కొత్త ముఖ్యమంత్రి అశోక గజపతిరాజు?

రాజీనామాకు సిద్ధమౌతున్న చంద్రబాబు …. ? చార్జిషీటులో పేరు ఉండే అవకాశం ?
ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయబోతున్నారా..? ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా అశోక గజపతి రాజుకు అవకాశమివ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారా..? అవునని తెలుగుదేశం పార్టీ అత్యున్నతస్థాయి వర్గాలంటున్నాయి. చార్జిషీటులో తన పేరు ఉండే అవకాశం ఉందని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా వేగంగా పావులు కదుపుతున్నారు. అశోకగజపతిరాజుకు అవకాశమివ్వాలన్న ప్రతిపాదనను ఆయన దాదాపు ఖరారు చేసేశారని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏసీబీ అనుబంధ చార్జిషీట్‌లో తన పేరు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అశోక గజపతి రాజు ప్రస్తుతం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అనుబంధ చార్జిషీటు దాఖలు చేయడానికి ఏసీబీ సన్నద్ధమవుతోంది. ఫోరెన్సిక్ విభాగం నుంచి నివేదిక అందగానే బహుశా మంగళవారం చార్జిషీటు దాఖలయ్యే అవకాశం ఉంది. రెండు మూడు రోజులుగా డీజీపీ జేవీ రాముడు, రాష్ర్ట నిఘా విభాగ అధిపతి, ఇతర ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు జరుపుతున్న చంద్రబాబు నాయుడు భవిష్యత్ కార్యాచరణపై వేగంగా పావులు కదుపుతున్నారు. అశోక గజపతి రాజును ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడికి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఇప్పటికే చంద్రబాబు తెలియజేశారని తెలుగుదేశం పార్టీ ఉన్నతస్థాయి వర్గాలంటున్నాయి. బావమరిది నందమూరి బాలకృష్ణ, సీనియర్ మంత్రులు కె.నారాయణ, యనమల రామకృష్ణల పేర్లను కూడా పరిశీలించినప్పటికీ అశోక గజపతి రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపారని సమాచారం. ఆయన చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడే కాక మంచి అడ్మినిస్ట్రేటర్‌గా కూడా పేరుంది. అనుబంధ చార్జిషీటులో చంద్రబాబు నాయుడి పేరుతో పాటు పార్టీకి చెందిన ఓ కేంద్రమంత్రి, ఇద్దరు టీడీపీ ఎంపీల పేర్లు ఉండే అవకాశాలున్నాయని సమాచారం.