అగస్త్యుడు (For Children)

ఒకనాడు సూర్యుడూ వరుణుడూ ఇద్దరూ విహారానికి వెళ్తూ అందాల అప్సరసైన ఊర్వశిని చూసారు. మనసు చలించింది. తేజస్సు జారింది. ఊర్వశి ఆరెండు తేజస్సులను విడి విడి కుండలలో పెట్టింది. ఒక దాంట్లో వసిష్ఠుడు మరొక దాంట్లో అగస్త్యుడు పుట్టారు. కుండలో నుండి పుట్టినందున అగస్త్యునికి “కుంభ సంభవుడు” అనే పేరు వచ్చింది. వీరిద్దరినీ “మైత్రా వరుణి” అంటారు. అంటే మిత్రుడంటే సూర్యుడు గనుక, మిత్రుడికీ వరుణుడికీ పుట్టిన వాళ్ళనే అర్థంలో అలా పిలుస్తారు.

            బ్రహ్మచారిగా బ్రతికిన అగస్త్యుడు ఒక రోజు వనంలోంచి వస్తూవుంటే కొందరు తలక్రిందులుగా వేళ్ళాడుతూ ఉన్నారు. సంతానం లేని తమ వంశపు భవిష్యత్తు తలక్రిందులుగా ఉండడం వల్లనే అలా ఉన్నారని అగస్త్యునికర్థమైంది. తన వాళ్ళకోసం తాను పెళ్ళాడాలనుకున్నాడు. విదర్భరాజుకు తన అనుగ్రహంతో కూతురు కలిగేలా చేసాడు. ఆ కూతురైన లోపాముద్రను పెళ్ళాడతానన్నాడు. తండ్రి సంశయించినా లోపాముద్ర సందేహించలేదు. సమ్మతించింది. పెళ్ళి జరిగింది. అగస్త్యుడు అర్ధాంగిని కోరిక కోరితే, లోపముద్ర వస్త్ర భూషితాలనుకోరింది. అగస్త్యుడు తపస్సుకు తప్ప ధనానికి సమయం వెచ్చించలేదు. అందుకని శ్రుతపర్వుడనే రాజుని ధనం ఇమ్మన్నాడు. ప్రధ్నశ్వుని కూడా అడిగాడు. దక్కక పోవడంతో త్రిపదస్యుడనే రాజు దగ్గరకూ వెళ్ళాడు. చివరకు ఇల్వలుడి దగ్గర ధనం దొరుకుతుందని వెళ్ళాడు. అయితే ఇల్వలుడూ వాతాపి ఇద్దరూ రాక్షసులూ అన్నదమ్ములూ. ఎవరు వచ్చీ పోయినా భోజనం పెట్టేవారు. ముందు వాతాపి మేకగా మారేవాడు. ఇల్వలుడు ఆమేకను వండి వడ్డించేవాడు. వచ్చిన ఋషులు ఆ ఆహారం తిన్నాక, “వాతాపి… వాతాపి… ఎక్కడున్నావ్‌… బయటకు రా” అని అన్న ఇల్వలుడు పిలిచేవాడు. పిలుస్తూ మంత్రం జపించేవాడు. తనను తిన్న వాళ్ళ పొట్టలను చీల్చుకొని వాతాపి బయటకు వచ్చేవాడు. అలా చనిపోయిన వాళ్ళని ఆరగించే వాళ్ళు ఆ రాక్షస అన్నదమ్ములు. అందరి మీద జరిగినట్టే అగస్త్యుని మీద కూడా అదే ప్రయోగం జరిగింది. అగస్త్యుడు అసలు విషయం పసిగట్టాడు. ఇల్వలుడు పిలవక ముందే, మంత్రం జపించక ముందే అగస్త్యుడు “జీర్ణం… జీర్ణం… వాతాపి జీర్ణం…” అన్నాడు. అంతే వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇల్వలుడు ఏమి అనలేక అడిగినంత ధనమిచ్చి పంపాడు. ఆ ధనాన్ని అగస్త్యుడు భార్యకిచ్చి కోరిక నెరవేర్చుకున్నాడు. ఫలితమే దృఢస్యుడనే పుత్రుడు. తేజస్వి అనే పౌత్రుడు.

            కవేర తనయ శివుని గురించి తపస్సు చేయడం చూసి బ్రహ్మ అగస్త్యుని దగ్గరకు వచ్చి ఆమెని పెళ్ళాడమన్నాడు. తాను నదినవుతానంది. ఒప్పుకున్నాడు. పెళ్ళాడాడు. ఆమెను మంత్రించి కమండలంలో పెట్టుకున్నాడు. ఆమెయే కావేరి నదిగా తరువాత ప్రవహించింది.

            వింధ్య పర్వతం విర్రవీగింది. ఆకాశాన్ని అందుకొనేలా పెరిగిపోతూ సూర్య చంద్రుల మధ్య నిలబడి రాత్రీ పగలూ తేడా లేకుండా చేసింది. చిమ్మ చీకటి కమ్ముకుంది. అవస్తలకు అంతులేకుండా పోయింది. జీవులంతా మొరపెట్టుకున్నా వింధ్య వినలేదు. బ్రహ్మ మాట మేరకు అంతా అగస్త్యుని ఆశ్రయించారు. అగస్త్యుడు తన వైపుగా రావడంతో దారిమ్మని కోరడంతో ఆశీర్వాదం అర్ధించి వింద్య తలదించి తన రూపాన్ని ఉపసంహరించుకొని ఎప్పట్లాగే ఉండిపోయింది. తాను తిరిగి వచ్చే వరకూ అలాగే ఉండమన్నాడే కాని అగస్త్యుడు ఆ మార్గాన తిరిగి రాలేదు. దాంతో వింద్య పర్వతం ఉన్న చోట ఉన్న విధంగా ఉండిపోయింది. ఇదిలా ఉంటే మునులను ముప్పుతిప్పలు పెట్టి రాక్షసులు సముద్ర గర్భంలో దేవతలకు దొరక్కుండా దాక్కొనేవారు. అగస్త్యున్ని వేడుకోవడంతో ఆ సముద్రాన్నంతా ఒక్క గుక్కలో తాగేసాడు. దాక్కున్న రాక్షసులు దొరికిపోయి దేవతల చేతిలో హత మయ్యారు. అలాగే వృత్తాసురుణ్ని వధించడంలో ఇంద్రుడికీ ఇలాగే సముద్రాన్ని తాగి సహకరించాడు.

            రాముడు అరణ్యవాసాన అగస్త్యుని దర్శించుకొన్నప్పుడు దివ్యఖడ్గాన్నిశరాసనము ఇచ్చాడు. రావణయుద్ధంలో రాముడు అధైర్యపడకుండా ఆదిత్య మంత్రాన్ని జపించమని చెప్పి ఆదుకున్నాడు. లోక హితమే అగస్త్యుని జీవితము!.

– బమ్మిడి జగదీశ్వరరావు