Telugu Global
Family

విదురుడు (For Children)

సత్యవతీ శంతనుల సంతానమైన చిత్రాంగదుడు చనిపోగా, విచిత్ర వీర్యుడు పిల్లల్ని కనక ముందే కన్నుమూసాడు. భర్తపోయిన భార్యలు అంబిక, అంబాలికలు అత్త సత్యవతి కోరిక మేరకు వ్యాసుని వల్ల పాండురాజునీ, ధృతరాష్ట్రునీ కన్నప్పటికీ ఒకరు పాండు దేహంతోనూ మరొకరు పుట్టి గుడ్డి కావడం వల్ల మరొక మంచి బిడ్డను కోరుకొని దాసిని ముస్తాబు చేసి పంపింది అంబిక. అలా దాసికీ వ్యాసునికీ పుట్టిన వాడే విదురుడు. అయితే మాండవ్యుని శాపం వల్ల యముడే విదురుడిగా జన్మనెత్తాడు. ధృతరాష్ట్రుడూ […]

సత్యవతీ శంతనుల సంతానమైన చిత్రాంగదుడు చనిపోగా, విచిత్ర వీర్యుడు పిల్లల్ని కనక ముందే కన్నుమూసాడు. భర్తపోయిన భార్యలు అంబిక, అంబాలికలు అత్త సత్యవతి కోరిక మేరకు వ్యాసుని వల్ల పాండురాజునీ, ధృతరాష్ట్రునీ కన్నప్పటికీ ఒకరు పాండు దేహంతోనూ మరొకరు పుట్టి గుడ్డి కావడం వల్ల మరొక మంచి బిడ్డను కోరుకొని దాసిని ముస్తాబు చేసి పంపింది అంబిక. అలా దాసికీ వ్యాసునికీ పుట్టిన వాడే విదురుడు. అయితే మాండవ్యుని శాపం వల్ల యముడే విదురుడిగా జన్మనెత్తాడు. ధృతరాష్ట్రుడూ పాండురాజు ఇద్దరూ విదురుణ్ని సోదర సమానంగా చూసుకొనేవాళ్ళు. విదురుడూ వారిపట్ల అంతే విధేయతగా ఉండేవాడు.

విదురుడు ధైర్యశాలి. అంతకు మించి న్యాయశీలి. నీతిపరుడు. పాండవులను గుణగణాల వల్ల ఇష్టపడ్డాడు. దుర్యోధనుని ద్వేషాన్ని గ్రహించాడు. ధృతరాష్ట్రునికి ఎన్నో విధాల సహాయకారిగా ఉండి సలహాలను కోరితే ఇచ్చేవాడు. పాండవులు కాశీనగరానికి వెళ్ళే మార్గంలో దుర్యోధనుడు కట్టిన లక్కయిల్లు గురించి తెలిసి విదురుడు ముందే హెచ్చరించాడు. శత్రువుల కుతంత్రాలను అర్ధం చేసుకోమన్నాడు. లోహంతో చేయబడిని శస్త్రం ఉందన్నాడు. ఎండిన గడ్డి అడవిని దహిస్తుంటే కలుగులో ఎలుక తెలివిగా బయట పడుతుందన్నాడు. ధర్మరాజుకి మాటల మర్మం అర్థమయింది. దాంతో విదురుడే పంపిన ఖననకుని సాయంతో లక్కయింట్లో నుండి సొరంగ మార్గాన బయటపడ్డారు. దుర్యోధనుని దగ్గర మంత్రిగా ఉండి పాండవులను కాపాడుకున్నాడు. పాండవులు చనిపోయారని ధృతరాష్ట్రుడు బాధపడినా చెప్పలేదు. ద్రౌపదిని మత్స్యయంత్రము కొట్టి పాండవులు గెలుచుకున్నారని తెలిసి సంతోషిస్తూనే ధృతరాష్ట్రుడు బాధపడినప్పుడు విదురుడు నీతి గలిగిన పరిష్కారం చెప్పాడు. పాండవులకు వారి రాజ్య భాగం వారికిమ్మన్నాడు. అందుకు సమ్మతించడంతో విదురుడే ద్రుపద నగరానికి వెళ్ళి తీసుకొని వచ్చాడు. పాండవులకు అర్ధరాజ్యం వచ్చిందీ యుద్ధం జరగకుండా నిలిచిందీ విదురుని వల్లే. మాయా జూదపు ఆలోచన చేసినపుడు వద్దని చెప్పాడు. అన్నదమ్ముల మధ్య ద్వేషం పెరుగుతుందన్నాడు. విదురుని మాట వినలేదు. పాండవులు జూదంలో ఓడినప్పుడు ద్రౌపదిని తీసుకు రమ్మన్నప్పుడు విదురుడు వద్దన్నాడు. ద్రౌపది వేసిన ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పమన్నాడు. ద్రౌపది వస్త్రాపహరణం తగదని ధృతరాష్ట్రునికి చెప్పి దుర్యోధనుని వారించమన్నాడు. పాండవుల్ని అడవులపాలు చేయడం తగదన్నాడు. కుంతిని తన వద్దనే ఉండమన్నాడు. పాండవుల రాజ్యం పాండవులకు ఇవ్వమని కోరి పాండవ పక్షపాతిగా మాటపడ్డాడు. దేశం విడిచి పొమ్మంటే పోయాడు. రమ్మంటే వచ్చాడు. ధృతరాష్ట్రుడు తనబాధ చెప్పుకుంటే విదురుడు చెప్పిన నీతి “విదుర నీతి”గా ప్రాచుర్యం పొందింది. పాండవుల అజ్ఞాతవాసం ముగిసాక కృష్ణుడు రాయబారిగా వచ్చి విదురుని ఇంట భోంచేసాడు. సంధి పొసగదని విదురుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. యుద్ధంలో ఏ పక్షమూ చేరలేదు. యుద్ధ సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళాడు. మైత్రేయుని వలన ఆత్మజ్ఞానం తెలుసుకొని వచ్చాడు. అప్పటికి యుద్ధం అయిపోయింది. పాండవులు గౌరవంగా రాజ్యానికి ఆహ్వానించినా, ధృతరాష్ట్రుని దుఃఖాన్ని పోగొట్టి సంసారం నిస్సారం అని చెప్పాడు. వైరాగ్యం చాటున అసలు అర్థం చెప్పాడు. పాత వస్త్రం విడిచి కొత్త వస్త్రం ధరించినట్టు… పాత ఇల్లును వదిలి కొత్త ఇల్లును చేరినట్టు జీవం ఒక దేహం వదిలి మరో దేహంలోకి ప్రవేశిస్తుందని చెప్పి, పాండవులూ మీ బిడ్డలే వారిని చూసుకొని ప్రశాంతంగా ఉండమని కోరాడు. ధృతరాష్ట్రునితో గాంధారీ కుంతీ అంతా అడవులకు తపస్సుకు వెళ్ళారు. వారితో విదురుడూ వెళ్ళాడు. కొన్నాళ్ళకు ధర్మరాజు అడవికి వస్తే ఎవరికీ కనిపించని విదురుడు ధర్మరాజుకు మాత్రం కనిపించాడు. పిలిచినా పలకకుండా నగ్న దేహంతో నడుస్తున్నాడు. ధర్మరాజు పిలుపుతో ఆగాడు. యోగశక్తితో దేహాన్ని విడిచి ధర్మరాజులో ఐక్యమయ్యాడు.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  3 Jun 2015 1:02 PM GMT
Next Story