కృష్ణా యాద‌వ్‌కు ఓ న్యాయం.. రేవంత్‌కు ఒక న్యాయ‌మా!

ఓటుకు నోటు కేసులో పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయిన టీడీపీ ఎలాగైనా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కేసు నుంచి బయిట పడెయ్యాలని ప్ర‌య‌త్నిస్తోన్న సంగ‌తి తెలిసిందే! రేవంత్ విష‌యంలో టీడీపీ ఎక్క‌డ‌లేని ప్రేమ ప్ర‌ద‌ర్శిస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కు రూ.50 ల‌క్ష‌లు లంచం ఇస్తూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప‌ట్టుబ‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంత‌మంతా వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా ఇంత‌వ‌ర‌కూ రేవంత్‌పై పార్టీ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోలేదు. క‌నీసం ఆ విష‌యాన్ని ఖండించ‌డం లేదు. తాము స్వ‌చ్ఛ‌మైన పాల‌న అందిస్తామ‌ని, బీసీల అభ్యున్న‌తికి పాటుప‌డ‌తామ‌ని గొప్ప‌లు చెప్పుకునే బాబు ఈ కేసులో ఎందుకు నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు? గ‌తంలో న‌కిలీ స్టాంపుల కుంభ‌కోణంలో సంబంధం ఉందంటూ ఆరోప‌ణ‌లు రావ‌డంతోనే ఉన్న‌ప‌లంగా బీసీ అయిన‌ కృష్ణాయాద‌వ్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ఆ స‌మ‌యంలో క‌నీసం కృష్ణాయాద‌వ్ వివ‌ర‌ణ కూడా కోర‌లేదు.కుంభ‌కోణానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని బ‌హిరంగ ప్ర‌క‌ట‌న కూడా చేసింది.

రేవంత్‌కి ఎందుకు ప్ర‌త్యేకం!
మాజీ మంత్రి కృష్ణాయాద‌వ్ విష‌యంలో పార్టీ వ్య‌వ‌హ‌రించిన తీరు క‌ర‌క్టే. కుంభ‌కోణంలో 2003లో సీబీఐ అరెస్టు చేసిన వెంట‌నే ముందు స‌స్పెండ్ చేశారు. అయితే, రేవంత్ ఎందుకు ప్ర‌త్యేకమో చంద్ర‌బాబుకే తెలియాలి. ఎమ్మెల్యే కొనుగోలు కుంభ‌కోణంలో రేవంత్‌రెడ్డిని ప‌క్క రాష్ర్ట పోలీసులే అరెస్టు చేశారు క‌దా! మ‌రి ఎందుకు అత‌న్ని కాపాడేందుకు నానా ప్ర‌యాస ప‌డుతోంది. ఎందుకంటే.. ఇక్క‌డ సూత్ర‌ధారి చంద్ర‌బాబు అని ఆరోప‌ణ‌లు రావ‌డం, అందుకు సంబంధించి ఆడియో టేపులు లీక‌వ్వ‌డమే. త‌న‌ను అరెస్టు చేస్తే.. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తాన‌ని జాతీయ‌మీడియా ముందు చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు జారీ చేసి.. రేవంత్‌రెడ్డి త‌మ‌కు ఎంత ప్ర‌త్యేక‌మో చెప్ప‌క‌నే చెప్పారు. కృష్ణాయాద‌వ్ నిర‌ప‌రాధి అని తేల‌డంతో ఇప్పుడు పార్టీ లో చేర్చుకున్నారు. అత‌నిపై ఎలాంటి నేరారోప‌ణ‌లు రుజువు కాలేదు. పార్టీలో కీల‌క‌మైన వ్య‌క్తి, ఆ స‌మ‌యంలో మంత్రిగా ఉన్న వ్య‌క్తిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో చూపిన వేగం, రేవంత్ రెడ్డి విష‌యంలో చూప‌క‌పోవ‌డం టీడీపీ ద్వంద వైఖ‌రికి నిద‌ర్శ‌నం. ఆయ‌న లంచం ఇస్తుండ‌గా ప్ర‌పంచానికి క‌నిపించినా, అది టీడీపీకి ఎందుకు క‌నిపించ‌డం లేదో? స‌్వచ్ఛ‌మైన పాల‌న‌, బీసీల అభ్యున్న‌తి అంటే.. ఇదేనా? అని కృష్ణాయాద‌వ్ అనుచ‌రులు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

-అర్జున్