అవినీతిలో సీఎంలు ఇద్ద‌రూ మొన‌గాళ్ళే: భ‌ట్టి

ఏపీ, తెలంగాణ సీఎంలను కేంద్రం బర్తరఫ్‌ చేయాలని టి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్‌ కంటే ముందే కేసీఆర్‌ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు పదవులు ఎరవేయడం లంచం కాదా? అని నిలదీశారు. కేసీఆర్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీ చైర్మన్లను కూడా కొన్నారని ఆరోపించారు. ఒకాయన డబ్బులిస్తే.. కేసీఆర్‌ పదవులిచ్చారని అన్నారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపాలని భట్టీ డిమాండ్ చేశారు. ఎడ్లబండి కింద కుక్కలాగా పడుకుని తెలంగాణానంతా తానే మోస్తున్నట్లు.. కేసీఆర్‌ ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తాగుబోతుల భాషను మాట్లాడుతున్నారని విమర్శించారు.