పవన్‌ వ్యాఖ్యలతో ఆందోళనపడుతున్న చెర్రీ అభిమానులు

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ రంగ ప్రవేశంతో చిరంజీవి అభిమానులకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. చిరంజీవి పార్టీపెట్టి ఫ్లాప్‌ అయి మూసివేయడాన్ని చిరు అభిమానులు అవమానంగా భావించారు. కమ్మ, కాపు సామాజిక వర్గాలకు బద్ధవైరం కాబట్టి కమ్మవారి ముందు తల కొట్టేసినట్లయింది. ఈ నేపధ్యంలో పవన్‌ “జనసేన”ను ప్రారంభించడంతో పవన్‌కళ్యాణ్‌ అభిమానులతో పాటు చిరంజీవి అభిమానులు కూడా పవన్‌ వెంట నడిచారు. మన కాపుల పరువు నిలిపే ఏకైక నాయకుడని భావించారు.
     కాని పవన్‌ తమ శత్రువర్గమైన టిడిపిని సమర్ధించడం కాపు అభిమానులకు జీర్ణం కాలేదు. అయితే చంద్రబాబు పవన్‌ను వెతుక్కుంటూ సినిమా ఆఫీసుకు, ఇంటికి పరుగులు తీయడం, చాలాసేపు పవన్‌ రాక కోసం ఎదురు చూడడం, పవన్‌ని కలిసిన సందర్భంగా కుర్చీలో ఒదిగి కూర్చుని, వినయంగా పవన్‌తో మాట్లాడడం కాపుల అహాన్ని తృప్తి పరిచింది. సెహబాష్‌ పవన్‌ అనుకున్నారు.
     ఎన్నికల తర్వాత పవన్‌ని కరివేపాకులా ప్రక్కన తీసి పారేయడం, రాజధానికి భూముల సేకరణ విషయంలో పవన్‌ని పట్టించుకోకపోవడంతో అభిమానులు బాధపడ్డారు.
     తుళ్ళూరు వెళ్ళి బాధిత రైతులతో బాబుని నిలదీస్తానని చెప్పిన పవన్‌ హైదరాబాద్‌ వచ్చి బాబుని సమర్ధించడం అభిమానులకు మింగుడు పడలేదు.
     తాజాగా ఇప్పుడు పవన్‌ మండేలా వంటి మహానుభావుల ఉదాహరణలు చెప్పి బాబు వర్గం సేవలో మునిగిపోవడం పవన్‌ అభిమానులకు మింగుడు పడడం లేదు.
     ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పడు తెలంగాణాలోని చిరు, పవన్‌, చెర్రీ అభిమానులు ఆత్మ పరిశీలనలో పడ్డారు. మాతృభూమి తెలంగాణ ముఖ్యమా? చిరు కుటుంబం పట్ల అభిమానం ముఖ్యమా అనే డైలమాలో పడ్డారు. ఇప్పుడిప్పుడే కొంతమంది నోరు విప్పి పవన్‌పై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏం ఆశించి టిడిపి తరుపున వకాల్తా పుచ్చుకున్నావని అడుగుతున్నారు. పవన్‌ నిజాయితీని శంకిస్తున్నారు. ఇదే వేవ్‌ కొనసాగితే తెలంగాణలోని పవన్‌, చిరు, చెర్రీ అభిమానులు చాలా మంది వాళ్ళకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని పసికట్టిన చెర్రీ అభిమానులు పవన్‌ వైఖరి పట్ల ఆందోళన పడుతున్నారు.