Telugu Global
Others

21 మంది ఆప్ ఎమ్మెల్యేల అరెస్ట్‌కు రంగం సిద్ధం!

ఎన్నిక‌ల్లో మ‌ద్యం పంచార‌ని ఒక‌రు… ఎన్నిక‌ల‌ప్పుడు దొంగ స‌ర్టిఫికెట్లు స‌మ‌ర్పించార‌ని మ‌రొక‌రు… ఓ అధికారిపై చేయి చేసుకున్నార‌ని ఇంకొక‌రు… భార్య‌ను క‌ట్నం కోసం భౌతికంగా, మాన‌సికంగా వేధిస్తున్నార‌ని వేరొక‌రు… ఇలా ఆప్ పార్టీలోని ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే కేసుల‌ను ఎదుర్కొంటున్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు మొత్తం ఎమ్మెల్యేల జాబితా ప‌రిశీలించ‌గా ర‌క‌ర‌కాల కార‌ణాలతో 21 మందికి నేర చ‌రిత ఉంద‌ని ఢిల్లీ పోలీసులు తేల్చారు. అంత‌టితో ఆగ‌లేదు. ఈ 21 మందిపై కేసులు న‌మోదు చేసి అరెస్ట్లులు చేయ‌డానికి రంగం […]

21 మంది ఆప్ ఎమ్మెల్యేల అరెస్ట్‌కు రంగం సిద్ధం!
X
ఎన్నిక‌ల్లో మ‌ద్యం పంచార‌ని ఒక‌రు… ఎన్నిక‌ల‌ప్పుడు దొంగ స‌ర్టిఫికెట్లు స‌మ‌ర్పించార‌ని మ‌రొక‌రు… ఓ అధికారిపై చేయి చేసుకున్నార‌ని ఇంకొక‌రు… భార్య‌ను క‌ట్నం కోసం భౌతికంగా, మాన‌సికంగా వేధిస్తున్నార‌ని వేరొక‌రు… ఇలా ఆప్ పార్టీలోని ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే కేసుల‌ను ఎదుర్కొంటున్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు మొత్తం ఎమ్మెల్యేల జాబితా ప‌రిశీలించ‌గా ర‌క‌ర‌కాల కార‌ణాలతో 21 మందికి నేర చ‌రిత ఉంద‌ని ఢిల్లీ పోలీసులు తేల్చారు. అంత‌టితో ఆగ‌లేదు. ఈ 21 మందిపై కేసులు న‌మోదు చేసి అరెస్ట్లులు చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది ఢిల్లీ మీడియా చెబుతున్న మాట. ఈ మొత్తం 21 మందిలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మ‌నీష్ సుసోడియా కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. వేధింపుల‌కు గురి చేయ‌డం, అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం, చేసిన‌ వాగ్దానాలు ఉల్లంఘించ‌డం, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో అన‌వ‌స‌రంగా జోక్యం చేసుకోవ‌డం వంటి అభియోగాల‌పై వీరి మీద కేసులు న‌మోదు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఏడుగురి మీద ప్రాథ‌మిక ద‌ర్యాప్తుకు పోలీసులు ఆదేశించారు. మిగిలిన వారిపై కూడా కేసులు పెట్ట‌డానికి, అరెస్ట్‌లు చేయ‌డానికి ఢిల్లీ పోలీసులు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు.
మోసగించిన ఆరోప‌ణ‌ల‌పై ఇప్ప‌టికే న్యాయ‌శాఖ మాజీ మంత్రి జితేంద‌ర్‌సింగ్ తోమార్ మీద‌, ఆప్ క‌రోల్‌బాగ్ ఎమ్మెల్యే విశేష్ ర‌వి మీద ప్రాథ‌మిక ద‌ర్యాప్తుకు ఆదేశించారు. వీరిద్ద‌రితోపాటు కాండ్లీ ఎమ్మెల్యే మ‌నోజ్‌కుమార్ మీద కూడా ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఒక మ‌హిళ మీద అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఆరోప‌ణ‌ల‌తోపాటు మొత్తం నాలుగు కేసుల్లో మ‌నోజ్ కుమార్‌పై నాలుగు ఎఫ్ఐఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉత్త‌మ్ న‌గ‌ర్ ఎమ్మెల్యే న‌రేష్ బులియ‌న్‌పై ఇప్ప‌టికే కేసు న‌మోదై ఉంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌ద్యం పంచుతూ దొరికిపోవ‌డంతో ఆయ‌న మీద కేసు పెట్టారు. ఒక ఉద్యోగిపై భైతికంగా దాడి చేసి తిట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై తిల‌క్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే జ‌ర్నైల్ సింగ్‌పై కేసు న‌మోదై ఉంది. త‌న‌ను భౌతికంగా, మాన‌సికంగా వేధిస్తున్నాడంటూ న్యాయ‌శాఖ మాజీ మంత్రి సోమ‌నాథ్ భ‌ర్తీపై ఆయ‌న భార్య ఫిర్యాదు చేసింది. ఈ కేసు కూడా ఇప్పుడు విచార‌ణ‌లో ఉంది. మొత్తం మీద ఆప్ ఎమ్మెల్యేల్లో చాలామంది వివిధ ఆరోప‌ణ‌లు ఎదుర్కొవ‌డంతో ఢిల్లీ పోలీసులు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇదంతా ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్ర‌భుత్వం క‌లిసి చేస్తున్న కుట్ర అని కేజ్రివాల్ ఆరోపిస్తున్నారు.
First Published:  18 Jun 2015 2:45 AM GMT
Next Story