Telugu Global
Family

లంఖిణి (For Children)

లంక ఒక ద్వీపం కాబట్టే లంకా ద్వీపం అన్నారు. ద్వీపం అంటే దీవి. దీవి అంటే చుట్టూ నలుదిక్కులా నీరువుండే మధ్య ప్రాంతం. లంక ఎక్కడుంది? సముద్రంలో ఎందుకుంది? దానికీ ఓ కథ ఉంది. ఆది శేషువుకీ వాయువుకీ మధ్య గొడవ. నా బలం ఎక్కువ అంటే నా బలం ఎక్కువ – అని. నిరూపించి నిగ్గు తేల్చుకోవాలని ఇద్దరూ పంతం పట్టారు. శేషువేం చేసాడూ – ఓ పర్వతాన్ని చుట్టుకొని ఉండిపోయి నన్ను కదుపుకో అన్నాడు. […]

లంక ఒక ద్వీపం కాబట్టే లంకా ద్వీపం అన్నారు. ద్వీపం అంటే దీవి. దీవి అంటే చుట్టూ నలుదిక్కులా నీరువుండే మధ్య ప్రాంతం. లంక ఎక్కడుంది? సముద్రంలో ఎందుకుంది? దానికీ ఓ కథ ఉంది. ఆది శేషువుకీ వాయువుకీ మధ్య గొడవ. నా బలం ఎక్కువ అంటే నా బలం ఎక్కువ – అని. నిరూపించి నిగ్గు తేల్చుకోవాలని ఇద్దరూ పంతం పట్టారు. శేషువేం చేసాడూ – ఓ పర్వతాన్ని చుట్టుకొని ఉండిపోయి నన్ను కదుపుకో అన్నాడు. వాయువు ఊరుకుంటాడా?, లేదు. వీచాడు. బలంగా హోరెత్తాడు. శేషువు పట్టు వదల్లేదు. పర్వతమే విరిగింది. గాలికి తుళ్ళి వెళ్ళి సముద్రం మధ్యలో పడింది. అదే లంక! అక్కడే బ్రహ్మ తపస్సు చేసుకోవడం… ఊర్వశి కంటపడి రేతస్సు జారడం… అందులోంచి పులస్త్యుడు పుట్టడం… వారికి జన్మస్థానం అవడం ఒక కథయితే – మాల్యవదారులు దేవతలను గెలిచి విశ్వకర్మను ఆహ్వానించి లంకానగరాన్ని నిర్మించుకున్నారు. విష్ణువు ఓడించగా పాతాళానికి పారిపోయారు. కుబేరుడు ఆ తరువాత నివాసం ఉన్నాడు. రావణుడొచ్చాక కుబేరుడు లంకను వదిలి పారిపోయాడు. రావణుడు రాక్షసులతో లంకా రాజ్యంలో ఉన్నాడు.

లంకా రాజ్యానికి కాపలాగా లంఖిణిని నియమించాడు. లంఖిణి చాలా బలవంతురాలు. లంఖిణి కన్ను గప్పిగాని ఆజ్ఞలేకుండా చీమకూడా లంకలోకి ప్రవేశించలేదు. అంతటి వరబలాన్ని బ్రహ్మదేవుడే లంఖిణికి ఇచ్చాడు. ఒక స్త్రీ రాజ్యానికి కాపలాగా ఉండడం ఒక ప్రత్యేకతయితే – అసలు లంకానగరమే స్త్రీ రూపంలో ఉండడం మరో ప్రత్యేకత. నగరానికో ద్వారం… ద్వారం దగ్గర లంఖిణి!

సీత జాడ కనిపెట్టడం కోసం సముద్రాన్ని దాటి లంకకు వచ్చాడు ఆంజనేయుడు. కోతి రూపంలో లంకలోకి చొరబడాలని చూసాడు. లంఖిణి చూడనే చూసింది. ఎవరని అడిగింది. అడ్డగించింది. అవతలికి పొమ్మంది. లంకలోని అందాలు చూసి వస్తానన్నాడు. కోతే కదా చూసిరానీ, పోతే పోని అనలేదు. అవకాశమివ్వలేదు. పైగా ఒక్క చరుపు చరిచింది. ఆ దెబ్బకు ఆంజనేయుడు అరవక తప్పలేదు. ఆంజనేయుడు ఎంత కోతి రూపంలో ఉంటే మాత్రం కొడితే ఊరుకుంటాడా? పిడికిలి బిగించి పోటు పొడిచాడు. లంఖిణి విలవిలలాడింది. కిందపడింది. ఆంజనేయుణ్ని చూసింది. గ్రహించింది. చేతులు జోడించింది. ఓడిపోయానని ఒప్పుకుంది. చంపొద్దంది. దయతో విడిచి పెట్టమంది. ఎందుకంటే తను వరం పొందిన నాడే బ్రహ్మచెప్పిన మాటలు గుర్తుంచుకుంది. మరిచిపోలేదు. “నువ్వు ఎప్పుడైతే వానరుడి చేతిలో ఓడిపోతావో – అప్పుడే లంకకు ముప్పొచ్చిందని తెలుసుకో”. బ్రహ్మ వాక్కు జరిగింది. జరిగి తీరుతుంది. అందుకే లంఖిణి వానరులకి తోవ ఇచ్చింది. వాయుపుత్రునికి ప్రణమిల్లింది. సీతను ఎత్తుకొచ్చి రావణుడు లంకకే చేటు తెచ్చాడని అనుకుంది.

లంఖిణి ఎంత శక్తిమంతురాలైనా – ఎంతగా తన బాధ్యతల్ని నిర్వర్తించినా – చేటు కాలాన్ని గుర్తించి తగ్గాల్సిన సమయంలో వెనక్కి తగ్గింది. తగ్గి నెగ్గింది. ఓటమి కూడా గెలుపే కదా?!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  19 Jun 2015 1:02 PM GMT
Next Story