టీ స‌ర్కారుతో తాడోపేడో… ఏపీ కేబినెట్

కేసీఆర్‌ సర్కారుతో తాడోపేడో తేల్చుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఏసీబీ కేసులో చంద్రబాబుకు నోటీస్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంటే, తాము కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌కు నోటీసు ఇవ్వాలని… చంద్రబాబుపై తెలంగాణ సర్కారు కేసు నమోదు చేస్తే, కేసీఆర్‌పై తామూ కేసు పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, నారాయణ, కిమిడి మృణాళిని, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, డీజీపీ రాముడు, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నార
ట్యాపింగ్ రుజువైతే కేసీఆర్ జైలుకే…
‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ చాలా తీవ్రమైన నేరం. అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ మొదలుకుని కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణహెగ్డే వరకూ ట్యాపింగ్‌ వల్ల పదవుల నుంచి దిగిపోవాల్సి వచ్చింది’’ అని గుర్తు చేశారు. 120 మంది ఫోన్లు ట్యాప్‌ చేశారని… ఇందులో 35 ఫోన్ల ట్యాపింగ్‌పై ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు సేకరించామని అధికారులు ఈ సమావేశంలో వెల్లడించారు. కేంద్రం రంగంలోకి దిగితే మరిన్ని ఆధారాలు వెల్లడవుతాయని వారు పేర్కొన్నారు. ఈ కేసులో కేంద్రం విచారణ జరిపి, ట్యాపింగ్‌ రుజువైతే కేసీఆర్‌ తన పదవిని పోగొట్టుకోవడంతోపాటు, అరెస్టు కూడా తథ్యమని ఈ భేటీలో పలువురు అభిప్రాయపడ్డారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు నోటీస్‌ ఇవ్వడానికి చట్టపరంగా అవకాశమే లేదని, చట్టం ప్రకారం ఏపీ సీఎం తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి రారని సమావేశం అభిప్రాయపడింది. వారి పరిధి లేనందువల్ల ఒకవేళ నోటీసులు ఇచ్చినా తీసుకోవాల్సిన అవసరం లేదనే అంచనాకు వచ్చారు. ‘‘నోటీస్‌ తీసుకోకపోతే గోడకు అంటించి వెళ్తారు. వాళ్లు నోటీస్‌ ఇస్తే మనం కూడా నోటీస్‌ పంపుదాం. వాళ్లు గోడకు అంటిస్తే, మనం కూడా గోడకు అంటిద్దాం. వాళ్లు కోర్టు ద్వారా నోటీస్‌ పంపే ప్రయత్నం చేస్తే, మనం కూడా తెలంగాణ ముఖ్యమంత్రిపై ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులపై కోర్టు ద్వారా నోటీస్‌ పంపుదాం. రాజ్యాంగ సంక్షోభం వస్తుందా… అదీ చూద్దాం’’ అనే నిర్ణయానికి వచ్చారు.
హైద‌రాబాద్‌పై ప‌దేళ్ళ‌పాటు స‌మాన‌ హ‌క్కులు
హైదరాబాద్‌ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్నందున.. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వానికి ఎంత హక్కు ఉందో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కూడా అంత హక్కు ఉందని ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. ‘‘హైదరాబాద్‌ పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చట్టంలో చెప్పారు. అంటే, ఈ చట్టం ప్రకారం పదేళ్ల తర్వాతే అది తెలంగాణ రాజధాని అవుతుంది. ఈ దృష్టితోనే హైదరాబాద్‌లో శాంతి భద్రతలు గవర్నర్‌కు అప్పగిస్తూ విభజన చట్టంలో ప్రత్యేకంగా సెక్షన్‌ 8 పెట్టారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌కు సంబంధించిన శాంతి భద్రతలు గవర్నర్‌ పరిధిలో లేకపోతే, దీనిపై ఇరు రాష్ట్రాలకు సమాన హక్కు ఉన్నట్లుగా పరిగణించాలని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని… అది ఊహాజనితమని ఏపీ మంత్రుల బృందం వద్ద గవర్నర్‌ నరసింహన్‌ చేసిన వ్యాఖ్యల విషయం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ‘‘ఆయన అటువంటి అభిప్రాయానికి ఎందుకు వచ్చారో తెలియదు. బహుశా ఆయనకు సమాచారం లేకపోయి ఉండవచ్చు. ఏం జరుగుతోందో ఆయనకూ చెప్పండి’’ అని చంద్రబాబు అధికారులకు సూచించారు.