Telugu Global
Family

హిడింబి (For Children)

హిడింబి రాక్షస జాతికి చెందిన మగువ. ఆమె అన్న హిడింబాసురుడు. అర వీర భయంకరుడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ అడవిలోనే ఉండేవారు.             ఒకరోజున ఆ అన్నా చెల్లెళ్ళున్న అడవిలోకి పాండవులు వచ్చారు. లక్కయింటి ఆపదనుంచి తప్పించుకొని పారిపోయి వచ్చారు. వస్తూవస్తూ అడవిలోకి వచ్చారు. అలసిపోయి వచ్చారు. అందుకనే కుంతి సహా పాండవులందరూ మర్రిచెట్టు కింద నిద్రపోయారు. భీముడొక్కడూ మేలుకొనివుండి కాపు కాస్తున్నాడు.             ఆ చెట్టు మీద ఉన్న హిడింబాసురుడు పసిగట్టి “నరవాసన… నరవాసన” అన్నాడు. పాండవులను […]

హిడింబి రాక్షస జాతికి చెందిన మగువ. ఆమె అన్న హిడింబాసురుడు. అర వీర భయంకరుడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ అడవిలోనే ఉండేవారు.

ఒకరోజున ఆ అన్నా చెల్లెళ్ళున్న అడవిలోకి పాండవులు వచ్చారు. లక్కయింటి ఆపదనుంచి తప్పించుకొని పారిపోయి వచ్చారు. వస్తూవస్తూ అడవిలోకి వచ్చారు. అలసిపోయి వచ్చారు. అందుకనే కుంతి సహా పాండవులందరూ మర్రిచెట్టు కింద నిద్రపోయారు. భీముడొక్కడూ మేలుకొనివుండి కాపు కాస్తున్నాడు.

ఆ చెట్టు మీద ఉన్న హిడింబాసురుడు పసిగట్టి “నరవాసన… నరవాసన” అన్నాడు. పాండవులను చూసాడు. చూసి “ఆ నరుల్ని చంపి నాకు వండి వడ్డించు” అని చెల్లెలు హిడింబిని పంపించాడు. అన్న ఆజ్ఞ మేరకు హిడింబిని వెళ్ళనయితే వెళ్ళిందిగాని అన్న చెప్పిన పని చెయ్యలేదు. భీముణ్ణి చూసింది. తొలి చూపులోనే ఇష్టపడింది. వెంటనే కామరూపి అయింది. అంటే నచ్చిన రూపంలోకి మారిపోయిందన్న మాట. భీముని దగ్గరకు వెళ్ళింది. మీరెవరు? ఎందుకొచ్చారు? అనడిగింది. తన అన్యయ్య హిడింబాసురుని రాజ్యంలోకి వచ్చారని చెప్పింది. చూస్తే చంపేస్తాడంది. పారిపొమ్మంది. అందర్నీ తీసుకుని ప్రమాదం నుండి బయటపడమంది. భీముడు వినలేదు. భయపడలేదు. హిడింబిని పొమ్మన్నాడు. హిడింబాసురుణ్ణి రమ్మన్నాడు.

హిడింబి తన కోరికను చెప్పే సమయంలో హిడింబాసురుడు ఆలస్యమయిందంటూ అరచుకుంటూ వచ్చాడు. చెప్పిన పని చెయ్యలేదని కోపంతో విరుచుకుపడబోతే – భీముడు తన తల్లీ సోదరులు నిదుర పోతున్నారని అడ్డుకోవడంతో మరింత ఆగ్రహం కలిగింది. ఇక ఆగలేదు. మీదికి వచ్చాడు. కాస్త దూరం తీసుకు వెళ్ళి హిడింబాసురుడితో తల పడ్డాడు. కొండలూ గుట్టలూ ఒకరి మీదికొకరు విసురుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు, పిడుగులు పడ్డట్టుగా!

శబ్దాలకూ, అరుపులకు కుంతీ, ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు నిద్రలేచారు. హిడింబి జరిగింది చెప్పింది. అంతా అటు వెళ్ళి చూస్తే హోరా హోరి పోరు. భీముడు చివరకు హిడింబాసురుణ్ణి మట్టి కరిపించాడు.

తరువాత కుంతి సహా పాండవులు అక్కడినుండి బయల్దేరి వెళుతుంటే హిడింబి వారి వెంట పడింది. తన అన్నపోయి వంటరి నంది. వలచానంది. అర్ధించింది. భీముడు వినలేదు. నమ్మలేదు. కుంతి సాటి ఆడదానిగా అర్థం చేసుకుంది. ధర్మజునికి చెప్పింది. ధర్మజుడూ హిడింబిని పెళ్ళాడమన్నాడు. అప్పటికే హిడింబిని అడవి దారులన్నీ చూపించింది. సేవలెన్నో చేసింది. అలా శాలిహోత్ర సరస్సు దగ్గర నివాసం ఉండగా వ్యాసమహర్షి వచ్చాడనీ – భీముణ్ణి హిడింబిని పెళ్ళాడవలసిందిగా చెప్పాడనీ – వారికి అత్యంత బలవంతుడైన కొడుకు పుడతాడనీ – చెప్పాడని చెపుతారు. మొత్తానికి భీముడు హిడింబిని అందరి అనుమతితో పెళ్ళాడాడు. ఇద్దరూ కొండల్లో గుహల్లో వనాల్లో విహరించారు. హిడింబి గర్భం దాల్చింది. మహాబలవంతుడైన కొడుకును కన్నది. ఆ కొడుకే ఘటోత్కచుడు!

పాండవుల వనవాసానికి అడ్డం రాకుండా హిడింబి తన కొడుకు ఘటోత్కచునితో కలిసి తిరిగి తన రాజ్యానికి బయల్దేరి వెళుతూ – తానూ తన బిడ్డ పిలిచినప్పుడు వస్తామని చెప్పింది. చెప్పినట్టుగానే – అర్జునుడు పాశుపతాస్త్రంకోసం తపస్సుకు వెళ్ళినప్పుడు – అదే సమయంలో భీముడు సౌగంధిక పుష్పం తేవడానికి వెళ్ళినప్పుడు – తలవగానే కొడుకును పాండవుల కాపలాకు పంపింది. అంతిమ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడూ హిడింబి కొడుకును పాండవుల పక్షాన యుద్ధానికి పంపింది. కర్ణుని చేతిలో తనకొడుకు కన్ను మూసాడని తెలిసి కన్నీరయింది హిడింబి. హిడింబి అసలు పేరు కమల పాలిక!

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  25 Jun 2015 1:02 PM GMT
Next Story