మెట్ట వేదాంతం (Devotional)

మెట్ట వేదాంతం, స్మశాన వైరాగ్యం వంటి మాటలు మనకు ఉన్నాయి. మనకోసం కాక ఇతరులకోసం చెప్పే నీతి బోధల్ని మెట్ట వేదాంతమంటారు. ఎవరయినా వ్యక్తి చనిపోయినపుడు అతన్ని స్మశానానికి తీసుకెళ్ళినపుడు అక్కడికి వెళ్ళిన అందరికీ అక్కడున్నంత సేపు జీవితం ఎంత క్షణికమైందో అనిపిస్తుంది. బతుకు పట్ల విరక్తి కలుగుతుంది. అక్కడి నించీ వస్తూనే ఎవడికి వాడు పనుల్లో మునిగి ప్రపపంచం అశాశ్వతమన్న మాటే అనుకోరు. అది స్మశానవైరాగ్యమంటారు.

            ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రాణ స్నేహితులు. కష్టాల్లో సుఖాల్లో కలిసి ఉండేవాళ్ళు. ఒకరికొకరు సాయం చేసుకునే వాళ్ళు. రక్త సంబంధీకుల్లా వాళ్ళు కలిసిపోయారు. ఒకరింటికి ఒకరు రాకపోకలు చేసేవారు.

            ఇట్లా వుంటే మొదటి మిత్రుడి భార్య హఠాత్తుగా చనిపోయింది. జీవితంలో జరిగిన ఈ సంఘటనకు అతను షాక్‌ తిన్నాడు. సజావుగా సాగే అతని జీవితంలో ఇది పిడుగుపాటు లాంటిది. దాంతో అతను గుండెలవిసేలా రోదించాడు. భార్య శరీరం మీద పడి లబోదిబోమని ఏడ్చాడు. ఎవరు ఎంత ఓదార్చినా అతనికి దుఃఖం ఆగలేదు. ఆమె మంచి తనాన్ని, అన్యోన్యతను తలచుకుని మాటిమాటికే కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు.

            రెండో మిత్రుడు పరిస్థితి గమనించాడు. స్నేహితుడి దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేసి “మిత్రమా! జీవితం అశాశ్వతం. అందరూ ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఒకరు ముందు ఒకరు వెనక” అన్నాడు.

            అయినా మిత్రుడి కన్నీళ్ళు ఆగలేదు. జ్ఞాపకాల్ని తవ్వుకుంటూ బాధ పడుతున్నాడు. “రెండోమిత్రుడు” నిజానికి మనం చనిపోతామనుకుంటాం కానీ చనిపోయేది శరీరం మాత్రమే కానీ ఆత్మ చనిపోదు. ఆత్మ మరణం లేనిది” అంటూ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్నిటినించీ ఉదాహరణలు చెప్పాడు. ఆ మాటల్తో మిత్రుడు కొంత శాంతించాడు.

            సంవత్సరం గడిచింది. మొదటి మిత్రుడు విషాదంనించీ కోలుకుని మామూలు మనిషయ్యాడు. మిత్రుల మధ్య స్నేహం, సహకారం కొనసాగుతున్నాయి.

            అట్లావుండగా రెండో మిత్రుని భార్య హఠాత్తుగా కన్నుమూసింది. భార్య మరణంతో అతని జీవితం అంధకార బంధురమైంది, తలకిందులయింది. పట్టలేని దుఃఖంతో పరితపించాడు. బంధుమిత్రులు వచ్చారు. ఎవరు ఎంతగా ఓదార్చినా అతని దుఃఖం ఆగడం లేదు. అప్పుడు ప్రాణమిత్రుడు రంగంలోకి దిగాడు. తన భార్య చనిపోయినపుడు మిత్రుడు తన నెలా ఓదార్చాడో గుర్తు తెచ్చుకున్నాడు.

            “మిత్రమా! అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోయేవాళ్ళమే. ఒకరు ముందు, ఒకరు వెనక. అసలు చనిపోయేది శరీరం ఆత్మకు మరణం లేదు” అన్నాడు.

            ఆ మాటల్తో మిత్రుడు దుఃఖం ఆపడంలేదు.

            వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వీటన్నిటినించీ మొదటి మిత్రుడు ఉదాహరణలు ఇస్తూపోతున్నాడు. కానీ రెండో మిత్రుడు ఏడుస్తున్నాడే కానీ ఆ మాటల్ని అసలు పట్టించుకోవడం లేదు. మొదటి మిత్రుడు ఆశ్చర్యపోయాడు. నేను సంవత్సరం క్రితం బాధలో ఉంటే ఇవే మాటల్తో మిత్రుడు నన్ను ఓదార్చాడు. ఇప్పుడు అవే మాటలు చెబుతూవుంటే అస్సలు పట్టించుకోవడం లేదు, ఎందుకు?” అనిపించింది.

            మిత్రుడితో “అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు నీకు చెబితే ఎందుకు పట్టించుకోవు” అన్నాడు. రెండో మిత్రుడు కళ్ళు తుడుచుకుంటూనే “ఇతరులకోసం చెప్పే మెట్ట వేదాంత మది. అప్పుడు చనిపోయింది నీ భార్య. ఇప్పుడు చనిపోయింది నా భార్య” అన్నాడు.

– సౌభాగ్య