శోభ‌న్‌బాబు విగ్ర‌హంపై త‌మిళ సంస్థ ఆగ్ర‌హం

అందాల న‌టుడు, సినిమా ప్ర‌పంచంలో ‘మ‌హారాజు’ శోభ‌న్‌బాబు విగ్ర‌హం కూల్చేస్తామంటూ త‌మిళ‌ర్ మున్నేట ప‌డై అనే ఓ సంస్థ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. నాగ‌ప‌ట్నంలో ఎల్‌టీటీఈ అధినేత ప్ర‌భాక‌ర‌న్ విగ్ర‌హాన్ని ప్ర‌భుత్వం కూల్చి వేసినందుకు నిర‌స‌న‌గా తాము త‌మిళ‌నాట ఉన్న విగ్ర‌హాల‌న్నీ కూల్చేస్తామ‌ని, ఇందులో భాగంగా సోమ‌వారం 11 గంట‌ల‌కు ముందుగా శోభ‌న‌బాబు విగ్ర‌హాన్ని కూల్చేస్తామ‌ని త‌మిళ‌ర్ మున్నేట ప‌డై ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. శోభ‌న్‌బాబు ఇంటి వ‌ద్ద ఉన్న విగ్ర‌హాన్ని కాపాడ‌డానికి భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. త‌మిళ‌ర్ మున్నెట పడైకి ఆగ్ర‌హం క‌లిగితే ప్ర‌భుత్వంతో తేల్చుకోవాల‌ని, త‌మ అభిమాన న‌టుడి విగ్ర‌హాన్ని కూల్చేస్తామ‌న‌డం అన్యాయ‌మ‌ని శోభ‌న్‌బాబు అభిమాన సంఘాలు, త‌మిళ‌నాడులోని తెలుగు సంఘాలు ధ్వ‌జ‌మెత్తుతున్నాయి. మ‌రోవైపు త‌మ సొంత స్థ‌లంలో, త‌మ సొంత డ‌బ్బుల‌తో నిర్మించుకున్న విగ్ర‌హాన్ని కూల్చేస్తే స‌హించేది లేద‌ని శోభ‌న్‌బాబు కుటుంబ స‌భ్యులు అంటున్నారు.