మీడియా మేనేజ్‌మెంట్ కు 70 కోట్లు ఖర్చుచేయనున్న బాబు..

ఏదైనా ఈవెంట్ నిర్వ‌హిస్తే ఎంత ఖ‌ర్చ‌వుతుంది? ఎంత భారీ స్థాయిలో నిర్వ‌హించినా ల‌క్ష‌ల్లోనే ఖ‌ర్చ‌వుతుంది. అంత‌ర్జాతీయ స్థాయిలో బ‌డాపెట్టుబ‌డిదారుల‌ను వంద‌ల సంఖ్య‌లో తీసుకువ‌చ్చి ఈవెంట్ జ‌రిపినా ఐదు నుంచి ప‌ది కోట్ల‌కు మించి ఖ‌ర్చు కాద‌ని ఆ రంగంలో అనుభ‌వ‌మున్న నిపుణులు చెబుతున్నారు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఒక ఈవెంట్ నిర్వ‌హించ‌డానికి ఏకంగా 70 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌బోతున్నారు. ఏపీ వైబ్రెంట్ పేరుతో నిర్వ‌హించ‌నున్న ఓ ఈవెంట్‌ను చంద్ర‌బాబు ఓ ఆంగ్ల‌ప‌త్రిక‌కు అప్ప‌గించారు. ఈవెంట్ నిర్వ‌హించేందుకు 70 కోట్ల రూపాయ‌లు చెల్లించాల్సిందిగా ఆదేశించ‌డంతో అధికారులు అవాక్క‌య్యార‌ని స‌మాచారం. గుజ‌రాత్ వైబ్రెంట్ పేరుతో గ‌తంలో న‌రేంద్ర మోడీ నిర్వ‌హించిన త‌ర‌హాలో చంద్ర‌బాబు ఏపీ వైబ్రెంట్ ఈవెంట్ నిర్వ‌హించ త‌ల‌పెట్టారు. బాగానే ఉంది కానీ క‌రువు కాలంలో విరాళాలు అడుక్కుంటున్న రాష్ట్రప్ర‌భుత్వం ఇంత భారీ స్థాయిలో ఖ‌ర్చు చేయ‌డ‌మేమిటి? అందులోనూ ఐదు కోట్ల‌కు మించ‌ని ఈవెంట్‌కు 70 కోట్లు ఖ‌ర్చు చేయ‌డ‌మేమిటి? ఇంత‌కీ ఈవెంట్ నిర్వ‌హించ‌డానికి ఒప్పుకున్న ఆ ఆంగ్ల ప‌త్రిక చేసే ప‌నులేమిటో తెలుసా? ఈవెంట్‌కు పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఆహ్వానించ‌డం, మీడియాలో ప్ర‌చారం చేయ‌డం, మీడియా మేనేజ్‌మెంట్ వంటివి మాత్ర‌మే చేస్తుంద‌ట‌. ఈవెంట్‌కు వ‌చ్చే పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, అతిథుల‌కు స్టార్ హోట‌ళ్ల‌లో బ‌స‌, సౌక‌ర్యాలు, ఈవెంట్ నిర్వ‌హ‌ణ‌క‌య్యే ఇత‌ర ఖ‌ర్చుల‌న్నీ రాష్ట్రప్ర‌భుత్వ‌మే భ‌రించాల్సి ఉంటుంద‌ట‌. కేవ‌లం బ్రాండింగ్ కోస‌మే ఆ ఆంగ్ల‌ప‌త్రిక‌కు 70 కోట్లు చెల్లించ‌డ‌మంటే తెర‌వెనుక చాలా వ్య‌వ‌హార‌ముండి ఉంటుంద‌ని అధికారులు గుస‌గుస‌లాడుతున్నార‌ట‌.