Telugu Global
Others

చంద్ర‌బాబు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా? ఆయ‌న వ్య‌వ‌హార శైలి, వ్యాఖ్య‌లు చూస్తోంటే.. అలాగే అనిపిస్తోంది. దాదాపు ద‌శాబ్దంపాటు ఉమ్మ‌డి ఏపీకి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఏడాదికాలంగా విడిపోయిన ఏపీకి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తున్నారు. అలాంటి వ్య‌క్తిపై అక్ర‌మాల ఆరోప‌ణ‌లు వ‌స్తే ఏంచేయాలి?  వాటిని ఉన్న‌ప‌లంగా ఖండించాలి. బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి రాష్ర్ట ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు వ‌స్తాయంటూ రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేయ‌డ‌మేంట‌ని ప్ర‌జ‌లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. నిజంగా ఓటుకు నోటు కేసులో ఆయ‌న పాత్ర లేకుంటే దానిని […]

చంద్ర‌బాబు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా?
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా? ఆయ‌న వ్య‌వ‌హార శైలి, వ్యాఖ్య‌లు చూస్తోంటే.. అలాగే అనిపిస్తోంది. దాదాపు ద‌శాబ్దంపాటు ఉమ్మ‌డి ఏపీకి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఏడాదికాలంగా విడిపోయిన ఏపీకి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తున్నారు. అలాంటి వ్య‌క్తిపై అక్ర‌మాల ఆరోప‌ణ‌లు వ‌స్తే ఏంచేయాలి? వాటిని ఉన్న‌ప‌లంగా ఖండించాలి. బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి రాష్ర్ట ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు వ‌స్తాయంటూ రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేయ‌డ‌మేంట‌ని ప్ర‌జ‌లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. నిజంగా ఓటుకు నోటు కేసులో ఆయ‌న పాత్ర లేకుంటే దానిని మాత్ర‌మే ఖండిస్తే స‌రిపోయేది క‌దా! ఆయన‌పై పెట్టిన కేసు కోసం తెలుగు ప్ర‌జ‌లు వారి ప‌నులు మాని తీరిక చేసుకుని కొట్టుకోవాలా?
సీఎం మాట‌లా అవి?
ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో టీడీపీఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబు నోరు మెద‌ప‌డం లేదు. క‌నీసం రేవంత్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకునేందుకు మొగ్గు చూప‌లేదు. ఈ వ్య‌వ‌హారంలో వారంరోజుల త‌రువాత చంద్ర‌బాబుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయ‌ని తెలంగాణ హోంమంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి వెల్ల‌డించిన‌పుడు కూడా స్పందించ‌లేదు. టేపుల వ్య‌వ‌హారం బ‌య‌టికి పొక్కిన‌పుడూ కూడా ఖండించ‌లేదు. సోమ‌వారం మ‌హాసంక‌ల్ప దీక్ష సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్య‌వ‌హారంపై ఎట్ట‌కేల‌కు నోరు విప్పారు. ‘కేసీఆర్ నా ఫోన్ ట్యాప్ చేశార‌’ని ఆరోపించారు. ఏసీబీ పోలీసులు స్టీఫెన్ స‌న్ ఫోన్ పై మాత్ర‌మే నిఘా పెట్టారు. అంత‌మేర‌కు వారికి అధికారం ఉంది. సీఎం ఫోన్ ట్యాప్ చేయాలంటే గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి తీసుకోవాలి. అంత అవ‌స‌రం కూడా తెలంగాణ ఏసీబీకి లేదు. రెండు రాష్ర్టాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నార‌ని ఆయ‌న‌కు అంటిన మ‌సిని ఏపీ ప్ర‌జ‌ల‌కు అంటించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ‘నాకూ ఏసీబీ ఉంది, నేనూ కేసులు పెట్ట‌గ‌ల‌ను’ అంటూ..హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేసీఆర్ ఇలాంటి ప‌నులు ఎందుకు చేస్తారు? ఆయ‌న‌కు ఏపీ వ్య‌వ‌హారాల‌తో ఎలాంటి సంబంధం లేదు.’హైద‌రాబాద్‌పై నాకూ హ‌క్కు ఉంది అని అవ‌గాహ‌న లేని మాట‌లు మాట్టాడారు’. నిజానికి పాల‌నాప‌ర‌మైన బాధ్య‌తలు నిర్వ‌ర్తించ‌వ‌చ్చేమోగానీ, హైద‌రాబాద్‌లోని స్థానిక అధికారుల‌పై ఎలాంటి అధికారాలు ఏపీ సీఎంకు, డీజీపికి లేవ‌న్న స‌త్యాన్ని దాచి మాట్లాడారు.
త‌మిళ‌నాడుకు ఏపీకి సంబంధాలు బానే ఉన్నాయిగా…!
శేషాచ‌లం అడ‌వుల్లో 20 మంది కూలీల కాల్చివేత త‌రువాత కొన్ని రోజుల‌పాటు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వాస్త‌వానికి ఎన్‌కౌంట‌ర్ త‌రువాత ఏపీ బ‌స్సుల‌పై దాడులు జ‌రిగాయి. చంద్ర‌బాబుతోపాటు ఏపీకి చెందిన ప‌లు ఆస్తుల‌పైనా దాడులు జ‌రిగాయి. ప్ర‌స్తుతం అంతా స‌ద్దుమ‌ణిగింది. మ‌రి, బాబు లెక్క ప్ర‌కారం విద్వేషాలు మ‌రింత‌ పెర‌గాలి క‌దా! ఎందుకు స‌మ‌సిపోయాయి? అప్పుడు త‌మిళ‌నాడు సీఎం ఘ‌ట‌న‌ను ఖండించి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. చేత‌నైతే బాబు కూడా ఇదే పంథాను అనుస‌రించ‌వ‌చ్చు కానీ, తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు అంటూ సున్నిత‌మైన అంశాన్ని తెర‌పైకి తెచ్చి, అస‌లు విష‌యాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రో విష‌యం.. నా ఫోన్ ట్యాప్ చేశార‌ని ఆరోపించారు. అంటే స్టీఫెన్‌స‌న్‌తో ఆయ‌న మాట్లాడిన మాట‌లు వాస్త‌వ‌మేన‌ని ఒప్పుకుంటున్నారా? మొన్న ఏపీ ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారు ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో స‌గం నేరం ఒప్పుకున్న‌ట్లు మాట్లాడారు. ఇప్పుడు అచ్చంగా అలాంటి వ్యాఖ్య‌ల‌తోనే సగం నేరం చంద్ర‌బాబు ఒప్పుకున్న‌ట్లేనా? అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. రేవంత్ అరెస్ట‌యిన 9 రోజుల‌కు గానీ ఎందుకు నోరు తెర‌వ‌లేదు? అని టీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ నేత‌లు అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు వ‌ద్ద స‌మాధానం ఎందుకు లేదో ఆయ‌న‌కే తెలియాలి! మొత్తానికి ఈ వ్య‌వ‌హారంలో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డ బాబు ఏం మాట్టాడుతున్నారో ఆయ‌న‌కే తెలియ‌డం లేదు. ఇది మాత్రం వాస్త‌వం.
First Published:  8 Jun 2015 9:00 PM GMT
Next Story