మండోదరి (For Children)

మండూకం అంటే కప్ప. మండోదరి అంటే కప్ప (రూపాన్ని)ని ధరించినది అని! మండోదరి ఎవరు? ఎందుకు కప్ప రూపాన్ని ధరించింది? పురాణ గాధల్లోనూ జానపదుల్లోనూ ఇందుకు సంబంధించిన అనేక కథలున్నాయి..

            లంకా సార్వభౌముడు రావణుడు. రావణుని పట్ట మహిషి మండోదరి. అంతకన్నా ముందు రాక్షస శిల్పి అయిన మయుని కూతురు. హేమ అనే దేవకన్య కూతురు. ఇంద్రాది దేవతల్ని జయించిన ఇంద్రజిత్తుకు తల్లి. సుగుణాలు పోసిన అందాల రాశి. మంచి చెడులు ఎరిగిన మహాసాధ్వి. మహా పతివ్రత.

            తండ్రి మయునితో కలిసి మండోదరి ఒకరోజు అరణ్యంలో విహారానికి వచ్చింది. వేటకు అదే సమయంలో వచ్చాడు రావణుడు. చూసాడు. మోహించాడు. రావణుడే ఆ తండ్రీ కూతుళ్ళతో కల్పించుకొని కుశల ప్రశ్నలు వేసాడు. తాను లంకాధీశుడనని, తనకింకా పెళ్ళికాలేదని అడక్కుండానే సమాధానాలిచ్చాడు. అర్థం చేసుకున్న మయుడు మండోదరిని రావణునికిచ్చి పెళ్ళిచేసాడు.

            అయితే మండోదరి గురించి జానపదులు చెప్పిన కథ వేరు. రావణునికి తల్లంటే మహాభక్తి. ఆ తల్లి కైకసికి శివుడంటే మహాభక్తి. అమ్మ అడగగా శివుని ఆత్మలింగం ఇవ్వాలని భావించి కైలాసానికి వెళ్ళి తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. పక్కనున్న పార్వతిని చూసి వచ్చిన పని మరిచి పార్వతిని ఇమ్మని కోరాడు. శివుడు కాదనకుండా ఇచ్చాడు. పార్వతిని వెంట తీసుకొని వెళ్తున్న రావణునికి నారదుడు ఎదురయ్యాడు. ఎవరని అడిగాడు. పార్వతి తెలీదా? శివుని అర్థాంగి అని గర్వంతో అన్నాడు రావణుడు. జరిగింది చెప్పాడు. నారదుడు నవ్వాడు. నమ్మేశావా అన్నాడు. పార్వతి కాదన్నాడు. నిజరూపుని చూడమన్నాడు. అనుమానపు అవస్థలో రావణునికి పార్వతి ఒక పెద్ద గోదురు కప్పలా అవుపించింది. రావణుడు డంగై పోగా – అసలు పార్వతి కైలాస గిరి కిందవుందని, వస్తే చూపుతానని తన వెంట తీసకుపోయాడు. నిజంగానే కైలాసగిరి కింద ఒక కప్ప ఉంది. నారదుడు తాకడంతో ఆ కప్ప సర్వాంగ సుందరిగా మారిపోయింది. ఆ సుందరి పార్వతేనని నమ్మి తన వెంట తీసుకుపోయి పెళ్ళాడాడు నారదుడు. ఆవిడే మండోదరి. నిజానికి మండోదరి ఒక అప్సరసని, దుర్వాసముని శాప వశమున కప్పగా మారిందని, నారదుని వల్ల ఆశాపం తీరిందని మరో కథ ఉంది.

            ఇంకొక కథ కూడా ఉంది. అరణ్య విహారంలో ఉన్న రావణునిపై దాడిచేసి మండోదరిని మహాబలశాలి వాలి ఎత్తుకు పోయాడట. వాలి మండోదరులకు అంగదుడు పుట్టాడట. మండోదరిని తిరిగి రావణునికి ఇచ్చినా కొడుకు అంగదున్ని తన దగ్గరే ఉంచుకున్నాడట. రావణ మండోదరులకు అక్షయుడు పుట్టాడట. అక్షయుడూ అంగదుడూ ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకొనేవారట. ఇద్దరికీ పడేది కాదట. అక్షయుడు గురువుకి మొరపెట్టుకున్నాడట. దాంతో మీ ఇద్దరిలో ఎవరు ఎవర్ని కొట్టినా అంగదుడు తల పగిలి చస్తాడని శపించాడట. అంగదుడు విద్యనొదిలి కిష్కింధకు పారిపోయాడట. భయం పోలేదట. అందుకే వందయోజనాలు దాటి లంకను చేరగలనుగాని తిరిగి రాగలనో లేదో అని అంగదుడు అనడంలోని ఆంతర్యమదేనట. అక్షయుల్ని చంపేసాను, భయం లేదని హనుమంతుడు చెప్పడంలోని భావమదేనట!?

            ఏది ఏమయినా మండోదరి సీతను అపహరించడం తప్పని, తిరిగి రామునికి అప్పగించి రమ్మని కోరుతూ పోరుతూనే ఉంది. వేదవతి పసిబిడ్డగా తామరపూవులో మండోదరికి దర్శనమివ్వడం, ఆమె పెద్దలనడిగి లంకనాశనం గురించి హెచ్చరించడమూ బంగారు పెట్టెలో వదిలి పెట్టడమూ మండోదరి తన చేయగలిగిన వన్నీ చేసింది. చెప్పవలసిన వన్నీ చెప్పింది. తన భర్త హోమాన్ని ఆపాలని అంగదుడు తన జుట్టుపట్టుకు వస్తే భరించింది. రావణుడు తనను విడిపించడం కన్నా – రామునితో యుద్ధంలోంచి బయట పడాలని కోరుకుంది. విఫలమైంది. అయినా ఒక భార్యగా మండోదరి తన స్థానాన్ని నిలబెట్టుకుంది!.

– బమ్మిడి జగదీశ్వరరావు