మొబైల్స్‌కు ప్రత్యేక హబ్‌: కెసిఆర్‌

సెల్‌ఫోన్‌ల తయారీ కంపెనీల కోసం ప్రత్యేక హబ్‌ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా దాదాపు రెండు లక్షల మందికి ఉపాధి లభించాల‌ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణలో పరిశ్రమలకు లభిస్తున్న ప్రోత్సాహం గురించి తెలుసుకున్న ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ కెల్విన్‌ చిన్‌, ఫై మొబైల్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ విన్సెంట్‌ వాంగ్‌లు  సిఎంను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారితో సిఎం మాట్లాడుతూ తెలంగాణలో ఫోన్‌ తయారీ సంస్థలను నెలకొల్పేందుకు అనేక కంపెనీలకు చెందిన ప్రతినిధులు తమను సంప్రదించారని, అందరి కోసం ఒక మానుఫాక్చరింగ్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హబ్‌లో అని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.  కంపెనీల ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు పరిస్థితులు పూర్తి అను కూలంగా ఉన్నాయని, ప్రభుత్వం తెచ్చిన టిఎస్‌ ఐపాస్‌ చట్టం బావుంద‌ని ప్రశంసించారు. తాము ఐ ఫోన్‌ లాంటి అత్యాధునిక ఫోన్లను తయారుచేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని వారు అన్నారు.
మేడ్చెల్‌లో సెల్‌కాన్ యూనిట్‌
హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన  సెల్‌కాన్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని వచ్చే వారంలో ప్రారంభించనున్నారు. నాలుగు ప్రొడక్షన్‌ లైన్ల ద్వారా మొబైల్స్‌ను కంపెనీ ఉత్పత్తి చేయనుంది. దేశీయంగా మొబైల్స్‌కు గిరాకీ బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడే వాటిని ఉత్పత్తి చేయాలని సంకల్పించామని సెల్‌కాన్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై గురు తెలిపారు. ఈ ప్లాంట్‌లో నెలకు మూడు లక్షల మొబైల్స్‌ను తయారు చేస్తామన్నారు. ఇక్కడ తయారైన మొబైల్స్‌ను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని చెప్పారు.
రూ. 200 కోట్ల‌తో ఫ్యాబ్‌సిటీలో మైక్రోమాక్స్‌ 
హైదరాబాద్‌ శివారులోని ఫ్యాబ్‌సిటీలో మైక్రోమాక్స్‌ మొబైల్స్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించే కార్యక్రమంలో ఈ కంపెనీ ప్రతినిధులు ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఇదే వేదికగా కంపెనీ పెట్టుబడులపై ప్రకటన వెలువడనుంది. కాగా ఈ కంపెనీ ఫ్యాబ్‌సిటీలో రూ. 200 కోట్ల పెట్టుబడితో 50 ఎకరాల స్థలంలో పరిశ్రమ స్థాపనకు ఏర్పా ట్లు పూర్తయినట్టు రాష్ట్ర రవాణా శాఖమంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు.