ఏపీ పోలీసుల తీరు సిగ్గుచేటు!

 ఒక రాష్ర్టంలో నిందితుడిగా ఉన్న వ్య‌క్తి మ‌రో రాష్ర్టంలో పోలీసుల‌కు క‌నిపిస్తే ఏం చేస్తారు? అత‌న్ని వెంట‌నే అరెస్టు చేసి సంబంధిత రాష్ర్ట పోలీసుల‌కు అప్ప‌గిస్తారు. కానీ ఏపీ పోలీసుల తీరు భార‌త‌ పోలీసు వ్య‌వ‌స్థ‌కే మ‌చ్చ తెచ్చేలా ఉంది. ఓటు నోటు ఎర కేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య ఉదంతం ఇందుక ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. దేశ‌వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన ఈ కేసులో అత‌ను తెలంగాణ నుంచి పారిపోయి విజ‌య‌వాడ‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. అంతేనా! మీడియాకు ఇంట‌ర్వ్యూల మీద ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. అత‌న్ని వెంట‌నే ప‌ట్టుకుని తెలంగాణ‌కు అప్ప‌గించాల్సిన ఏపీ పోలీసులు క‌ళ్ల‌గ‌ప్ప‌గించి చూస్తున్నారు. అంతేనా..! అత‌నే నేరుగా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి ఏకంగా తెలంగాణ సీఎంపై ఫిర్యాదుచేయ‌గానే చిత్తం ప్ర‌భు! అన్న‌ట్లుగా కేసులు న‌మోదు చేసారు. దేశంలో పోలీసు వ్య‌వ‌స్థ‌కే మ‌చ్చ తెచ్చారు. ఒక దేశంలో క్రిమిన‌ల్ రికార్డు ఉన్న నిందితుడు దేశం దాటేందుకు నిబంధ‌న‌లు అనుమ‌తించ‌వు. ఒక‌వేళ అడ్డ‌దారిలో దాటినా వారు ప‌ట్టుకొని మ‌న‌దేశానికి స‌మాచారం ఇస్తారు. అలాంటిది జాతీయ‌స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిన కేసులో నిందితుడు త‌మ క‌ళ్ల‌ముందే ద‌ర్జాగా, వీఐపీగా తిరుగుతున్నా ఏపీ పోలీసులు మిన్న‌కుండటం వెన‌క కార‌ణ‌మేంటి? అని దేశ‌వ్యాప్తంగా పోలీసులు ప్ర‌శ్న‌లు లేవ‌దీస్తున్నారు. ఇది మంచి సంప్ర‌దాయం కాద‌ని, తెలంగాణ, ఏపీలు వేర్వేరు దేశాలు కాద‌న్న సంగ‌తి ఏపీ పోలీసులు గుర్తించాల‌ని సీనియ‌ర్ పోలీసులు అధికారులు హిత‌వుప‌లుకుతున్నారు. అంటే తెలంగాణ‌లో తీవ్ర నేరారోప‌ణ‌లు ఉన్న వారు స్వేఛ్ఛ‌గా ఏపీలో తిర‌గ‌వ‌చ్చా? ఇది భ‌విష్య‌త్తు త‌రాల‌వారికి త‌ప్పుడు సంకేతాలు ఇస్తుంద‌ని ప‌లువురు రిటైర్డ్ ఉన్న‌తాధికారులు హెచ్చ‌రిస్తున్నారు.