సెక్ష‌న్ 8 అంటే ఏమిటి ?

అంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం రెండు ముక్క‌ల‌యిపోయి యేడాది గ‌డిచిపోయింది. ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ అనే కొత్త రాష్ట్రం పుట్టుకురాగా మిగిలిన భాగం అవ‌శేష ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా ఆ పేరుతో అలాగే ఉండిపోయింది. రాష్ట్ర విడిపోయిన సంద‌ర్బంలో హైద‌రాబాద్‌ను ప‌దేళ్ళ‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉండేందుకు వెసులుబాటు క‌ల్పించారు. అయితే ఉమ్మ‌డి రాజ‌ధానిలో ఉండే ఆంధ్రుల హ‌క్కుల‌కు భంగం క‌ల‌గ‌కుండా చూసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టం (2014) రెండో భాగంలో సెక్ష‌న్ 8 కింద ఈ విష‌యాల‌ను పొందు ప‌రిచారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టం 2014 ప్ర‌కారం రెండో విభాగంలో పొందు ప‌రిచిన సెక్ష‌న్ 8 ను అమ‌లు చేసి తీరాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌ట్టుబ‌డుతుండ‌గా… ఆ ఊసే అవ‌స‌రం లేద‌ని, దాన్ని అమలును అడ్డుకోవ‌డానికి ఎంత‌దూరం వెళ్ళ‌డానికైనా వెన‌కాడ‌బోమ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇంత ప‌ట్టుద‌ల‌గా ఉండ‌డానికి ఇంత‌కీ ఆ సెక్ష‌న్‌లో ఏముంది? ఏం చెబుతుందో ఓసారి చూద్దాం…
1. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం నాటి నుంచి ఉమ్మ‌డి రాజధాని ప్రాంత ప‌రిపాల‌న‌, ఆ ప్రాంతంలో నివ‌సించే ప్ర‌జల ప్రాణాల‌కు భ‌ద్ర‌త‌, స్వేచ్ఛ‌, ఆస్తుల సంర‌క్ష‌ణ‌ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేక అధికారాలు క‌లిగి ఉంటారు. …
2. మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే… శాంతి భ‌ద్ర‌త‌లు, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌, ముఖ్య‌మైన వ్య‌వ‌స్థ‌ల సంర‌క్ష‌ణ‌, ఉమ్మ‌డి రాజ‌ధాని ప్రాంతంలో ప్ర‌భుత్వ భ‌వ‌నాల కేటాయింపు, నిర్వ‌హ‌ణ త‌దిత‌రాలు చూడాల్సిన బాధ్య‌త గ‌వ‌ర్న‌ర్‌కు ఉంటుంది.
3. ఈ బాధ్య‌త‌ల‌ నిర్వ‌హ‌ణ‌లో గ‌వ‌ర్న‌ర్ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించిన త‌ర్వాత ఆయ‌న త‌న వ్య‌క్తిగ‌త నిర్ణ‌యానుసారం తుది నిర్ణ‌యాలు, అంతిమ చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. ఏ అంశంలోనైనా ఏదైనా సంక్లిష్ట‌త‌ త‌లెత్తిన‌పుడు… గ‌వ‌ర్న‌ర్ ఈ స‌బ్ సెక్ష‌న్ ప్ర‌కారం వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం తీసుకోవ‌ల‌సి వ‌చ్చిన‌పుడు… ఆయ‌న త‌‌న విచ‌క్ష‌ణాధికారం ఉప‌యోగించి తీసుకున్న నిర్ణ‌య‌మే అంతిమం… ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించిన ఇద్ద‌రు వ్య‌క్తిగ‌త స‌ల‌హాదారులు గ‌వ‌ర్న‌ర్‌కు స‌హ‌క‌రిస్తారు.
4. నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత… గ‌వ‌ర్న‌ర్ ఆ విధంగా వ్య‌వ‌హ‌రించాల్సింది కాదు… లేదు…అలాగే వ్య‌వ‌హ‌రించాలి అని స‌వాలు చేసే అధికారం కూడా ఏ రాష్ట్ర ప్ర‌భుత్వానికీ ఉండ‌దు. దీన్ని కోర్టుల్లో స‌వాలు చేయ‌డానికి కూడా ఆస్కారం లేదు.
సాధార‌ణ ప‌రిస్థితుల్లో తెలంగాణ ప్ర‌భుత్వ‌మే పై అంశాల‌న‌న్నింటినీ చూసుకుంటుంది. ఎప్పుడైనా, ఎక్క‌డైనా వివాదం ఏర్ప‌డితే ఆ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకునే వెసులుబాటు ఈ సెక్ష‌న్ క‌ల్పిస్తుంది. దీనివ‌ల్ల ఉమ్మ‌డి రాజ‌ధాని ప్రాంతంలో ఉండే పౌరుల శాంతిభ‌ద్ర‌త‌లు, ఆస్తుల సంర‌క్ష‌ణ వంటి అంశాల‌ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ పాత్ర చాలా కీల‌కం. కాని యేడాదిగా రాని ఈ స‌మ‌స్య ఇపుడు తెర‌మీద‌కి వ‌చ్చింది. ఈ ఏడాదిలో హైదరాబాద్ లో ఉండే ఆంధ్రుల మీద దాడి జరగటంకాని, వాళ్ళ ఆస్తులను దురాక్రమించడంకాని జరిగిన దాఖాలాలు లేవు. చంద్రబాబు కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఆంధ్రులకు రక్షణ లేదని ఒక్కసారి కూడా మాట్లాడలేదు. తను వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో పడ్డాక రాజ‌ధాని న‌గ‌రంలో ఉండే ఆంధ్ర ప్రాంత ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త లేదంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అటు కేంద్రం వ‌ద్ద‌, ఇటు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ఇప్పుడు చ‌ర్చ‌ను లేవ‌నెత్తారు.
మొన్న‌టికిమొన్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దూత‌ల వ‌ద్ద కూడా ఇదే అంశాన్ని లేవ‌నెత్తి సెక్ష‌న్ 8 అమ‌లు చేసి తీరాల్సిందేన‌ని నిస్సంకోచంగా చెప్పారు. ఈ ప‌రిస్థితిని గ‌వ‌ర్న‌ర్ తెలంగాణ సీఎం చంద్ర‌శేఖ‌ర‌రావు దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయ‌న దీనికి స‌సేమిరా అంటున్నారు. త‌మ‌కున్న అధికారాల‌ను వ‌దులుకుని గ‌వ‌ర్న‌ర్‌కు క‌ట్ట‌బెట్ట‌డానికి ఏ ముఖ్య‌మంత్రి కూడా అంగీక‌రించ‌రు. కేసీఆర్ కూడా స‌హ‌జమైన తీరులోనే స్పందించారు. సెక్ష‌న్ 8పై ఇరు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలూ త‌మ త‌మ వైఖ‌రికి క‌ట్టుబ‌డి ఉంటే అంతిమ నిర్ణ‌యం తీసుకోవ‌ల‌సింది ఇక కేంద్ర‌మే!