Telugu Global
Others

గ‌వ‌ర్న‌ర్ ఆంత‌ర్యం ఏమిటి?

గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తే రాజ‌కీయ క‌ద‌లిక‌లు చాలా చురుకుగా సాగుతున్నట్టు క‌నిపిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఆదివారం అక‌స్మాత్తుగా త‌న సలహాదారులైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఏపీవీఎన్‌ శర్మ, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏకే మహంతిలను ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ద్ద‌కు పంపారు. సుమారు గంటపాటు వారు బాబుతో చర్చించారు. తెలుగు రాష్ట్రాల ప‌ట్ల కేంద్రం ఎలాంటి వైఖ‌రితో ఉందో వీరు చూశాయ‌గా చెప్పారంటున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్ర‌బాబు త‌మ రాష్ట్రానికి చెందిన […]

గ‌వ‌ర్న‌ర్ ఆంత‌ర్యం ఏమిటి?
X

గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తే రాజ‌కీయ క‌ద‌లిక‌లు చాలా చురుకుగా సాగుతున్నట్టు క‌నిపిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఆదివారం అక‌స్మాత్తుగా త‌న సలహాదారులైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఏపీవీఎన్‌ శర్మ, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏకే మహంతిలను ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ద్ద‌కు పంపారు. సుమారు గంటపాటు వారు బాబుతో చర్చించారు. తెలుగు రాష్ట్రాల ప‌ట్ల కేంద్రం ఎలాంటి వైఖ‌రితో ఉందో వీరు చూశాయ‌గా చెప్పారంటున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్ర‌బాబు త‌మ రాష్ట్రానికి చెందిన 120 మంది ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు వారి వ‌ద్ద ప్ర‌స్తావించార‌ని, సెక్షన్‌ 8ని యథాతథంగా అమలు చేయాల్సిందేనని ఏపీ సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ లేకుండానే సెక్షన్‌లోని భావాన్ని అన్వయం చేసుకుంటూ వాటిని అమలు చేయాలని కోరినట్లు సమాచారం. ‘మీరు గవర్నర్‌కు సలహాదారులు కదా! ఆయనకు ఈ విష‌యాల్లో తగిన సలహాలు ఇవ్వండి’ అని వారికి చెప్పినట్లు తెలిసింది. అయితే, సెక్షన్‌ 8 అమలుపై కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తే తప్ప గవర్నర్‌ కానీ, తాము కానీ ఏమీ చేయలేమని వారు చంద్ర‌బాబుకు స్పష్టం చేసి వెళ్ళిపోయారు.

ఇది జ‌రిగి 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ ముందే తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో సమావేశ‌మ‌య్యారు. ఇది ఏదో మ‌ర్యాద పూర్వ‌కంగా జరిగింది ఏమీ కాదు. గ‌వ‌ర్న‌ర్ పిలుపు మేర‌కే కేసీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్ళారంటున్నారు. చంద్ర‌బాబు లేవ‌నెత్తిన అంశాల‌ను ఆయ‌న వ‌ద్ద ప్ర‌స్తావించి అభిప్రాయం తెలుసుకున్న‌ట్టు చెబుతున్నారు. ఏపీ తెలిపిన అభ్యంతరాలను కేసీఆర్‌ ముందుంచి ఆయన అభిప్రాయాలను గవర్నర్‌ అడిగి తెలుసుకుంటున్నట్లుగా తెలియవచ్చింది. ఏపీ ఆరోపిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయలేదని, అలాగే సెక్షన్ 8కు అంగీకరించే ప్రసక్తే లేదని కేసీఆర్‌ గవర్నర్‌కు స్పష్టం చేసినట్లుగా సమాచారం. టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసును ఆధారం చేసుకుని తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు సాగుతుండ‌గా… ఫోన్‌ ట్యాపింగ్ అంశాన్ని ప‌ట్టుకుని ఏపీ ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఒక్క విష‌యం ఇక్క‌డ అంద‌రూ ఆలోచించేది ఏమిటంటే… చంద్ర‌బాబు ద‌గ్గ‌రికి త‌న దూత‌ల‌ను పంపించిన గ‌వ‌ర్న‌ర్‌… త‌న ద‌గ్గ‌రికి కేసీఆర్‌ను పిలిపించుకుని మాట్లాడ‌డంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కాక ఇరు పార్టీల నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. చంద్ర‌బాబుతో కొంత గ్యాప్ మెయిన్‌టైన్ చేయ‌డం అవ‌స‌రం దృష్ట్యానే గ‌వ‌ర్న‌ర్ ఈ ఎత్తుగ‌డ వేశారా అన్న‌ది ఆలోచించాల్సిన అంశం.

First Published:  15 Jun 2015 9:19 PM GMT
Next Story