ఆడవారి వయాగ్రాలొచ్చేశాయ్!

మీరు చదివింది నిజమే. ఆడవారికీ వయాగ్రాలు సిద్ధమయ్యాయి. మహిళలలో కామోద్దీపన కలిగించే ఔషధాల కోసం చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఔషధాల కోసం ఇటీవలి కాలంలో పరిశోధనలను ముమ్మరం చేశారు. అవి ఓ కొలిక్కి వచ్చాయి. ముందస్తుగా అమెరికాలో ఫిమేల్ వయాగ్రాని మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ ఔషధం పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ రహితమని చెప్పలేమని అయితే గతంలో వచ్చిన అన్ని ఔషధాల కంటే చాలా మెరుగైనదని డాక్టర్లు చెబుతున్నారు. అమెరికాలోని స్ప్రౌట్ ఫార్మాస్యూటికల్స్ ఈ ఔషధాన్ని తయారు చేస్తోంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదముద్ర కూడా లభించింది. ఫ్లిబాన్‌సెరిన్ పేరుగల ఈ ఔషధాన్ని సేవించిన తర్వాత కారు నడపరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఫ్లిబాన్‌సెరిన్ అప్రూవల్ కోసం 2010లోనే ఎఫ్‌డీఏ ముందుకు వచ్చింది. అయితే సైడ్ ఎఫెక్ట్స్‌ని పరిమితం చేయాలంటూ ఎఫ్‌డీఏ తోసిపుచ్చింది. ఆ తర్వాత 2013లోనూ మరోమారు ఇది పరిశీలనకు వచ్చినా అనుమతి దక్కలేదు. ఇపుడు అన్ని అనుమతులతో పూర్తిస్థాయి సేఫ్టీ ప్రమాణాలతో మార్కెట్‌లోకి వస్తోంది.