాధువు ఆ గ్రామం గుండా ఎక్కడికో వెళుతూ ఉంటే ఆ పాము ఎదురయింది. దాన్ని చూసి సాధువు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే దాని ఒళ్ళంతా గాయాలు, రక్తం ఓడుతూ బలహీనంగా మరణించే పరిస్థితిలో ఉంది. దాన్ని చూడగానే సాధువుకు జాలి వేసింది. దాని గాయాల్ని కడిగి మందు వేసి దాన్ని కోలుకునేలా చేసి ఏమయింది ఎందుకిలా తయారయ్యావన్నాడు.

            పాము “స్వామీ! మీరు ఎవర్నీ కాటెయ్యవద్దని చెప్పారు. ఆరోజు నించీ ఈ రోజు దాకా ఎవర్నీ నేను కాటెయ్యలేదు. కానీ అందరికీ అందువల్ల చులకన అయ్యాను. ప్రతి పసి పిల్లవాడూ నాతో ఆడుకునేవాడే. ప్రతివాడూ నన్ను కట్టెతో కొట్టే వాడే, రాళ్ళతో గాయ పరిచేవాడే. ఎవరికీ నేనంటే భయం లేదు. నా బతుకు హీనాతిహీనంగా మారిపోయింది” అంది. సాధువు “కాని ఒక విషయం మరచిపోయావు. నేను కాటు వెయ్యొద్దని చెప్పానే కానీ బుసకొట్టి భయపెట్టవద్దని చెప్పానా?” అన్నాడు.

– సౌభాగ్య