Telugu Global
Others

ఏపీలో ఉద్యోగుల‌తో 'బ‌దిలీల‌' బంతాట !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏ ముహూర్తాన ఉద్యోగుల బ‌దిలీల‌కు శ్రీ‌కారం చుట్టిందో కాని అప్ప‌టి నుంచి ఉద్యోగులు ఆశ నిరాశ‌ల మ‌ధ్య న‌లిగి పోతున్నారు. మే నెల మ‌ధ్య‌లో ప్రారంభించిన బ‌దిలీల ప్ర‌క్రియ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇప్ప‌టికి నాలుగుసార్లు ఆగిపోయింది. ఇది ఉద్యోగుల‌ను మాన‌సికంగా ఆవేద‌న‌కు గురి చేస్తోంది. ఈ ప్ర‌క్రియ‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత మే 18-31 మధ్య బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే త‌మ‌కు తెలియ‌కుండా అధికారులే ఏక‌ప‌క్షంగా బ‌దిలీల‌ను చేసేస్తున్నార‌ని మంత్రులు […]

ఏపీలో ఉద్యోగుల‌తో బ‌దిలీల‌ బంతాట !
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏ ముహూర్తాన ఉద్యోగుల బ‌దిలీల‌కు శ్రీ‌కారం చుట్టిందో కాని అప్ప‌టి నుంచి ఉద్యోగులు ఆశ నిరాశ‌ల మ‌ధ్య న‌లిగి పోతున్నారు. మే నెల మ‌ధ్య‌లో ప్రారంభించిన బ‌దిలీల ప్ర‌క్రియ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇప్ప‌టికి నాలుగుసార్లు ఆగిపోయింది. ఇది ఉద్యోగుల‌ను మాన‌సికంగా ఆవేద‌న‌కు గురి చేస్తోంది. ఈ ప్ర‌క్రియ‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత మే 18-31 మధ్య బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే త‌మ‌కు తెలియ‌కుండా అధికారులే ఏక‌ప‌క్షంగా బ‌దిలీల‌ను చేసేస్తున్నార‌ని మంత్రులు కేబినెట్ స‌మావేశంలో మొర పెట్టుకోవ‌డంతో వెంట‌నే వాటిని ఆపేయాల‌ని, మంత్రులు అధికారులు క‌లిసి కౌన్సిలింగ్‌తో బ‌దిలీల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని చెబుతూ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. దీంతో తొలిసారి బ‌దిలీల ప్ర‌క్రియ నిలిచిపోయింది. రెండోసారి బ‌దిలీల ప్ర‌క్రియ‌ను షురూ చేసినా టీడీపీ మహానాడు నిర్వహణతో మరోసారి బ్రేకులు పడ్డాయి. దాంతో మ‌ళ్ళీ జూన్‌ 9-15 మధ్య బదిలీలు చేయాలని ప్రభుత్వం షెడ్యూలు ప్రకటించింది. అంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు రావడంతో ఈ ప్రక్రియా కొనసాగలేదు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలతో సంబంధం లేనిచోట బదిలీలు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా, ఇన్ని ఆటంకాల మధ్య బదిలీలు సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపి వేసింది. ఆ తర్వాత, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 9 జిల్లాల్లో 7 జిల్లాల్లో ఏకగ్రీవం కావడంతో స‌ద‌రు జిల్లాల్లో బదిలీలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో, ప్రకాశం, కర్నూలు, కడప, నెల్లూరు మినహా మిగిలిన జిల్లాల్లో బదిలీలను నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఈనెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జీవో 57ను సవాల్‌ చేస్తూ వెటర్నీరీ డాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఏకంగా ఆ జీవోను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఆర్థిక శాఖ కూడా రాష్ట్రవ్యాప్తంగా బదిలీలను నిలిపి వేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. ఒక‌సారి మంత్రుల కోసం… మ‌రోసారి మ‌హానాడు కోసం… ఇంకోసారి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోడ్ కోసం… ఇపుడు కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల అమ‌లు కోసం… ఇలా నాలుగుసార్లు నిలిచిపోవ‌డంతో ఉద్యోగులు మాన‌సికంగా న‌లిగి పోతున్నారు. ఒక‌వైపు విద్యా సంవ‌త్స‌రం ప్రారంభ‌మై దాదాపు నెల రోజులు గ‌డిచిపోతోంది. మ‌రోవైపు చాలా స్కూళ్ళ‌లో అడ్మిష‌న్ల ప్ర‌క్రియ ముగిసి పోయింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు బ‌దిలీ అయితే వారి కుటుంబాల‌ను త‌ర‌లించ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని. బ‌దిలీల‌ను చేప‌ట్టాల‌నే రాష్ట్ర ప్ర‌భుత్వానికి ముంద‌స్తు ప్ర‌ణాళిక ఉండ‌దా అనే ప్ర‌శ్న ఇపుడు త‌లెత్తుతుంది. ఎవ‌రెలా చ‌స్తే మాకేంటి అనుకునే ప్ర‌భుత్వ పెద్ద‌ల వైఖ‌రి కార‌ణంగా ఎప్పుడు ఏ పిడుగులాంటి వార్త వినాల్సి వ‌స్తుందోన‌ని అన్ని వ‌ర్గాల ఉద్యోగులు… వారి కుటుంబాలూ మాన‌సికంగా న‌లిగిపోతున్నారు.
First Published:  30 Jun 2015 1:57 AM GMT
Next Story