11న కూతురి నిశ్చితార్థం..రేవంత్‌కు బెయిల్ దొరికేనా !

హైదరాబాద్‌లో ఈనెల 11వ తేదీన రేవంత్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం జరగనుంది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణకు రానుంది. మరోవైపు… రేవంత్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలన్న ఏసీబీ అభ్యర్థనపైనా శుక్రవారమే విచారణ జరుగుతుంది. 11వ తేదీలోపు బెయిల్‌ తప్పకుండా వస్తుందని రేవంత్‌ తరఫు న్యాయవాదులు భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు మాత్రం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఒకవేళ… నిశ్చితార్థం నాటికి బెయిలు రాని పక్షంలో, కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఆ శుభ కార్యానికి రేవంత్‌ హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు… గురువారం రేవంత్‌ను లాయర్లు జంధ్యాల రవిశంకర్‌, ప్రమోద్‌ రెడ్డి జైలులో కలిసినట్లు తెలిసింది. బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం జరగనున్న విచారణ గురించే వీరు మాట్లాడుకున్నట్లు సమాచారం.