30 వరకే బస్సుల ఫిట్‌నెస్‌కు గడువు

రంగారెడ్డి జిల్లాలో 1200, హైద‌రాబాద్‌లో 180 స్కూలు బ‌స్సులు ఇంకా ఫిట్ స‌ర్టిఫికెట్‌లు పొంద‌లేద‌ని, వీటిని ఈ నెల 30లోగా ఫిట్‌నెస్ టెస్టులు పూర్తి చేసుకోవాలని ర‌వాణా శాఖ అధికారులు ఆదేశించారు. ఈ తేదీ త‌ర్వాత బ‌స్సుల్ని సీజ్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. విద్యా సంస్థలు ప్రారంభమై రెండు వారాలు కావొస్తున్నా ఆయా సంస్థలకు చెందిన బస్సులు ఫిట్‌నెస్‌లు మాత్రం చేయించుకోక‌పోవ‌డంతో రవాణా శాఖ అధికారులు త్రీవంగా పరిగణిస్తున్నారు. స్కూలు బస్సుల ఫిట్‌నెట్‌ వల్ల జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ముందుగానే రవాణా శాఖ హెచ్చరికలు చేసింది. మే 13 వ తేదీ నుంచే విద్యా సంస్థలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న తర్వాతే ఫిట్‌నెస్‌ కోసం రావాలని ప్రత్యేకంగా ఆదేశించింది. అయినా ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌తో పాటు పూర్తి స్థాయిలో బస్సుల ఫిట్‌నెస్‌ పూర్తి కాలేదు. ఫిట్‌నెస్‌ చేయించుకోని స్కూలు బస్సులపై కఠినంగా వ్యవహరిస్తామని హైదరాబాద్‌ జిల్లా సంయుక్త రవాణా కమిషనర్‌ టి.రఘునాథ్‌ తెలిపారు.