‘రాష్ట్రానికి మోసగాడు’ పుస్త‌కం విడుద‌ల

సమరదీక్ష సాక్షిగా చంద్రబాబు మోసాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం  ‘రాష్ట్రానికి మోసగాడు’ పుస్తకాన్ని విడుదల చేశారు. చంద్ర‌బాబు పాల‌న‌లో జ‌నం ఎలా మోస‌పోయిందీ… ఆయ‌న ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా జ‌నాన్ని ఎలా మోసం చేస్తున్న‌దీ వివ‌రించిందీ పుస్త‌కం. గుంటూరు జిల్లా మంగళగిరి వై జంక్షన్ వద్ద చేపట్టిన సమరదీక్ష రెండోరోజు కూడా కొనసాగుతోంది. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారు. రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారనేది ‘రాష్ట్రానికి మోసగాడు’ పుస్తకంలో స‌వివ‌రంగా ఉంద‌ని, ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకమని అన్నారు. టీడీపీ ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు, అమలు జరుగుతున్న తీరుతెన్నులు తదితర అంశాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయని చెవిరెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ రైతులంటే చంద్ర‌బాబుకు మొద‌టి నుంచీ చిన్న‌చూపేన‌ని, వ్య‌వ‌సాయం అంటే ఎందుకో ఆయ‌న‌కు వెగ‌ట‌ని ఆరోపించారు. అందుకే రైతుల్ని బ‌లి చేయ‌డానికి ఆయ‌న ఎప్పుడూ సిద్ధంగా ఉంటార‌ని ఆరోపించారు. బాబు యేడాది పాల‌న‌లో అన్ని వ‌ర్గాలు న‌ష్ట‌పోయాయ‌ని, ప్ర‌జ‌ల్లో ఏ వ‌ర్గం కూడా సంతోషంగా లేద‌ని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌జ‌ల ప‌ట్ల ముఖ్యంగా రైతుల ప‌ట్ల నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ ప్ర‌భుత్వానికి పాలించే అధికారం లేద‌ని, అవినీతితో కూడిన తెలుగుదేశం ప్ర‌భుత్వం గ‌ద్దె దిగాల‌ని ఆయ‌న డిమాండు చేశారు.