గవర్నర్ ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న టీడీపీ?

ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్టు… ఇపుడు తెలుగుదేశం నాయ‌కుల దృష్టంతా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ మీద ప‌డింది. ఓటుకు నోటు కేసులో వారం రోజులుగా అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని, అధికార గ‌ణాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ఇప్ప‌టివ‌ర‌కు పావులు క‌దిపిన తెలుగుపార్టీ, ప్ర‌భుత్వం ఇపుడు త‌మ దృష్టి పాక్షికంగా గ‌వ‌ర్న‌ర్ మీద‌కు మ‌ళ్ళించిన‌ట్టు కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న ఏపీ కేబినెట్ స‌మావేశం ముగిసిన త‌ర్వాత మాట్లాడిన మంత్రుల్లో గ‌వ‌ర్న‌ర్ ప‌ట్ల కొంత వ్య‌తిరేక భావం క‌నిపించింది. న‌ర‌సింహ‌న్ ఏక‌ప‌క్ష ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, తెలంగాణ ప‌క్ష‌పాతిగా ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఉంద‌ని ఓ మంత్రి కేబినెట్‌లో వ్యాఖ్యానించ‌గా దానికి చంద్ర‌బాబు అడ్డు త‌గులుతూ రాజ్యాంగ‌ప‌రంగా ఆయ‌న‌కు కొన్ని బాధ్య‌త‌లున్నాయి, వాటిని నిర్వ‌హించుకోనివ్వండి… ఎవ‌రూ కూడా గ‌వ‌ర్న‌ర్‌ను నిందించ‌వ‌ద్దు అంటూ వారించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. 
     కాని బుధ‌వారం పొద్దునే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు త‌న‌దైన శైలిలో గ‌వ‌ర్న‌ర్‌పై విరుచుకుప‌డ్డారు. చేత‌కాక‌పోతే ఆ ప‌ద‌విని వ‌దిలిపోవాల‌ని, అంతేగాని ఏక‌ప‌క్ష ధోర‌ణి అవ‌లంబించ‌డం స‌రికాద‌ని ఆయ‌న హితోప‌దేశం చేసిన‌ట్టు ప్ర‌సంగించారు. ఇంత‌లోనే రాష్ట్ర గవర్నరు నరసింహన్‌తో తాము వేగలేమని, ఆయన్ని తెలంగాణకే పరిమితం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి గ‌ళం విప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఊహాజనితమని గవర్నర్‌ ఎలా చెబుతున్నారని, ఆయనేమైనా విచారణ జరిపించారా అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్ర‌శ్న‌లో నిజ‌మెంత ఉందోగాని ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న‌తీరు న‌చ్చ‌డం లేద‌న‌డానికి కార‌ణంగా మాత్రం చెప్ప‌వ‌చ్చు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ మామూలుగా ఫోన్ ట్యాపింగ్‌పై అధికారుల‌తో మాట్లాడిన‌ప్పుడు ఊహాజ‌నిత‌మ‌ని అని ఉంటే దాన్ని ఎవ‌రైనా త‌ప్పుప‌డ‌తారు. అస‌లు ఆయ‌న అలా అన్నారో లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి. డీజీపీ రాముడు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు వెళ్ళిన‌ప్పుడు గ‌వ‌ర్న‌ర్ ఇలా సంభాషించిన‌ట్టు చెబుతున్నారు. రాజ‌కీయ నాయ‌కులంటే అబ‌ద్ద‌మాడ‌తారు… అవ‌కాశవాదం ప్ర‌ద‌ర్శిస్తార‌ని అనుకోవ‌చ్చు. కాని అధికారుల‌కు ఆ అవ‌స‌రం ఉండ‌దు. కాని మ‌రి గ‌వ‌ర్న‌ర్ ఆ మాట‌ల‌న్న‌ట్టే భావించాలి. ఏ అంశాల‌ను ఆధారం చేసుకుని గ‌వ‌ర్న‌ర్ ఈ మాట‌ల‌ని ఉంటారో, వీటికి ప్రాతిప‌దిక ఏమిటో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కే తెలియాలి. ఏ పార్టీ కి అయినా వ్య‌క్తిక‌యినా ఒక వ్య‌క్తి మీద వ్య‌తిరేక భావం క‌లిగితే ఆలోచ‌న‌ల‌న్నీ ఒకే కోణంలో ఉంటాయి. మ‌రి ఇపుడు జ‌రిగింది కూడా అదేనేమో!  
     టీఆర్‌ఎస్‌ సభలకు వెళ్లి గంటలతరబడి కూర్చునే గవర్నరు అమరావతికి వచ్చి మూడు నిమిషాలే ఉన్నారని న‌న్న‌ప‌నేని ఆరోపిస్తున్నారు… తెలంగాణ‌లో కూడా గ‌తవారం న‌ల్గొండ‌లో అల్ట్రామెగా ప‌వ‌ర్ ప్రాజెక్టు శంఖ‌స్థాప‌నకు వెళ్ళిన గ‌వ‌ర్న‌ర్ అక్క‌డ అర‌గంట కూడా లేర‌ని, అదే రోజు గుంటూరులో జ‌రిగిన మ‌హా సంక‌ల్ప దీక్ష స‌మావేశంలో గంట‌ల త‌ర‌బ‌డి ఉన్నార‌ని తెలంగాణ నాయ‌కులు కూడా ఆరోపించారు. వ్య‌క్తుల క‌ద‌లిక‌లు చూసే కోణాన్ని బ‌ట్టి ఉంటాయి కాని అందులో నిజానిజాలు చెప్ప‌డం అంత తేలిక‌యిన విష‌యం కాదు. అయితే జ‌రుగుతున్న ప‌రిణామాల దృష్ట్యా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కూడా ఆచితూచి అడుగులేస్తే విమ‌ర్శ‌ల‌కు గురి కావాల్సిన అవ‌స‌రం ఉండ‌దేమో!