Telugu Global
Family

కంసుడు (For Children)

ఔను! శ్రీ కృష్ణుని మేనమామ కంసుడు! మరి కృష్ణుడు కంసుణ్ని ఎందుకు చంపాడు? ఏమా కథ?             ముందు జన్మలో మారీచుని కొడుకైన కాలనేమి కంసుడిగా పుట్టాడని చెపుతారు. కంసుని తండ్రి పేరు ఉగ్రసేనుడు. అతని భార్యకు దేవదాది న్యాయము వలన ద్రవిళుడను వానికి పుట్టినవాడు. అంటే క్షేత్రజ పుత్రుడన్న మాట. ఉగ్రసేనుని భార్య కొందరు గొల్ల స్త్రీలతో కలిసి యమునా నదికి స్నానానికి వెళ్ళి పుష్పవతి అయింది. ఆమె తన భర్తను తలచుకుంది. రాక్షసుడైన ద్రవిళుడు […]

ఔను! శ్రీ కృష్ణుని మేనమామ కంసుడు! మరి కృష్ణుడు కంసుణ్ని ఎందుకు చంపాడు? ఏమా కథ?

ముందు జన్మలో మారీచుని కొడుకైన కాలనేమి కంసుడిగా పుట్టాడని చెపుతారు. కంసుని తండ్రి పేరు ఉగ్రసేనుడు. అతని భార్యకు దేవదాది న్యాయము వలన ద్రవిళుడను వానికి పుట్టినవాడు. అంటే క్షేత్రజ పుత్రుడన్న మాట. ఉగ్రసేనుని భార్య కొందరు గొల్ల స్త్రీలతో కలిసి యమునా నదికి స్నానానికి వెళ్ళి పుష్పవతి అయింది. ఆమె తన భర్తను తలచుకుంది. రాక్షసుడైన ద్రవిళుడు చూసి ఉగ్రసేనుని రూపంలో వెళ్ళాడు. అంతా జరిగిన తరువాత తను మోసపోయానని గ్రహించింది. నిలదీసింది. నీ వలన పుట్టిన వాడు హరివంశమున పుట్టినవాడి చేతిలో మరణిస్తాడని శపించింది.

రాక్షస రాజు వలన పుట్టిన కంసునికీ రాక్షస లక్షణాలు వచ్చాయి. కంసుడు పెరిగి పెద్దవాడు అవుతూనే తండ్రి ఉగ్రసేనుని చెరశాలలో బంధించాడు. తాను రాజయ్యాడు. జరాసంధుని కూతుళ్ళయిన ఆస్తి, ప్రాస్తి ఇద్దరినీ పెళ్ళాడాడు. శిశుపాలునితో స్నేహం చేసాడు.

శ్రీ కృష్ణుని తల్లయిన దేవకీ దేవి ఎవరో కాదు కంసుని పిన తండ్రి కూతురు. వసుదేవునికిచ్చి పెళ్ళిచేసారు. చెల్లెలైన దేవకిని కంసుడు ప్రేమగానే చూసుకున్నాడు. అందుకనే చీరసారెల్తో అత్తవారింటికి పంపుతూ ఉన్నాడు. అప్పుడు ఆకాశవాణి పలికింది. దేవకి అష్టమ (ఎనిమిదవ) గర్భంలో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడని చెప్పడంతో కంసుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. చెల్లెలని చూడకుండా కత్తెత్తాడు. వసుదేవుడు బతిమాలాడాడు. ఆ దంపతులిద్దరూ ప్రాణ భయంతో తమకు పుట్టిన బిడ్డలను అప్పగిస్తామని చెప్పడంతో కంసుడు శాంతించాడు. కలతతో కలవరంతో దేవకీ వసుదేవులను చెరశాలలోనే బంధించాడు. పుట్టిన ఆరుగురు పురిటికందుల్ని పురిట్లోనే చంపేసాడు. ఏడవ సంతానం గర్భసంరక్షణ యోగం చేత దేవకి నుండి రోహిణి గర్భానికి చేరింది. ఆ బిడ్డే బలరాముడు. ఆ తర్వాత ఎనిమిదో సంతానం శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని యశోద ఇంటికి మార్చి యోగమాయని తెచ్చి దేవకి పక్కన ఉంచాడు వసుదేవుడు. దేవకీ దేవి ఎంత ప్రాధేయపడ్డా ప్రయోజనం లేకపోయింది. కంసుడు వచ్చాడు. తన మృత్యువుగా భావించి ఆపాపని గాల్లోకి విసిరి కత్తి దూయబోయాడు. పైకెగిరిన పాప కింద పడలేదు, ఆకాశంలో అలాగే ఉండి “నిన్ను చంపేవాడు భూమ్మీద ఎక్కడో ఒక చోట పెరుగుతున్నాడు. వస్తాడు. వచ్చి నీ ప్రాణాలు తీస్తాడు” అని పలికింది.

కంసుడికి దిక్కుతోచలేదు. ఊరూరూ ఇల్లిళ్ళూ వెతికాడు. దొరికిన ప్రతి శిశువునూ ఖండ ఖండాలుగా నరికి చంపాడు. చివరకు ఆపనిని పూతనకు అప్పగించాడు. ఆ స్త్రీ అదృశ్యరూపంలోనూ ఆకాశ మార్గంలోనూ వెదికింది. అందమైన స్త్రీగా ఇంటింటికి విషపు పాలిచ్చి చంపి, చివరకు శ్రీకృష్ణుడు పాలతోపాటు ఆమె శరీరంలోని రక్తాన్ని పీల్చేయడంతో ఆమె చనిపోయింది. తరువాత కూడా కంసుడు మల్ల యుద్ధంలో ఆరితేరిన యోధుల్ని దించాడు. వారిని బలరామకృష్ణులు భీకరంగా ఎదుర్కోవడమే కాదు, వాళ్ళ ప్రాణాలు తీసారు. తన ప్రాణం వీదికి వచ్చిందని కంసుడు గ్రహించాడు. ప్రాణ భీతితో ఉన్న కంసుణ్ని జుట్టు పట్టుకొని సింహాసనం మీది నుండి కిందికి తోసేసాడు కృష్ణుడు. అంతే క్షణాల్లో కంసుని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

కంసుడు తన ప్రాణాలు కాపాడు కోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు కృష్ణుని చేతిలోనే ఊపిరొదిలాడు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  24 Jun 2015 1:02 PM GMT
Next Story