కాలంతో పాటు నిలిచి…న‌డిచి…గెలిచిన‌….సిమ్రాన్‌!

సిమ్రాన్‌…ఈ పేరు విన‌గానే ఒక గ్లామ‌ర్‌ తార‌గానే మ‌న‌కు ఆమె గుర్తొస్తారు. న‌ట‌న‌తో పాటు ఆమె చేసిన నృత్యాలు అప్ప‌ట్లో ఒక సంచ‌ల‌నాన్నే సృష్టించాయి. స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుని, త‌రువాత, పెళ్లి పిల్ల‌లు, బుల్లితెర న‌ట‌న… ఇలా అంచెలంచెలుగా జీవితంలో కొన్ని ద‌శ‌లు దాటారామె. తెర‌పై జీవితాన్ని, త‌న‌కంటూ ఉన్న సొంత వ్య‌క్తిగ‌త జీవితాన్ని విడ‌దీసి చూసి ఎప్పుడు దేనికి ఎంత ప్ర‌యారిటీ ఇవ్వాలో తెలుసుకున్న అనుభ‌వం ఇప్పుడు ఆమె మాట‌ల్లో విన‌బ‌డుతోంది. క‌ళ్లు జిగేల్‌మ‌నిపించే లైట్ల‌లో ఎక్కువ సేపు ఉండ‌లేము. కొన్ని గంట‌ల‌పాటు అలా ఉల్లాసంగా గ‌డిపిన త‌రువాత ప్ర‌శాంత‌ మైన మ‌స‌క వెలుతురు ఎంతో మ‌న‌శ్శాంతిని ఇస్తుంది. లైమ్‌లైట్ జీవితానికి, కుటుంబ జీవితానికి మ‌ధ్య అలాంటి తేడా ఉంద‌నే విష‌యం సిమ్రాన్ అర్థం చేసుకున్న‌ట్టే ఉన్నారు. అందుకే న‌ట‌న అనేది త‌న జీవితంలో ఒక భాగం మాత్ర‌మేన‌ని, ఇప్పుడు త‌న ప్ర‌యారిటీ అంతా పిల్ల‌ల‌కేన‌ని అంటున్నారు. అంద‌మైన తార‌లు మ‌రింత అందంగా జీవితంలో స్థిర‌ప‌డితే సంతోష‌మే. ప‌లుర‌కాల అవ‌రోధాల‌తో జీవితాల‌ను అర్థంత‌రంగా ముగిస్తున్న తార‌ల విషాదాంతాల‌ను చూస్తున్నాం. అదే స‌మ‌యంలో స‌మ‌యానుకూలంగా, సంద‌ర్భోచితంగా జీవితంలో ఒదిగిపోయి ప్ర‌శాంత‌మైన, ఆహ్లాద‌క‌ర‌మైన జీవితాల‌ను సొంతం చేసుకున్న న‌టీమ‌ణులు యువ‌తార‌ల‌కు ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తారు అందులో సందేహం లేదు. క్వీన్ ఆఫ్ కోలివుడ్ అనిపించుకుని, ఇప్పుడు పిల్ల‌లే ముఖ్యం అంటున్న‌ సిమ్రాన్ మాట‌ల్లో అలాంటి ప‌రిప‌క్వ‌తే ధ్వ‌నిస్తోంది. మీరూ వినండి…ఆ మాట‌ల‌ను..

టివిషో అయినా, సినిమాల్లో అతిధి పాత్ర అయినా ఎదో ఒక‌టి చేస్తూనే ఉన్నా. అది నా కెరీర్ నిరంత‌రం నిలిచి ఉండ‌టానికి కార‌ణ‌మైంది. 
నాకోసమే ప‌నిచేస్తున్నాను… అనిపించేలాంటి మ‌న‌సుకి న‌చ్చిన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటున్నాను. 1990లు, 2000 సంవ‌త్స‌రాల నాటి కాలానికి ఇప్ప‌టి రోజుల‌కు తేడా ఉందని అర్థం చేసుకున్నాను.
1990 చివ‌ర‌ల్లో రోజంతా ప‌నిచేసిన రోజులున్నాయి. కానీ అది మాత్ర‌మే జీవితం కాదు. అంత స్థాయిలో ప‌నిచేసిన త‌రువాత నాదైన జీవితం నాకు అవ‌స‌రం. అదే చేశాను. కొన్నేళ్ల క్రితం సినిమాలు వ‌ద్దు అనుకున్న‌పుడు కూడా నేను ఊరికే కూర్చోలేదు.. ఒక మ‌నిషిగా ప‌నిచేస్తూనే ఉన్నా. గ‌తం, భ‌విష్య‌త్తుల‌ను గురించి ఆలోచించ‌ను. ప్ర‌స్తుతాన్ని ఆనందంగా మ‌ల‌చుకుంటే భ‌విష్య‌త్తు ఆనందంగానే ఉంటుంద‌ని న‌మ్ముతాను. అదే చేశాను.
అదీప్‌, ఆదిత్ నా పిల్ల‌లు. ఈ రోజుల్లో ఇద్ద‌రు మ‌గ‌పిల్ల‌ల‌ను చ‌క్క‌గా పెంచ‌డం అనేది చిన్న విష‌యం కాదు. నేన‌ది ఎంజాయి చేస్తున్నాను. నాకు మ‌న‌సు బాగాలేదు అనిపించిన‌పుడు, పిల్లల‌తో క‌లిసి కూర్చుని పుస్త‌కాలు చ‌దువుకుంటాను. అంతే, దాంతో బాధ‌ల్నే కాదు, ప్ర‌పంచాన్నే మ‌ర్చిపోతాను. 
ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెట్టాను. రెండు స‌రికొత్త ప్రాజెక్టులతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాను. స్క్రిప్టు ప‌రంగా అవ‌స‌ర‌మ‌నుకుంటే నేనూ న‌టిస్తాను.
నా మ‌న‌సుకి బాగా ద‌గ్గ‌రైన విష‌యాల్లో డ్యాన్స్ ఒక‌టి. అందుకే డ్యాన్స్ త‌మీజా డ్యాన్స్ షోలో రెండు సీజ‌న్లపాటు చేయ‌గ‌లిగాను. ఒక భిన్న‌మైన డ్యాన్స్ షోని చేయాల‌ని ఉంది. విదేశాల్లో వ‌స్తున్న షోల్లా మ‌న‌సుకి ద‌గ్గ‌ర‌గా అనిపించే షో ఒక‌టి చేయాలి.