తెలంగాణ‌లో 100 ఇంజినీరింగ్ కాలేజీల మూత‌?

తెలంగాణ‌లో 2015-16 విద్యా సంవత్సరానికి మూసివేతకు దరఖాస్తు చేసుకున్న 41 ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఎక్కువ లోపాలున్నట్లు గుర్తించిన కాలేజీలు సుమారు 60.. ఇలా మొత్తం సుమారు 100 కాలేజీలు ఈ ఏడాది ఇంజనీరింగ్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌కు అందుబాటులో లేకుండా పోయే అవకాశం ఉంది. భారీ స్థాయిలో లోపాలున్న 60  కాలేజీలకు 2015-16 విద్యా సంవత్సరం అనుబంధ గుర్తింపు లభించే అవకాశం లేదని జేఎన్‌టీయూహెచ్‌ అధికార వర్గాల సమాచారం. జేఎన్‌టీయూ పరిధిలోని 288 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో గత ఏడాది 10 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూత పడ్డాయి. ఈ ఏడాది కూడా 41 ఇంజనీరింగ్‌ కాలేజీలను మూసి వేసేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. మిగిలిన ఏ ఒక్క కాలేజీని వదలకుండా 237 కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు నోటీసులిచ్చారు. ఈ 237 కాలేజీల్లో సుమారు 60 కాలేజీలకు అనుమతి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. విద్యార్థులు మంచి ఇంజనీరింగ్‌ కాలేజీలను ఎంపిక చేసుకునే విధంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి కాలేజీల జాబితా, సీట్ల వివరాలు పొందుపరుస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించినా ఇంత వరకు అలా జరగలేదు. జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో లోపాలున్నట్లు తొమ్మిదో తేదీన అధికారులు కాలేజీలకు నోటీసులిచ్చి 11వ తేదీన లోపాలపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. దీంతో జేఎన్‌టీయూ అధికారులు ఒకే రోజు గడువు ఇచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించటం సరైంది కాదని కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నెల 20వ తేదీ వరకు కాలేజీలకు వివరణ ఇచ్చే గడువు ఇస్తూ హైకోర్టు ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 20వ తేదీ వరకు, కాలేజీల నుంచి వచ్చిన అప్పీళ్లు పరిష్కరించేందుకు 28 తేదీ వరకు జేఎన్‌టీయూకు హైకోర్టు గడువు విధించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం 27 సాయంత్రం వరకు కాలేజీల నుంచి వచ్చిన అప్పీళ్ల పరిష్కారం గడువు ముగియగానే 28వ తేదీ ఉదయం నిబంధనల ప్రకారం ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల జాబితానే కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌లో పెడతారు. ఆ తరువాతే.. విద్యార్థులకు కాలేజీల ఎంపికకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు అవకాశం కల్పించాలని భావిస్తోంది.