Telugu Global
Others

డేగల్లా పొడుచుకు తింటున్న ఈగలు!

దర్శకుడు రాజమౌళి సినిమా ఈగలో విలన్‌ చంపేదాకా వదల్లేదు. సినిమాలో మాదిరిగా నిజంగా ఈగ పగబడుతుందో లేదో తెలీదు కానీ… ఈ ఊరిపై మాత్రం ఈగలు పగబట్టాయి. ఈగల్లా కాదు… డేగల్లా ఆ ఊరి జనాన్ని చంపేస్తున్నాయి. ఇపుడు మనం చదువుకునే కథ జరుగుతున్న ఊరు కమ్మకండ్రిగ. ఇది చిత్తూరు జిల్లా రామభద్రాపురం మండలంలో ఉంది. దాదాపు రెండు నెలల నుంచి ఈ ఊరి జనానికి కంటి మీద కునుకు లేదు. అన్నీ ఉన్నా రుచిగా వండుకు […]

డేగల్లా పొడుచుకు తింటున్న ఈగలు!
X
దర్శకుడు రాజమౌళి సినిమా ఈగలో విలన్‌ చంపేదాకా వదల్లేదు. సినిమాలో మాదిరిగా నిజంగా ఈగ పగబడుతుందో లేదో తెలీదు కానీ… ఈ ఊరిపై మాత్రం ఈగలు పగబట్టాయి. ఈగల్లా కాదు… డేగల్లా ఆ ఊరి జనాన్ని చంపేస్తున్నాయి. ఇపుడు మనం చదువుకునే కథ జరుగుతున్న ఊరు కమ్మకండ్రిగ. ఇది చిత్తూరు జిల్లా రామభద్రాపురం మండలంలో ఉంది. దాదాపు రెండు నెలల నుంచి ఈ ఊరి జనానికి కంటి మీద కునుకు లేదు. అన్నీ ఉన్నా రుచిగా వండుకు తిందామంటే అసలు సాధ్యం కావడం లేదు. మహిళల తిప్పలు మరీను. పండుగా లేదు… పబ్బమూ లేదు. చుట్టమూ లేదు… పక్కమూ లేదు. తినే తిండిలో, కూర్చునే చోటులో… పడుకునే పక్కలో… ఇలా ఎక్కడ చూసినా వేలాది ఈగలు డేగల్లా చంపుకు తింటున్నాయి. దీంతో గ్రామాన్ని వదిలి జనం పరారై పోతున్నారు. ఇళ్ళు వదిలి వేరే చోటికి పోలేనోళ్ళు… ఇంట్లో గబగబా ఏదో కాస్త వండుకుని… ఈగలన్నీ ఏరేసి వాటిపై మూత పెట్టుకుని, ఆ వండుకున్నది తింటానికి పొలం వైపు క్యూ కడుతున్నారు. అన్నంలో… సాంబారులో… కూరలో… కనీసం కాచుకునే టీలో… ఇలా ఎక్కడ చూసినా వేలాది ఈగలు. చిన్నపిల్లలు తెలీక తినేస్తుంటే రోగాల బారిన పడిపోతున్నారు. ఈ పరిస్థితి చూసి బంధువులెవరూ ఆ గ్రామం వైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఒకవేళ రాదలుచుకుంటే పక్క గ్రామానికి వచ్చి కబురు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇంట్లోనే కాదు… గోడలు, మేడలు, గుళ్ళు, గోపురాలు… ఇలా ఎక్కడ చూసినా లక్షలాది ఈగలు వాలి జనానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. బయట ఊరుల్లో ఉండే వాళ్ళెవరూ తిరిగి గ్రామానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఏదైనా సందర్భం వచ్చి పది మందికి భోజనం పెట్టాల్సి వస్తే వడ్డించిన భోజనంలో ఈగలు చేరిపోయి ఆహార పదార్ధాల్ని కప్పేస్తున్నాయి. ఈ తలనొప్పి భరించలేక అసలు పండుగ పబ్బాలకి ఎవర్నీ పిలవడం కూడా మానేశారు కమ్మకండ్రిగ గ్రామస్థులు. ఇలా ఈగలు వేధిస్తుండడంతో మందుల కోసం క్యూ కట్టారు మొదట్లో. ఇలా కొన్నినాళ్ళు గడిచిన తర్వాత మందులకు కూడా లొంగవని తెలిసి ఆ ప్రయత్నం కూడా విరమించారు. కోళ్ళ‌ ఫారాల వల్లే ఇలా ఈగలు ప్రబలిపోయాయని అంటుంటే సంబంధిత యజమానుల దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకున్నారు గ్రామస్థులంతా. అయినా వారు చేపట్టిన చర్యలు శూన్యం. ఇక్కడ కోళ్ళ ఫారాల్లో రోజూ ఎండ దెబ్బకు వంద నుంచి రెండొంద‌ల వ‌ర‌కు కోళ్ళు చ‌నిపోతుండేవి. వీటిని ఆరు బ‌య‌టే పడేశావారు. దీనివల్ల కూడా ఈగలు వస్తున్నాయని అధికారులకు చెప్పినా పెద్దగా ప్ర.యోజనం లేకపోయింది. ఈ విషయమై కోళ్ళఫారాల యజమానులు మాట్లాడుతూ… సాధార‌ణంగా వ‌ర్షాకాలం ఇలాగే ఉంటాయ‌ని, ఇది కోళ్ళ‌ఫారాల వ‌ల్లే కాద‌ని వారు వాదిస్తున్నారు. చెరుకు, మామిడి కాయ‌ల సీజ‌న్‌లో ఇలా ఈగ‌లు రావ‌డం స‌హ‌జ‌మ‌ని వారు అంటున్నారు. మొత్తం మీద ఈగల సమస్య పరిష్కారం కోసం కమ్మకండ్రిగ గ్రామం ఇపుడు అధికారుల వైపు ఆశగా ఎదురు చూస్తోంది.
First Published:  30 Jun 2015 5:00 AM GMT
Next Story