ఆల‌యాన వెల‌సిన దేవ‌త‌లా కాదు మ‌నిషిగా చూద్దాం!

మ‌న‌దేశంలో ఆడ‌వారు చేసే ప‌నుల‌కు ఉన్న విలువ వారి ప్రాణాల‌కు లేదు. ఆడ‌వాళ్లు చేసే ప‌నులను, ఇంటిని న‌డిపే దేవ‌త‌, గృహ‌ల‌క్ష్మి లాంటి పేర్ల‌తో పొగిడేవారు, అంత‌కంటే ఎక్కువగా, ప్ర‌మాద‌క‌ర‌మైన స్థాయిలో వారిమీద హింస పెరుగుతున్న ప‌రిస్థితుల్లో ఆ విష‌యంపై మాత్రం ఏమాత్రం స్పందించ‌డం లేదు. మ‌న‌దేశ సంస్కృతిలోనే స్త్రీల‌ ప‌ట్ల ఉన్న‌చిన్న‌ చూపు ఇది. ఆడ‌వాళ్లు ఏం చేస్తున్నారు అనే విష‌యంలో ఉన్న శ్ర‌ద్ధ‌, వారెలా బ‌తుకుతున్నారు అనే విష‌యంలో మ‌న‌కు లేదు. మ‌న సంస్కృతిలాగే చ‌ట్టాలూ, న్యాయాలూ కూడా ఉన్నాయి. ఇండియాలో ప్ర‌తి గంట‌కూ ప‌దిహేను మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుండ‌గా అందులో 17శాతం మంది వివాహిత మ‌హిళలు ఉంటున్నారు. మ‌న‌కు అత్యంత ఆందోళ‌న‌ క‌లిగిస్తున్న రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కంటే ఇది చాలా ఎక్కువ‌. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు 3శాతం ఉన్నాయి. 2013 నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందిస్తున్న వివ‌రాల ప్ర‌కారం ఆ ఒక్క ఏడాదే 1.3 ల‌క్ష‌ల మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. ఇందులో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న మ‌హిళ‌ల్లో స‌గం మంది గృహిణులే (దాదాపు 23వేల మంది) ఉన్నారు. మ‌రొక ఆందోళ‌న చెందాల్సిన విష‌యం ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నవారిలో 76శాతం మంది వివాహితులే. వివాహం, కుటుంబ జీవితం మ‌హిళ‌ల్లో మ‌రింత ఒత్తిడిని పెంచుతున్నాయ‌ని అదే వారిలో ఆత్మ‌హ‌త్య‌ని ప్రేరేపిస్తున్న‌ద‌ని ఉమెన్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ రీసెర్చి సెంట‌ర్ డైర‌క్ట‌ర్ కె.ఆర్. రేణుక అంటున్నారు.

ఇంటిల్లిపాదికీ అన్నీ సమ‌కూర్చిపెట్టే ఇల్లాలికి త‌న గురించి తాను ప‌ట్టించుకునే ఓపిక తీరిక ఉండ‌టం లేద‌ని, ఆమెలో పేరుకుపోతున్న ఒత్తిడి బ‌య‌ట‌కు పోయే మార్గం లేక‌నే ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటున్న‌ద‌ని రేణుక అన్నారు. ఇంటికి వ‌చ్చినా భార్య గురించి ప‌ట్టించుకునే తీరిక‌లేని భ‌ర్త‌లు సైతం ఇందుకు కార‌ణ‌మేన‌ని ఆమె చెబుతున్నారు. ఇలాంటి ఆత్మ‌హ‌త్య‌ల్లో చాలావ‌ర‌కు ముందుగా ప్లాన్ చేసుకున్న‌వి కాద‌ని, అప్ప‌టిక‌ప్పుడు క్ష‌ణికావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలేన‌ని, ఈ మ‌హిళ‌ల‌కు మ‌న‌సు విప్పి మాట్లాడుకునే తోడు, స్నేహం అత్య‌వ‌స‌ర‌మ‌ని రేణుక అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌మ‌కు మాన‌సికంగా భ‌రించ‌లేని ఒత్తిడి ఉంద‌నిపిస్తే మ‌హిళ‌లు సంశ‌యించ‌కుండా మాన‌సిక నిపుణుల‌ను సంప్ర‌దించాల‌ని ఆమె సూచిస్తున్నారు. గ‌త శ‌తాబ్దంలో 21శాతంగా ఉన్న గృహిణుల ఆత్మ‌హ‌త్య‌లు 17శాతానికి త‌గ్గినా ఇంకా ఇది ఆందోళ‌న క‌లిగించే స్థాయిలోనే ఉంద‌ని ఆమె అన్నారు. ఏది ఏమైనా ఆల‌యాన వెల‌సిన దేవ‌త అంటూ దేవుళ్ల‌లో క‌లిపేయ‌కుండా వివాహిత స్త్రీల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిమీదా ఉంద‌ని గుర్తుంచుకోవాలి.

Image Credits funinstore.com