Telugu Global
Family

రెండూ ఒకటే (Devotional)

అతివినయం ధూర్త లక్షణం అన్నారు. అతివినయంగా ఉంటే అటువంటి వాళ్ళ పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ప్రమాదకారులు. అహంకరించేవాడు బహిరంగంగానే కనిపిస్తాడు. ముసుగు వేసుకోడు. వినయం ముసుగు వేసుకున్నవాడి వెనక విషముంటుంది.             అహంకారానికి అనేకరూపాలు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అది బహిరంగంగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో దాన్ని కనుక్కోవడం కష్టం. అహంకారం ప్రయోజనాల్ని ఆశించి ఉసరవెల్లిలా రంగులు మారుస్తుంది.             ఎవరయినా ఒక వ్యక్తి నన్ను మించిన భక్తుడు లేడు, నన్నుమించిన జ్ఞానిలేడు. నన్నుమించిన […]

అతివినయం ధూర్త లక్షణం అన్నారు. అతివినయంగా ఉంటే అటువంటి వాళ్ళ పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ప్రమాదకారులు. అహంకరించేవాడు బహిరంగంగానే కనిపిస్తాడు. ముసుగు వేసుకోడు. వినయం ముసుగు వేసుకున్నవాడి వెనక విషముంటుంది.

అహంకారానికి అనేకరూపాలు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అది బహిరంగంగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో దాన్ని కనుక్కోవడం కష్టం. అహంకారం ప్రయోజనాల్ని ఆశించి ఉసరవెల్లిలా రంగులు మారుస్తుంది.

ఎవరయినా ఒక వ్యక్తి నన్ను మించిన భక్తుడు లేడు, నన్నుమించిన జ్ఞానిలేడు. నన్నుమించిన వినయ సంపన్నుడు లేడు అంటే అతన్ని మనం సందేహించాలి, అది కనిపించీ కనిపించని అహంకారం.

నేను నియమం తప్పకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తాను. క్రమం తప్పకుండా పూజాపునస్కారాలు చేస్తాను. నిష్ఠాగరిష్టుణ్ణి అంటే అట్లాంటి వ్యక్తిని మనం విశ్వసించకూడదు. సాధుశీలి, సద్గుణ సంపన్నుడు తెరవెనక ఉంటాడు. బహిరంగ ప్రదర్శనకు రాడు. అతనికి ఎవరితోనూ ఎప్పుడూ పోటీ ఉండదు. మంచితనానికి పోటీ ఉండదు. నన్నుమించిన అహింసావాది లేడు అన్నవాడు హింసావాదే.

రమణ మహర్షి వివిధ సందర్భాల్లో తనని సందర్శించడానికి వచ్చిన దేశవిదేశాలకు సంబంధించిన వ్యక్తులతో సంభాషణలు జరిపాడు. వాళ్ళ సందేహాలకు సమాధానాలిచ్చాడు. వాటిని ఎందరో గ్రంధాలుగా ప్రచురించారు. వాటిల్లో ఆయన విస్పష్టమయిన ఆధ్యాత్మిక భావన సూటిగా ఆకర్షిస్తుంది. ఆ గ్రంధాల్ని ఎందరో ఎన్నెన్నో భాషలలోకి అనువదించారు.

అన్ని రంగాలలో ప్రముఖులు రమణ మహర్షి ఆశ్రమంలో ఉండేవారు. ఉద్యోగ విరమణానంతరం ఆశ్రమజీవనం కోసం వచ్చి అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు.

అట్లా ఒక ఉన్నత విద్యావంతుడు ఆశ్రమంలో ఉంటూ రమణ మహర్షి సమక్షంలో ఉంటూ జీవితాన్ని గడిపేవాడు. రమణమహర్షి పట్ల అతనికి అచంచలమైన విశ్వాసం. అతను రమణమహర్షి గ్రంధాన్ని తమ భాషలోకి అనువదించాడు. దాన్ని అచ్చువేయడానికి ప్రచురణ కర్తకు ఇచ్చాడు.

ప్రచురణకర్త దాన్ని అందంగా అచ్చువేసి ఇచ్చాడు. అందులో ఆ గ్రంధ రచయిత పేరు అచ్చువేశాడు. పుస్తకంలో తన పేరు ఉండడం చూసి రచయిత ఎంతో కోపగించాడు. ఇది రమణమహర్షి వారి గ్రంధం. అక్కడ నాపేరు ఉండడానికి అర్హత లేనిది. నువ్వు తప్పు చేశావు అని పశ్చాత్తాపపడి రమణ మహర్షి దగ్గరకు వెళ్ళి “మహర్షీ! నన్ను మన్నించు. అక్కడ నా పేరు ఉండాలని నేను ఉద్దేశించలేదు, అది ప్రచురణకర్త చేశాడు” అని ఎంతో తీవ్రమైన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు.

రమణమహర్షి అతన్ని చూసి “పుస్తకంలో పేరు ఉండాలనుకోవడం ఎలాంటిదో, పేరు ఉండకూడదు” అనుకోవడం కూడా అలాంటిదే. రెంటికీ పెద్ద తేడా లేదు, రెండూ అహంకార నాణేనికి బొమ్మ, బొరుసులే” అన్నాడు.

ఆ మాటల్తో అతను నోరు వెళ్ళబెట్టాడు.

– సౌభాగ్య

First Published:  20 Jun 2015 1:01 PM GMT
Next Story