ఒకే రోజు మూడు విచిత్రాలు

ఒకే రోజు.. మూడు ప్రాంతాలు..మూడు భిన్న‌మైన ప‌రిణామాలు.. వాటి ప‌ర్య‌వ‌సానాలు ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లోని మూలాధార‌మైన ప్ర‌జ‌ల్ని ప్ర‌శ్నించేలా ఉన్నాయి. ప్ర‌జ‌లు త‌మ‌ను తాము అద్దంలో ఓ సారి చూసుకోవాల‌నే హెచ్చ‌రిక చేస్తున్నాయి.
1.అక్ర‌మాస్తుల కేసులో ప్ర‌త్యేకకోర్టు విధించిన శిక్షతో సీఎం ప‌ద‌వి కోల్పోయి..క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పుతో అగ్నిపునీతైన పుర‌చ్చిత‌లైవి.. ఆర్కేన‌గ‌ర్ శాస‌న‌స‌భా స్థానం నుంచి ల‌క్షా 50 వేల‌కు పైగా మెజారిటీతో అద్వితీయ‌మైన విజ‌యాన్ని సాధించారు. అమ్మ విజ‌యోత్స‌వ‌ సంబ‌రాన్ని అంబ‌రాన్నంటేలా జ‌రుపుకున్నారు అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు.
2. ఒక్క ఓటును ఐదు కోట్లు ఇచ్చి కొనేందుకు ప్ర‌య‌త్నించి..ఏసీబీకి అడ్డంగా దొరికిపోయి అరెస్ట‌యి జైలులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికేందుకు తెలుగుదేశం పార్టీ మ‌హాన‌గ‌ర‌మంతా ప‌సుపుమ‌యం చేసింది. సినిమా వాళ్ల‌తో పాట‌లు రాయించి నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొట్టిస్తోంది. ఆయ‌నేదో ఒలింపిక్‌లో బంగారు ప‌త‌కం సాధించుకొచ్చిన‌ట్టు ఘ‌న‌స్వాగ‌తానికి ఏర్పాట్లు జ‌రిగాయి.
3. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సాయిబాబాకు బొంబాయి హైకోర్టు మూడు నెల‌ల బెయిలిచ్చింది. ఈ ప్రొఫెస‌ర్ అక్ర‌మాస్తులు కూడ‌బెట్ట‌లేదు. నోటుతో ఓటును కొనేందుకు ప్ర‌య‌త్నించ‌లేదు. రోజువారీ జ‌రుగుతున్న‌ నేరాలు-ఘోరాల్లో ఏ ఒక్క‌దానితోనూ ప్రొఫెస‌ర్ కు సంబంధంలేదు. 90 శాతం విక‌లాంగుడు, హృద్రోగ బాధితుడు, అనారోగ్య పీడితుడూ అయిన ప్రొఫెస‌ర్ సాయిబాబాకు బెయిల్ వ‌చ్చేందుకు ఏడాది ప‌ట్టింది. విడుద‌లై బ‌య‌ట‌కొస్తే..స్వాగ‌త తోర‌ణాలు లేవు. బాణాసంచా పేలుళ్లు అంత‌కంటే లేవు. నిఘా నీడ‌లో అనుమాన‌పు చూపులు వెంటాడుతుండ‌గా ఆ చ‌క్రాల కుర్చీ త‌న కార్యాల‌యం సీటు వైపు సాగిపోయింది. ప్రొఫెస‌ర్ చేసిన నేరమేంటో తెలుసా ? పేద ప్రజల పక్షాన నిలబడటమే…
ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల చేత ఎన్నికైన వారు..నిస్వార్థ ప్ర‌జాసేవ‌ను గాలికొదిలి..గ‌డ్డిక‌రిచి, అడ్డ‌దారిలో, అక్ర‌మంగా వంద‌ల కోట్లు కూడ‌బెడితే… గ‌త ఎన్నిక‌ల్లో కంటే ఓ ల‌క్ష ఓట్లు మెజారిటీతో గెలిపించారు . అక్ర‌మార్జ‌న‌కు ప్ర‌జామోదముద్ర ప‌డింది. ఆఫ్ర్టాల్ ఒక ఎమ్మెల్యే అవినీతి కేసులో అరెస్ట‌యి జైలు నుంచి బ‌య‌ట‌కొస్తుంటే.. వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలుచుకొచ్చిన టీమ్ కెప్టెన్ రేంజ్‌లో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. అవినీతి మ‌కిలితో అంటిన పాపులారిటీని , నెల‌రోజుల జైలు జీవితాన్ని ఓట్లుగా మ‌లుచుకునేందుకు రేవంత్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. తిరుగులేని ప్ర‌జాతీర్పుతో మ‌ళ్లీ ఎన్నిక‌య్యేందుకు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పార్టీ వ్యూహ‌క‌ర్త‌లు అభిప్రాయం.
విశ్వ‌విద్యాల‌యంలో విద్యార్థుల‌కు పాఠాలు చెప్పే ఓ ప్రొఫెస‌ర్ మావోయిస్టులతో సంభందాలున్నాయనే ఆరోపణపై మహారాష్ట్ర పోలీసులు పదకొండునెలల క్రితం అరెస్టు చేశారు. న‌డ‌వ‌లేడు. త‌న ప‌నులు కూడా తాను చేసుకోలోని నిస్స‌హాయ స్థితిలో ఉండి పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన త‌రువాత ప్రొఫెస‌ర్ సాయిబాబాబ‌కు ఎట్ట‌కేల‌కు బొంబాయి హైకోర్టు బెయిలిచ్చింది.
జూన్ 30 ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో జ‌య‌ల‌లిత గెలుపు, రేవంత్‌రెడ్డికి బెయిల్‌, ప్రొఫెస‌ర్ సాయిబాబాకు బెయిల్ వ‌చ్చాయి. ఒకే రోజు మూడు భిన్న‌మైన ఘ‌ట‌న‌లు, కేసులు..వాటిపై తీర్పులు ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో జ‌రిగిన మూడు విచిత్రాలు ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌డుతున్న అవ‌స్థ‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టాయి.

-కుసుమ దుర్గేశ్వరీ