పోలీసుల‌పై బ‌స్తీవాసుల తిరుగుబాటు

శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులనే పరిగెత్తించి, ప‌రిగెత్తించి చితక్కొట్టారు ఒడిసాలోని హల్దిపాడ బస్తీవాసులు. హల్దిపాడ బస్తీకి చెందిన ఓ బాలికను సంతోష్‌ జెనా అనే వ్యక్తి మోసగించి గర్భవతిని చేశాడంటూ ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టడానికి ఈ నెల 10న లక్ష్మీనగర్‌ పోలీసు స్టేషన్‌కి వచ్చారు. కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో ఏం చేయాలో తెలియ‌క బ‌స్తీవాసులు వెనుదిరిగారు. ఈ నేప‌థ్యంలో భర్త సంతోష్ జెనా బాలిక‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకుని వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్న విష‌యం తెలుసుకున్న అత‌ని భార్య నిలదీసింది. దీంతో అతడు భార్యపై అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యాడు. అంత‌టితో ఆగ‌లేదు. భార్య‌పై కిరోసిన్ పోసి అంటించబోతుంటే.. కాలనీవాసులు అడ్డుకుని సంతోష్‌ను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లిన పోలీసులు అత‌న్ని విడిపించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో బ‌స్తీవాసులు వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. వెంట‌నే ఓ పోలీసు అక్క‌డున్న మ‌హిళ‌పై చేయి చేసుకున్నాడు. అప్ప‌టిదాకా మాట‌ల‌కే ప‌రిమిత‌మైన బ‌స్తీవాసులు ఒక్క‌సారిగా పోలీసుల‌పై తిర‌గ‌బ‌డ్డారు. దీంతో ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రింత ఊగిపోయిన బ‌స్తీవాసులు నిందితుడిపై కేసు పెట్ట‌డానికి వ‌స్తే తిర‌స్క‌రించిన మీరు ఇక్క‌డ‌కు వ‌చ్చి నిందితుడ్ని విడిపిస్తారా అంటూ ఊగిపోయారు. అంద‌రూ క‌లిసి ఒక్కుమ్మ‌డిగా దాడి చేశారు. పోలీసులను డ్రైనేజిలో తోసేశారు. స్టేషన్‌ ఎస్‌ఐ, ఏఎస్‌ఐపైన బస్తీవాసులు త‌రిమిత‌రిమి దాడి చేశారు. దీంతో అదనపు బలగాలను అక్కడకు తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.