త‌ప్పించుకోవ‌డానికే సెక్ష‌న్‌-8 ?

ఓటుకు నోటు ఎర కేసులో అడ్డంగా దొరికిపోయార‌నే అక్క‌సుతోనే చంద్ర‌బాబు ట్యాపింగ్‌, సెక్ష‌న్‌-8 అంటూ అన‌వ‌స‌ర వివాదాలు సృష్టించేందుకు య‌త్నిస్తున్నార‌ని సీఎం కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్‌కు సోమ‌వారం ఫిర్యాదు చేశారు. ఈకేసులో చంద్ర‌బాబు పాత్ర‌ను నిరూపించే మ‌రిన్ని బ‌ల‌మైన ఆధారాలు ఆయ‌న‌కు స‌మ‌ర్పించారు. ఏడాదిగా హైద‌రాబాద్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ఎలాంటి ఢోకాలేద‌ని ఇందుకు మీరే సాక్షి అని గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. ఈ వ్య‌వ‌హారంలో ఏపీ మంత్రులు, టీడీపీ నేత‌లు గ‌వ‌ర్న‌ర్‌పై ఆరో్ప‌ణ‌లు చేస్తోన్న నేప‌థ్యంలో కేసీఆర్ ఆయ‌న‌తో గంట‌న్న‌ర‌పాటు స‌మావేశమ‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. టీడీపీ ప్ర‌భుత్వం త‌మ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచేందుకు కుట్ర ప‌న్నింద‌ని మొత్తం 30 మంది ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించింద‌ని ఆరోపించారు. స్టీఫెన్‌స‌న్‌కు రూ.50 ల‌క్ష‌లు ఇస్తూ రేవంత్‌రెడ్డి ప‌ట్టుబ‌డ‌టంతో ఫోన్‌ట్యాపింగ్‌, సెక్ష‌న్‌-8 అంటూ ఎద‌రుదాడి మొద‌లుపెట్టార‌ని వివ‌రించారు. ఇలాంటి ఆరోప‌ణ‌ల‌తో ద‌ర్యాప్తు అధికారుల మ‌నోస్థైర్యం దెబ్బ‌తీయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పేర్కొన్నారు.