అంధ‌ బాలికకు 1.8 కోట్ల పరిహారం: సుప్రీం సంచలన తీర్పు

చెన్నైలో వినియోగ‌దారుల కోర్టు ఇచ్చిన తీర్పును స‌వాలు చేసిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి 17 రెట్లు ప‌రిహారం చెల్లించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాప‌రాల‌ను ప‌రిశీలిస్తే… 1996లో జ‌న్మించిన ఓ బాలిక కంటి చూపు స‌రిగా లేద‌న్న కార‌ణంతో తల్లిదండ్రులు ఆమెను ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్ళి కంటి ప‌రీక్ష‌లు చేశారు. ఈనేప‌థ్యంలో ఆమెకు ప్రీ మెచ్యూరిటీ రెటినోప‌తి శ‌స్త్ర చికిత్స జ‌రిపారు. ఈ ఆప‌రేష‌న్‌లో వైద్యుల నిర్ల‌క్ష్యంగా కార‌ణంగా ఆ బాలిక‌కు కంటి చూపు పూర్తిగా పోయింది. దాంతో ఆ సమయంలోనే ఆ బాలిక తండ్రి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. అప్పుడు కేసును క్షుణ్ణంగా విచారించిన వినియోగ‌దారుల  కోర్టు ఐదు లక్షల రూపాయ‌ల‌ నష్టపరిహారం చెల్లించాలని ఆస్ప‌త్రిని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. ఆ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఆ బాలికకు నష్ట పరిహారంగా 1.3 కోట్లు.. వైద్య ఖర్చులకైన మొత్తం 42.8 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.  ప్రస్తుతం ఆ బాలిక వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలు. మొత్తం ఆ యువ‌తికి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఇప్పుడు ప‌రిహారం, వైద్య ఖ‌ర్చుల కింద కోటీ 72 ల‌క్ష‌ల 80 వేల రూపాయ‌లు చెల్లించాల్సి ఉంది.