నితీశ్ తో లాలూ వియ్యం ఆంతర్యం!?

నవంబర్ ఆఖరుకల్లా బిహార్ శాసన సభ గడువు పూర్తవుతుంది. ఆ లోగా శాసన సభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో అధికారం సంపాదించడానికి భారతీయ జనతా పార్టీ సకల ప్రయత్నాలు చేస్తోంది. అధికారం నిలబెట్టుకోవడానికి నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీ (యూ) సైతం వ్యూహాలు రచిస్తోంది. నితీశ్ కుమార్ మొట్టమొదట అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీతో పొత్తు ఉండేది. కాని తర్వాత బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. ప్రస్తుతం నితీశ్ కుమార్ ప్రయత్నమల్లా బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే. ఒంటరిగా ఆ లక్ష్యం సాధించే అవకాశం జేడీ (యూ) కు లేదు. అంటే ఇతర ప్రతిపక్షాలను కూడ గట్టాల్సిందే. కాంగ్రెస్ ఎటూ కుదేలైంది. వామపక్ష పార్టీలు నస్మరంతిగా మిగిలిపోయాయి. ఇక మిగిలిందల్లా లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్జేడీ. నితీశ్ కు లాలూకు మధ్య సయోధ్య అంతంత మాత్రమే. తనంత తాను బిహార్ లో అధికారంలోకి రాగలిగిన సత్తా లాలూకూ లేదు. అంటే ఇతర పార్టీలతో ఐక్యత నితీశ్ కు ఎంత అవసరమో లాలూకూ అంతే అవసరం.

పూర్వపు జనతా పరివారంలోని పార్టీలన్నీ కలిసి ఒకే పార్టీగా ఏర్పడడానికి చేస్తున్న ప్రయత్నాలకు రకరకాల అవాంతరాలు ఎదురవుతున్నాయి. నితీశ్ కు, లాలూకు మధ్య లంగరందితే బీజేపీని బిహార్ లో అధికారంలోకి రాకుండా నిలవరించడం సులువు అవుతుంది. క్రమంగా అది జాతీయ స్థాయిలో జనతా పరివార్ ఐక్యతకు మార్గం సుగమం చేయవచ్చు. తక్షణావసరం బిహార్ ఎన్నికల గండం గట్టెక్కడమే.

ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల గోదాలోకి దిగడానికి లాలూ ప్రసాద్ అంగీకరించక తప్పలేదు. జేడీ (యూ), ఆర్జేడీ సాహచర్యం బిహార్ రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చగలుగుతుంది. దేశ రాజకీయాల మీద కూడా దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే తమ మధ్య ఐక్యత కుదరకపోతే బీహార్ లో బీజేపీ పాగాను నిరోధించడం అసాధ్యం అన్న ఆత్మ జ్ఞానం నితీశ్ కు, లాలూ కు కూడా కలగక తప్పలేదు.

కాంగ్రెసేతర, బీజేపీయేతర రాజకీయపార్టీలలో సెక్యులర్ విధానాలకు ఇంతవరకు కచ్చితంగా కట్టుబడి ఉన్నది లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ అని అంగీకరించక తప్పదు. ప్రస్తుతం నితీశ్ కైనా లాలూకైనా ప్రధాన శత్రువు బీజేపీనే. అందువల్ల తామిద్దరం ఏకం కాకపోతే ఓటమిలో ఐక్యం కాక తప్పదని అర్థమైంది. అందుకే సెక్యులరిజం పరిరక్షణకు “ఏ విషం తాగడానికైనా నేను సిద్ధం” అని లాలూ ప్రకటించారు. అంటే నితీశ్ తో మైత్రి కంఠంలో గరళం ధరించడమేనన్న అంతరార్థం లాలూ మాటల్లో ఉండవచ్చు. రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు.

దీర్ఘకాలంపాటు బిహార్ రాజకీయాలలో మనగలగాలంటే జేడీ (యూ), కాంగ్రెస్ తో సహగమనం తప్పదని లాలూ గ్రహించారు. దీనివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు స్వల్పకాలిక ప్రయోజనాలూ నెరవేరతాయన్న వాస్తవం లాలూకు తెలుసు. లేకపోతే అన్ని ప్రయోజనాలను బీజేపీ విజయం గద్ద తన్నుకుపోయినట్టు తన్నుకుపోక తప్పదు. బిహార్ లో బీజేపీ విజయం సాధిస్తే ఆ ప్రభావం అక్కడితో ఆగదు. అస్సాం నుంచి పంజాబ్ దాకా ఆ ప్రభావం ఉంటుంది. అప్పుడు ఓ దశాబ్దం దాకా బీజేపీకి తిరుగుండదు. బీజేపీని ఢీకొనగల శక్తి నితీశ్ కు ఉందని లాలూకు తెలుసు. తాను ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది కనక ఒంటరిగా బీజేపీని ఎదిరించడం అసాధ్యమనీ లాలూకు తెలుసు.

బిహార్ ముస్లింలకు లాలూ సెక్యులర్ వాది అన్న నమ్మకం ఉంది. యాదవ-ముస్లిం వర్గాలే లాలూకు అండ. ముస్లింల ఓటు బ్యాంకును కాపాడుకోవడం లాలూకు తప్పని సరి. తాను ఒంటరిగా నిలబడితే బీజేపీని ఎదిరించగల సత్తా ఉన్న నితీశ్ కుమార్ కు మద్దతు ఇవ్వకుండా బీజేపీ విజయానికి సజకరించారన్న విమర్శ లాలూ తప్పించుకొలేరు. మోదీ రాజకీయాలను వ్యతిరేకించడంలో నితీశ్ దృఢంగా నిలబడుతున్నారన్న వాస్తవాన్ని విస్మరించడం లాలూకు కుదరదు. లాలూకు ఉన్న సెక్యులర్ ముద్ర కూడా నిష్కళంకమైందే. బీజేపీని నిరోధించగలిగిన శక్తి నితీశ్ కు ఉన్నట్టే లాలూకూ ఉంది. కాని ఈ రెండు శక్తులు ఏకమైతే తప్ప ప్రయోజనం ఉండదు. ఐక్యం కాకపోతే తాము ప్రవచించే సెక్యులర్ విధానాలు నినాదప్రాయంగా మిగిలిపోక తప్పదు. బిహార్ లో పాగా వేయడానికి మోదీ, అమిత్ షా ఏ అవకాశమూ వదలడం లేదు. అందువల్ల సెక్యులరిజం పరిరక్షణ అన్న నినాదానికి బిహార్ లో త్వరలో జరగబోయే ఎన్నికలలో చెలామణి ఉంటుంది.

అయితే నితీశ్, లాలూ మధ్య ఉన్న విభేదాలు లోతైనవే. వాళ్లిద్దరూ పైకి ఎంతగా బీజేపీ వ్యతిరేక వైఖరి వ్యక్తం చేసినా ఇద్దారి దృష్టి ముఖ్యమంత్రి పదవి మీదే. ప్రస్తుత వాతావరణంలో లాలూకు ఆ పదవి అందని ద్రాక్షే. కనక నితీశ్ ను సమర్థిస్తే తన సెక్యులర్ వ్రతమూ చెడదు, దీర్ఘ కాలికంగా తన పార్టీ మనుగడకు ప్రమాదం ఉండదు అని  లాలూ గ్రహించారు. అయితే ఆయన ఈ వాస్తవం తెలుసుకోవడం అంత సులువుగా జరగలేదు. లాలూ పార్టీకి చెందిన 11 మంది శాసన సభ్యులు కొద్ది రోజుల కిందట లాలూ భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్డీ దేవి దగ్గరకెళ్లి నితీశ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించేట్టు లాలూను ఒప్పించాలని మొర పెట్టుకున్నారు.

లాలూ ఓటు బ్యాంకు పదిలంగానే ఉన్నప్పటికీ ఒంటరిగా విజయం సాధించడానికి సరిపోదు. బిహారీ ముస్లింలు లాలూ పక్షాన నిలవడం వాస్తవమే అయినా ఆర్జేడీకి విజయావకాశాలు లేవనుకున్నప్పుడు ముస్లిం వోట్లు ఆర్జేడీ, జేడీ (యూ), కాంగ్రెస్ మధ్య చీలడం అనివార్యమవుతుంది. దీన్ని నివారించడానికి నితీశ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించాలని సమాజ్ వాది పార్టీ, జేడీ (యూ) తో పాటు లాలూ పార్టీ ఎమ్మెల్లెలు కూడా లాలూ మీద ఒత్తిడి చేస్తున్నారు. ముస్లింలు లాలూకు అండగా ఉన్నప్పటికీ ఎన్నికల సమీకరణల దగ్గరకొచ్చే సరికి ఆ వర్గం వారు కచ్చితంగా బీజేపీని నిలవరించగలిగిన పక్షానికి మద్దతివ్వడమే మేలనుకుంటారు. అప్పుడు లాలూ ఓటు బ్యాంకు చెదిరిపోవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే నితీశ్ కు మద్దతు ఇవ్వడం లాలుకు అనివార్యమైంది.

శాసన సభ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు గనక ఈ సయోధ్య సీట్లపంపకం సమయంలో నిగ్గుతేలాల్సి ఉంటుంది. 2010 శాసన సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా సీట్ల సర్దుబాటు జరగాలని నితీశ్ అంటున్నారు. ఎందుకంటే గత శాసన సభ ఎన్నికలలో జేడీ (యూ) 22.61 శాతం ఓట్లతో 112 సీట్లు సంపాదించింది. ఆర్జేడీ 18.84 శాతం ఓట్లు సాధించి 22 సీట్లు సంపాదించింది. కాని లోక సభ ఎన్నికల ఫలితాల దగ్గరకొచ్చే సరికి లాలూ ఓట్ల శాతం 20.10 కు పెరిగింది. నాలుగు లోక సభ సీట్లు దక్కాయి. నితీశ్ పార్టీకి 15.80 శాతం ఓట్లతో రెండు లోక సభ స్థనాలు మాత్రమే దక్కాయి. అందువల్ల నితీశ్ 2010 ఓట్ల ఆధారంగా వచ్చే ఎన్నికలకు సీట్ల సర్దుబాటు జరగాలనుకోవడం ఎంత సహజమో, 2014 సార్వత్రిక ఎన్నికలలో ఓట్ల శాతాన్ని బట్టి శాసన సభ సీట్ల సర్దుబాటు జరగాలని లాలూ కోరడం అంతే సబబు. అయితే ఈ రెండు పార్టీలు గుర్తించాల్సిన వాస్తవం ఏమిటంటే బీజేపీ వ్యతిరేక ఐక్య సంఘటనకు వచ్చే శాసన సభ ఎన్నికలలో మంచి అవకాశాలున్నాయి.

2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, లోక్ జన శక్తి పార్టీలతో కూడిన ఎన్ డీ ఏ 38.8 శాతం ఓట్లు సంపాదించింది. ఆర్జేడీ, కాంగ్రెస్ తొ కూడిన యూపీఏ 28.5 శాతం ఓట్లు సంపాదించింది. శాసన సభ ఎన్నికలలో ఆర్జేడీ, జేడీ (యూ), కాంగ్రెస్ కలిసికట్టుగా ఉంటే 50 శాతం ఓట్లు పడే అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికలలో లాలూ పార్టీ ప్రదర్శించిన బలం మరింత పెరిగితే అంతిమ విజయం లాలూదే కాక తప్పదు. లాలూ అంత సులువుగా ఏ అవకాశాన్నీ వదులుకునే అమాయకుడేమీ కాదు.

– ఆర్వీ రామారావ్