Telugu Global
Family

నలుడు (For Children)

షట్చక్రవర్తులు వరుసగా హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్త వీర్యార్జునుడు. అంటే షట్చక్రవర్తులలో రెండవాడు నలుడు.  పేరెన్నికగన్న పురాణ చక్రవర్తులు వీరు!             నలుడు నిషధ దేశానికి రాజు. వీరసేనుని కొడుకు. ఉద్యానవనంలో నలుడు విహరిస్తూ రావడంతో ఆ పక్కనున్న సరస్సులోని హంసల గుంపు ఎగిరిపోయింది. చిక్కిన ఒక్క హంస తనని విడిచి పెట్టమని కోరింది. అలా విడిచి పెడితే మీరు వలచిన దమయంతికి మీ గురించి చెపుతానంది. దాంతో హంసను విడిచి పెట్టాడు నలుడు. […]

షట్చక్రవర్తులు వరుసగా హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్త వీర్యార్జునుడు. అంటే షట్చక్రవర్తులలో రెండవాడు నలుడు. పేరెన్నికగన్న పురాణ చక్రవర్తులు వీరు!

నలుడు నిషధ దేశానికి రాజు. వీరసేనుని కొడుకు. ఉద్యానవనంలో నలుడు విహరిస్తూ రావడంతో ఆ పక్కనున్న సరస్సులోని హంసల గుంపు ఎగిరిపోయింది. చిక్కిన ఒక్క హంస తనని విడిచి పెట్టమని కోరింది. అలా విడిచి పెడితే మీరు వలచిన దమయంతికి మీ గురించి చెపుతానంది. దాంతో హంసను విడిచి పెట్టాడు నలుడు. హంస విదర్భకు వెళ్ళి దమయంతికి సంగతంతా చెప్పింది. దమయంతికి ప్రేమ కలిగేలా చేసింది. స్వయం వరానికి రమ్మన్న ఆహ్వానాన్ని మోసుకొచ్చి నలునికిచ్చింది.

నలుని దమయంతి వరించనున్నదని తెలిసి ఇంద్రుడూ వరుణుడూ వాయువూ అగ్నీ దేవుళ్ళు నలుని వద్దకు వెళ్ళారు. చేస్తానని మాటయిస్తే చెప్తామని మాట తీసుకున్నారు. నలుడు మాట ఇచ్చాడు. మా నలుగురిలో ఎవరినైనా వరించమని నువ్వే చెప్పి ఆమె మనస్సు మరల్చమని కోరారు. నలుడు నలిగిన మనసుతో ఇంద్రుడు ఇచ్చిన ఉంగరం ధరించి దమయంతి ఉన్న అంతఃపురంలోకి అదృశ్యంగా ప్రవేశించాడు. మనసు చంపుకొని దిక్పాలకుల కోరికని తను ప్రేమించిన దమయంతి ముందు పెట్టాడు. దమయంతి తన మనసు మారదని చెప్పింది.

స్వయవరంలో నలుని పక్కన నలుగురు నలుని రూపంలోనే కూర్చున్నారు ఇంద్రాది దేవతలు. నలుని ప్రేమనే గెలిపించింది దమయంతి. సరస్వతీ దేవిని ప్రార్థించి నలుని మెడలో హారం వేసి గెలిపించుకుంది. దేవతలు ఈర్ష్యపడ్డా నలుడు దమయంతిని పెళ్ళాడి తన రాజ్యానికి తీసుకు వచ్చాడు. వారి సంతోషానికి చిహ్నంగా ఓ కూతుర్నీ కొడుకునీ కూడా కన్నారు.

ఒకరోజు నలుడు అసుర సంధ్యవేళ నిద్రపోయాడు. దాంతో కలి అతనిలో ప్రవేశించాడు. ఇంకేముంది? నలుడు వ్యసనాలకు లోనయ్యాడు. పిన తండ్రి కొడుకుతో జూదం ఆడి ఓడిపోయాడు. పుష్యమిత్రుని మోసానికి రాజ్యం వదిలి అడవుల పాలయ్యాడు నలుడు. పిల్లల్ని తండ్రి దగ్గరకు పంపి దమయంతి నలుని వెంట వచ్చింది. ఎన్నో కష్టాలకోర్చింది. తిండికి కూడా కష్టమయింది. మీది వస్త్రాన్ని పక్షుల మీదికి విసరి పట్టుకోవాలని చూసి ఉన్న వస్త్రాన్నీ కోల్పోయాడు.బట్టకూ కష్టమయింది. దమయంతి పడుతున్న కష్టాలను చూడలేని నలుడు తనే దూరమయితే ఆమె పుట్టింటికి పోయి ఊరట పొందుతుందని ఆశించాడు. భార్య నిద్రలో ఉండగా దుఃఖిస్తూ వదిలి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ మంటల్లో చిక్కుకున్న కర్కోటకుడనే పామును రక్షించాడు. అదే పాము కాటుకు లోనయి రూపం కోల్పోయి కురూపి అయినాడు. ఇప్పుడు నిన్ను ఎవరూ గుర్తు పట్టరు, అందువల్ల నీకు మేలే జరుగుతుందని కర్కోటకుడు చెప్పాడు. మంచి రోజులొచ్చినప్పుడు నన్ను తల్చుకుంటే వస్త్రం వస్తుంది, అది కప్పుకుంటే యధా రూపు వస్తుందని చెప్పాడు. ఋతు పర్వుడనే రాజు దగ్గరకు వెళ్ళమన్నాడు. నలుడు అలా వెళ్ళి బాహుకుడనే పేరుతో వంటవాడిగా చేరాడు. నలుడు అద్భుతంగా వంటచేసి రాజుకు దగ్గరయ్యాడు. కొన్నాళ్ళకు భార్య దమయంతికి ద్వితీయ స్వయం వరమని విన్నాడు. ఋతుపర్వుడు ఆ స్వయంవరానికి వెళ్ళడానికి సమయం లేదు, వంద యోజనాలు. అశ్వహృదయమనే విద్య తెలిసిన నలుడు ఆ పనికి పూనుకున్నాడు. వేగం తెలియకుండా వెళ్ళడం చూసి ఋతుపర్వుడు అశ్వహృదయం నేర్పమని ప్రతిగా అక్ష హృదయం విద్య నేర్పాడు. దాని వల్ల నక్షత్రాలను నిముషాల మీద లెక్క పెట్టొచ్చు. విదర్భ చేరారు. ఆ రాత్రి దాసి తెచ్చిన తన బిడ్డల్ని చూసి నలుడు దుఃఖించాడు. భార్యని అడవిలో వదిలి వెళ్ళడం ధర్మమా అని దమయంతి తన తండ్రిని ఉద్దేశించి అన్నా అది నలునికే తాకింది. ఆమె సుఖపడుతుందని వదిలి వెళ్ళాడను కోవచ్చు గదా?, అయినా రెండో పెళ్ళికి సిద్ధమైపో తగునా అన్నాడు. కురూపిగా ఉండి గుర్తు పట్టలేక పోయినా బాహుకుడే నలుడని దమయంతి గుర్తించింది. విషయం తెలిసి ఋతుపర్వుడు భీష్మకునితో వచ్చి అడిగితే నలుడు తెలీదన్నాడు. కలి నలునిలోంచి బయటకు వచ్చి చెప్పడం – నలుని ద్యానం – వస్త్రం కప్పుకోవడంతో నలునికి అసలు రూపు వచ్చింది. నలుడు దమయంతి ఒక్కటయ్యారు. గెల్చిన రాజ్యాన్ని ఏలుకున్నారు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  13 Jun 2015 1:02 PM GMT
Next Story