మంగ‌ళసూత్రం వద్దు…మ‌రుగుదొడ్డి కా..వా….లీ…. !!!!!!

కొన్ని త‌రాల ఆలోచ‌న‌లు ఆచారాలుగా మార‌తాయి…లేదా కొన్ని త‌రాల ఆచారాలే త‌రువాత వారి ఆలోచ‌న‌లుగా రూపాంత‌రం చెందుతాయి. చాలా సింపుల్‌గా,  కాస్త కామ‌న్ సెన్స్ తో ఆలోచిస్తే బోధ‌ప‌డే విష‌యాల‌ను కూడా మ‌న‌లో చాలామంది ఇంకా అర్థం చేసుకోలేక‌పోతున్నాం. ఇప్ప‌టికిప్పుడు మ‌న‌దేశంలో ఉన్న స‌గ‌టు మ‌నిషిని ఒక స్త్రీకి ఏంకావాలి…అనే ప్ర‌శ్న వేస్తే…స‌మాధానంగా మ‌గ‌వాడితోడు…మంగ‌ళ‌సూత్రం…నూరేళ్ల సౌభాగ్యం….ప్రేమించే భ‌ర్త‌….స‌రే ….కాస్త ఆద‌ర్శ‌వాదులైతే చ‌దువు, సొంత సంపాద‌న లాంటి మాట‌లు చెప్ప‌వ‌చ్చు. 

మ‌న‌కు క‌ళ్లముందు క‌నిపించే వాస్త‌వాల‌కంటే క‌ట్టుబాట్లే ఎక్కువ‌గా అనిపిస్తాయి క‌నుక ఇవ‌న్నీ క‌రెక్టే అనిపిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా మ‌న ఆలోచ‌న‌ల్లోంచి మ‌నిషి అనే కోణం క‌నుమ‌రుగు కావ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి స‌మాధానాలు వ‌స్తాయి. స్త్రీ అయినా ఆమె కూడా మ‌నిషే కనుక‌…ఆమెకు ఏంకావాలి… అంటే క‌డుపునిండా తిండి, కంటినిండా మ‌న‌శ్శాంతిగా నిద్ర‌, శుభ్ర‌మైన వాతావ‌రణంలో నివ‌సించ‌గ‌ల అవ‌కాశం, స్వ‌చ్ఛ‌మైన గాలి, త‌న ఆత్మ‌గౌర‌వానికి ఏమాత్రం భంగం క‌ల‌గ‌ని స్వేచ్ఛ‌… ఇవ‌న్నీ ఒక జీవితానికి క‌నీస అవ‌స‌రాల‌న్న సంగ‌తిని….ఇవి ఇంకా అంద‌రికీ అంద‌ని ప‌రిస్థితుల్లోనే  ఉన్నా, మ‌నం మ‌ర్చిపోయాం. ఇప్పుడు మ‌నం ముఖ్యం అనుకుంటున్న‌వి ఏవైనా…. ఒక ప్రాణికి, ఒక మ‌నిషికి స‌హజంగా అందాల్సిన వాటి త‌రువాతే అన్న సంగ‌తిని మ‌ర్చిపోయిన‌ట్టుగానే ప్ర‌వ‌ర్తిస్తున్నాం. జార్ఖండ్‌లో డుమ్కా అనే ఊళ్లో డిగ్రీ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న అమ్మాయి,  ఇంట్లో త‌ల్లిదండ్రులు టాయిలెట్ క‌ట్టించ‌లేద‌ని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. త‌మ కూతురు ఖుష్బూ కుమారి ఎన్నిసార్లు టాయిలెట్ కోసం పోరుపెట్టినా తాము ప‌ట్టించుకోలేద‌ని, అందుకు బ‌దులుగా ఇంటికి ప్ర‌హ‌రీగోడ‌ని క‌ట్టించామ‌ని ఆమె త‌ల్లే చెప్పింది. విశాల‌మైన పెర‌డుతో పాటు నాలుగురూముల ప‌క్కా ఇల్లు వారిది అయినా మ‌రుగుదొడ్డి  లేదు.

ఖుష్బూ కుమారి త‌ర‌చుగా టాయిలెట్ కోసం ద‌గ్గ‌ర్లో ఉన్న త‌న తాత‌గారి ఇంటికి వెళుతుండేది. టాయ్‌లెట్ స‌దుపాయం లేక బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి ఇబ్బంది ప‌డిన ఖుష్బూ చివ‌రికి త‌న ప్రాణాల‌నే తీసుకుంది. మ‌రుగుదొడ్డి కోసం ఖ‌ర్చుపెట్టే డ‌బ్బుని కూతురి పెళ్లి కోసం వాడాల‌నుకున్నామ‌ని ఆమె తండ్రి చెబుతున్నాడు. ఆ ఒక్క‌మాట‌లో మ‌న‌కు స‌ర్వ అర్థాలు, అన‌ర్థాలు క‌న‌బ‌డుతున్నాయి.

మ‌నం చ‌దువుకున్న మ‌నిషికి, డ‌బ్బున్న‌మ‌నిషికి, అధికారం ఉన్న మ‌నిషికి, మ‌న కులస్తుడైన మ‌నిషికి, మ‌న మ‌త‌స్తుడైన మ‌నిషికి….ఇలా…చాలామందికి విలువ ఇస్తాం….కానీ మ‌నిషికి విలువ ఇవ్వం. ఆ మ‌నిషి స్త్రీ అయితే ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. మాకు మంగ‌ళ‌సూత్రాలు కాదు, మ‌రుగుదొడ్లు కావాల‌ని…మ‌హిళ‌లు చివ‌రికి ప్రాణాలు తీసుకుని చెప్పినా మ‌న స‌మాజానికి అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌లేము. మ‌నిషి ఆరోగ్యం, ఆనందం, స్వేచ్ఛ‌, ఆత్మ‌గౌర‌వం…ఇవ‌న్నీ మ‌న‌కు ప్రాథ‌మిక అవ‌స‌రాలుగా క‌నిపించ‌నంత‌వ‌ర‌కు ఈ ప‌రిస్థితి మార‌దు.  మ‌నం నాగ‌రిత‌క‌గా భావిస్తున్న అంశాలు టెక్నాల‌జీ, మార్కెట్‌, వ‌స్తువులు, అధికారం,  ఫ్యాష‌న్లు లాంటివ‌న్నీ ఏక‌మై మ‌న  కాళ్లు ప‌ట్టి కింద‌కు లాగేసి మ‌న‌పైనే ఎక్కి స్వారీ చేస్తున్నా మ‌న‌కు స్పృహ లేదు. సామాజిక స్పృహ అంత‌క‌న్నా లేదు….ఈ త‌ర‌హా వైఖ‌రికి ముగింపేలేదు……