ధర్మరాజు (For Children)

ధర్మరాజు. పేరులోనే వుంది అతని గుణం. సుగుణం. నిజానికి ధర్మానికే అతడు రాజు. అగ్రరాజు. పాండవుల్లోనూ అగ్రజుడు. సంతాన యోగ్యం లేని పాండురాజు అనుమతితోనే కుంతి యమధర్మరాజుని కన్నది. ధర్మ దేవుని అంశ వల్ల పుట్టినందున ధర్మాత్ముడవుతాడని, అపరిమిత ధైర్యం వల్ల “యధిష్ఠిరుడు”గా పిలవబడతాడని ఆకాశవాణి పుట్టినప్పుడే చెప్పింది.

            పదహారవ ఏటనే తండ్రిని కోల్పోయిన ధర్మరాజు తాత భీష్ముడూ పెద తండ్రి ధృతరాష్ట్రుని ఆలనలో తమ్ముళ్ళతోపాటు పెరిగాడు. కృపాచార్య ద్రోణా చార్యుల వద్ద కౌరవులతో కలసి విద్య నేర్చుకున్నాడు. యోగ్యత వల్ల యువరాజు పదవినధిష్టించాడు. అసూయ ద్వేషాలతో పాండవుల దయాదాక్షణ్యాల మీద బకతలేనన్న దుర్యోధనుని మాటల ప్రభావంతో ధర్మరాజును కాశీక్షేత్రానికి కుటుంబంతో సహా పంపాడు ధృతరాష్ట్రుడు. వారణాసి లక్కయింటి  ప్రమాదాన్ని విదురుడు నర్మగర్భంగా చెప్పినా ధర్మరాజు ఒక్కడే అందులోని అంతరార్థం గ్రహించాడు. ప్రమాదం నుండి బయటపడేలా కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అడవి మార్గంలో హిడింబినిని భీముడు నిరాకరిస్తే, ధర్మరాజు కరుణతో చూసి కోరిక తీర్చమని చెప్పాడు. బకాసురుడితో తలపడ్డ భీముడు వెళ్ళినపుడు అడ్డు చెప్పకపోయినా తమ్ముణి గురించి బాధ పడకుండా ఉండలేకపోయాడు. అలాగే అడ్డంపడ్డ అంగారపర్ణుడిని అర్జునుడు వధించబోతే, ఆపి దయతో కుంభీనసకు ప్రాణభిక్ష పెట్టాడు. మత్స్య యంత్రం కొట్టి ద్రౌపదిని చేపట్టినది అర్జునుడే అయినా – తల్లి మాట నిలిపి ద్రౌపది అన్నదమ్ములయుదుగురిదీ అనుకున్నాడు. ద్రౌపది ఒక్కొక్కరి దగ్గర ఏడాది ఉండేలా నారదుడు చేసిన ప్రతిపాదనను మన్నించాడు. ఏమరపాటున మధ్యలో వస్తే వారికి ఏడాది పుణ్యక్షేత్రాల దర్శనం చెయ్యాలి. ఆ విషయంలో అర్జునుని మన్నించాడు ధర్మరాజు. కాని అర్జునుడిని కాదని కట్టుబడి నియమం పాటించి అన్నను గౌరవించాడు. మయసభ నిర్మాణానంతరం ధర్మరాజు రాజసూయాగం చేసాడు. అసూయ అవమానాలకు గురై దుర్యోధనుడు దురాలోచనతో పాచికలాటకు పిలిస్తే వెళ్ళిన ధర్మరాజు తననీ తమ్ముళ్ళనీ చివరకు ద్రౌపదినీ ఓడిపోయాడు. సహించలేని భీముడు ఆగ్రహంతో నీచేతులు కాలిపోవాలని నిందిస్తే మౌనం దాల్చాడు ధర్మరాజు. క్షత్రియ ధర్మమని సర్దిచెప్పాడు అర్జునుడు. ద్రౌపది వస్త్రాపహరణమప్పుడూ మౌనం దాల్చాడు ధర్మరాజు. ద్రౌపదితో ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల అర్హత ఒక్క ధర్మరాజుకే ఉందంటాడు భీష్ముడు. ఏదయితేనేం అరణ్య అజ్ఞాత వాసాలకు ధర్మరాజు వెంట భార్య సోదరులు వెళ్తుంటే ధర్మమే వెళ్ళిపోతోందని ప్రజలు కన్నీరయ్యారు. ధర్మరాజు సూర్యుణ్ని ప్రార్థించి అనుగ్రహంగా అక్షయ పాత్రను పొందాడు, దానితోనే కుటుంబ పోషణ చేసాడు. దిగులు పడ్డ ద్రౌపదికి దైవాన్ని దూషించడం కన్నా ధర్మాన్ని అనుసరించి నడవడమే మార్గమమని బోధించాడు. సమస్త సామ్రాజ్యం ఒక్క సత్య వాక్కుకు సమానవైందికాదని భీమునికి చెప్పి ఆడిన మాట తప్పలేనన్నాడు. అజ్ఞాత అరణ్యవాసాలు పూర్తి చేయాల్సిందే అన్నాడు. ఆయుధాస్త్రాలను సాధించే ప్రతిస్మృతి విద్యను ధర్మరాజు వ్యాసునినుండి పొంది అర్జునునికి ఉపదేశించాడు.

     బృహదశ్వుడనే మునివల్ల నల మహారాజు కథ విని ఊరట పొందాడు. భీముణ్ని కొండ చిలువగా చుట్టుకున్న నహుషునికి ధర్మ బలంతో సమాధానమిచ్చి నలుగురు తమ్ముళ్ళనీ బతికించుకున్నాడు. కౌరవులు పెట్టే కష్టాలను సహించే సహనమూ ధర్మ బుద్దీ నీకే ఉన్నాయని సార్థక నాధేయుడవని సాక్షాత్తు శ్రీకృష్ణుని చేతనే కీర్తింపబడ్డాడు. సన్యాసి వేషమూ ధరించాడు. అలా విరాట కొలువులో “కొంకుడు” పేరుతో ఉన్నాడు. ఉత్తరుని విజయానికి బృహన్నలకారణమని పలికి విరటునితో సారె దెబ్బతిని, రక్తం స్రవించినా సహనాన్ని వీడలేదు. చివరకు ఐదూళ్ళిచ్చినా చాలన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలోనూ ధర్మం జయిస్తుందని నమ్మాడు. అధర్మమని తెలిసీ భీముణ్ని అతని మరణ ఉపాయం అడిగినా, అశ్వత్ధామ హతః కుంజరః అని అసత్యమాడినా శ్రీకృష్ణుడు చెప్పినట్లు చేసాడు. కర్ణుడి మరణానికి బాధపడ్డాడు. శల్యున్ని సంహరించాడు. దైపాయనమడుగులో దాక్కున్న దుర్యోధనుణ్ని రెచ్చగొట్టి బయటకు రప్పించాడు. కవచమూ శిరస్త్రాణాలిప్పించాడు. దుర్యోధనుని తొడలు విరవడం తప్పన్నాడు. గెలిచాడు. వచ్చిన వైరాగ్యం దాటాడు. పెద్ద తండ్రిని చూసుకున్నాడు. వెంబడించి వచ్చిన కుక్కకూ తనతోపాటు స్వర్గలోక ప్రాప్తి కోరాడు! ధర్మమే అతని కీర్తి! ధర్మమే అతని రక్ష! ధర్మమే ధర్మరాజుని విజయం!

– బమ్మిడి జగదీశ్వరరావు