తప్పు మీద తప్పుతో నిండా మునుగుతున్న బాబు

ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవటంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఇతరత్రా సమస్యలను తెరమీదకు తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. నేరం చేసిన వాడు ఆ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో నేరమో లేక ఇంకో తప్పో చేసినట్లుగానే చంద్రబాబునాయుడు తప్పులు మీద తప్పులు చేస్తూ మరింతగా తన ఉచ్చును తానే బిగించుకుంటున్నారు. చట్ట ప్రకారం కేసు ఏమవుతుంది? అరెస్టవుతారా లేదా? అరెస్టయినా చివరకు నిర్ధారణ అవుతుందా? లేక వీగిపోతుందా? అనే అంశాలు పక్కనబెడితే ప్రజా కోర్టులో మాత్రం తాను తప్పు చేశాననే విధంగా నిరూపణ అయ్యే తరహాలో ఆయన అడుగులు వేస్తూ మరింతగా సమస్యల వలయంలో కూరుకుపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటు కోసం ఐదు కోట్లు ఇవ్వజూపుతూ అందులో భాగంగా 50 లక్షల రూపాయలు ఎమ్మెల్సీ స్టీఫెన్సన్‌కు అందజేస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుపడిపోయారు. ఈ వ్యవహారంలో స్టింగ్‌ ఆపరేషన్‌ ఎవరు చేశారనేది అలా ఉంచితే స్టింగ్‌ ఆపరేషన్‌కు సంబంధించిన స్పష్టమైన ఆధారం ప్రజల ముందుకు వెళ్లిపోయింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అసలు ట్యాపింగే చేయలేదని ఎమ్మెల్సీ స్టీఫెన్సన్‌ లౌడ్‌ స్పీకర్‌ ద్వారా సంభాషణను ఏసీబీ అధికారులకు వినిపించారు. అయినా ట్యాపింగ్‌ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు తెరమీదకు తెస్తున్నారో అర్థం కాని పరిస్థితి.

చట్టం ముందు ఈ ఆధారం ఎంత వరకు నిలబడుతుందనేది పక్కనపెడితే ప్రసార, ప్రచార మాధ్యమాల్లో డబ్బులు ముట్టచెప్పడమే కాకుండా విపరీత ధోరణిలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు ఆయన నైజానికి అద్దం పట్టే విధంగానే ఉండటంతో ప్రజల్లో ఓటుకు నోటు ముడుపుల వ్యవహారం నమ్మేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీని చట్టబద్ధతను పక్కనపెడితే ముందుగానే ఎమ్మెల్సీ స్టీఫెన్సన్‌ ఫిర్యాదు చేయటం వల్ల ఏసీబీ అధికారులు పకడ్బందీగా రేవంత్‌రెడ్డిని పట్టుకోగలిగారు. ఈ సమయంలో రేవంత్‌ వాడిన భాష బాస్‌ అంటూ సంబోధించటం తదితర విషయాలన్నీ చంద్రబాబు ప్రమేయాన్ని ప్రజలు విశ్వసించే విధంగా నిర్ధారిస్తున్నాయి. మరో సందర్భంలో చంద్రబాబు ఆ ఎమ్మెల్సీతో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలు బయటికి వచ్చాయి. గరికపాటి ఫోన్‌లో ఇద్దరితోనూ మాట్లాడించినట్లు భావిస్తున్నారు. చట్ట ప్రకారం న్యాయ నిపుణుల, దర్యాప్తు అధికారుల అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే ఏపీ ముఖ్యమంత్రిని తెలంగాణ ఏసీబీ అధికారులు విచారించటం అనివార్యం అవుతుంది. దర్యాప్తులో భాగంగా ముఖ్యమంత్రికి నోటీసు జారీ చేసి సమయం తీసుకోవటం ద్వారా ఆయన వద్దకు అధికారులు వెళ్లటమో లేక ఆయనను తమవద్దకు పిలిపించుకోవటమో తప్పనిసరి అయ్యేలా ఉంది. ఆయన ఇచ్చే వాంగ్మూలం (161 సీఆర్‌పీసీ ప్రకారం) ఆధారంగా తదుపరి దర్యాప్తు ముందుకు వెళుతుంది. వాగ్మూలం పేరుతో నేరుగా అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచే అధికారం కూడా దర్యాప్తు అధికారులకు ఉంటుంది. మంత్రి మోపిదేవి వెంకటరమణరావు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తదితరులు నిందితులుగా ఉన్న కేసుల్లో సీబీఐ అదేవిధంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులను ఏపీ పోలీసు అధికారులు చంద్రబాబు ముందుంచారు. దాంతోనే ఆయన అసలు సమస్యను పక్కదారి పట్టించి కొత్త సమస్యలు సృష్టించి సమస్యను రాష్ట్రాల, ప్రజల మధ్య తగాదాగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొత్తం వ్యవహారంలో ఒక్క ఓటు కోసం చంద్రబాబు ఇంత వ్యవహారం ఎందుకు నడిపారంటే ఆ ఒక్క ఓటు వల్లే ఫలితం అటుఇటూ తారుమారు అవుతుంది కాబట్టి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టి టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు క్రాస్‌ ఓటింగ్‌ కోసం ముడుపులు ముట్టచెప్పేందుకు ఐదు కోట్లు సమకూర్చటం ఆయనకు పెద్ద కష్టం కాకపోయినా అనైతికంగా ఎన్నికల అక్రమాలకు ప్రలోభపెట్టటం అనేది నేరంగా పరిగణించాల్సి వస్తుంది.

ఈ వ్యవహారంలో రేవంత్‌ అరెస్టయ్యారు. ఆయన తన వాంగ్మూలంలో చంద్రబాబు పేరు చెప్పే అవకాశం లేదు. ఏసీబీ అధికారులు ఎంత ఒత్తిడి చేసినా ఆయన ముడుపుల వ్యవహారం తనకు సంబంధం లేదనే తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆడియో, వీడియో టేపులతోపాటు కాల్‌ డేటా రికార్డులు, రేవంత్‌రెడ్డితోపాటు అరెస్టయిన ఇతరుల వాంగ్మూలాలు, నోట్ల కట్టల నంబర్ల ఆధారంగా ఏ కంపెనీల ఎకౌంట్‌ల నుంచి ఏ ఏ బ్యాంకుల ద్వారా ఎవరు డ్రా చేశారు? తదితర విషయాలన్నీ పక్కాగా ఏసీబీ సేకరించింది.

ఇప్పుడు చట్టం ముందు బాస్‌ను దోషిగా నిలబెట్టటమే కేసీఆర్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పదే పదే చెప్పినప్పటికీ చట్టాన్ని అమలు చేయటంలో రాజకీయ ప్రేమయం, జోక్యం లేకుండా దర్యాప్తు పరిస్థితులు మన దేశంలో లేనేలేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులను అరెస్టు చేయాలంటే ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి ఇవ్వాలనే సంప్రదాయం ఉన్నప్పటికీ దానికి సంబంధం లేకుండానే అనేక పరిణామాలు వివిధ కేసుల్లో చోటు చేసుకున్నాయి.

అందువల్ల చంద్రబాబుని ప్రశ్నించటానికి గాని, లేదా వివరణ కోరటం తదనంతరం అరెస్టు చేయటం లాంటి చట్టపరమైన చర్యలకు అవకాశం లేకపోలేదు. కోర్టులు జోక్యం చేసుకుని దర్యాప్తు ముందుకు సాగకుండా లేదా ఆయనను ఈ కేసు పరిధిలోకి తీసుకురాకుండా అడ్డుకుంటే తప్ప చంద్రబాబును ప్రశ్నించాలనుకున్నా లేదా అరెస్టు చేయాలనుకున్నా ఆపటానికి ఎటువంటి అవకాశాలు లేవు. ఈ పరిస్థితిని గమనించటం వల్లనే చంద్రబాబు ఈ అంశాన్ని వివిధ రూపాల్లో పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటే ఆయన ఆవిధంగా ఫోన్‌లో బేరసారాలాడినట్లు ఒప్పుకోవటమే అవుతుంది. తాను ఆ విధంగా రేవంత్‌రెడ్డిని రంగంలోకి దింపింది లేనిదీ చెప్పకుండా ఫోన్‌లో మాట్లాడింది లేనిదీ వివరణ ఇవ్వకుండా ఓ వైపు ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ మరోవైపు కట్‌ అండ్‌ పేస్ట్‌ అని వాదిస్తున్నారు. రెండిటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి. రెండూ జరిగే అవకాశం లేనే లేదు. తప్పు మీద తప్పులో భాగంగా ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు.

తొలుత క్యాబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ సెక్షన్‌ 8 స్పష్టంగా అమలు చేయాలని కోరుతూ గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఫోన్‌ ట్యాపింగ్‌పై దర్యాప్తు జరపాలని మొత్తం 120 ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇవన్నీ కూడా గందరగోళంతో అయోమయంలో చేసిన తప్పులు గానే గుర్తించాలి. అసలు డబ్బుతోపాటు దొరికిన రేవంత్‌రెడ్డి వ్యవహారం వరకే పరిమితం కావాల్సి ఉండగా, విభజన చట్టంలోని సెక్షన్‌ 8, ఫోన్‌ ట్యాపింగ్‌, గవర్నర్‌ అధికారాలు అంటూ రకరకాల అంశాలను కేంద్రానికి ఫిర్యాదు చేయటం ద్వారా సమస్యను పక్కదారి పట్టించేందుకు విఫలయత్నం చేశారు. అదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య, తెలుగు ప్రజల మధ్య తగాదాగా చిత్రించి సమస్యను పక్కదారి పట్టించి కేసీఆర్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. గుంటూరు సభలో బాబు మాట్లాడుతూ తన వెనుక ఐదు కోట్ల మంది ప్రజలున్నారని చెప్పటం తాను చేసిన తప్పు ప్రజలందరికీ ఆపాదించే విధంగా మరో తప్పు చేశారు.