గ‌వ‌ర్న‌ర్‌కు కేసీఆర్ ఏం చెప్పారంటే…!

ఓటుకు కోట్లు వ్య‌వ‌హారంలో రెండు తెలుగురాష్ర్టాలలోనూ వాడివేడి ఊహాగానాలు సాగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌ను క‌లుసుకోవ‌డం అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇంత‌కీ కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్‌తో ఏం మాట్లాడి ఉంటారు? అస‌లు ఎందుకు క‌లుసుకున్నారు..? అనే వాటిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. వారిద్ద‌రి మ‌ధ్య ఓటుకు కోట్లు అంశ‌మే ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని స‌మాచారం.  అయితే ఇందులో రెండు విష‌యాలు చాలా ప్ర‌ధాన‌మైన‌వి ఉన్నాయి. అవేమిటంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు వ్య‌తిరేకంగా చాలా ఆధారాలున్నాయ‌ని కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించార‌ట‌. కోట్ల రూపాయ‌లు కుమ్మ‌రించి దాదాపు 30 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డానికి కుట్ర జ‌రిగింద‌ని వివ‌రించి అందుకు త‌గిన ఆధారాల‌ను కూడా గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశార‌ని స‌మాచారం. ఒక‌వైపు ఓటుకు కోట్లు కుంభ‌కోణంపై చంద్ర‌బాబు ప్ర‌మేయ‌మున్న‌ట్లు చెబుతున్న సాక్ష్యాధారాల‌పై విశ్లేష‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ స‌ల‌హాదారులు చంద్ర‌బాబు ఇంటికి వెళ్ల‌డం త‌ప్పుడు సంకేతాలిచ్చింద‌నికూడా గ‌వ‌ర్న‌ర్‌కు కేసీఆర్ వివ‌రించార‌ని తెలుస్తోంది. వీటితో పాటు హైద‌రాబాద్‌లో సెక్ష‌న్ -8 అమ‌లు చేయాలంటూ చంద్ర‌బాబు చేస్తున్న డిమాండ్ అర్థ‌ర‌హిత‌మ‌ని కూడా గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించార‌ట‌. త‌ప్పు చేస్తూ సాక్ష్యాధారాల‌తో స‌హా ప‌ట్టుబ‌డిన చంద్ర‌బాబు ఉన్న‌వీ లేనివీ క‌ల్పించి ఢిల్లీ స్థాయిలో యాగీ చేస్తున్నార‌ని కేసీఆర్ వివ‌రించార‌ని స‌మాచారం. అయితే కేసీఆర్ స‌మ‌ర్పించిన తాజా సాక్ష్యాధారాల ప్రాతిప‌దిక‌న కేంద్రానికి మ‌రో నివేదిక పంపించాల‌ని గ‌వ‌ర్న‌ర్ యోచిస్తున్న‌ట్లు అధికార‌వ‌ర్గాలంటున్నాయి.