తెలంగాణ కేబినెట్ కొప్పులోకి ఈశ్వ‌ర్‌!

తెలంగాణ కేబినెట్‌లోకి క‌రీంన‌గ‌ర్ జిల్లా కొప్పుల ఈశ్వ‌ర్‌ను తీసుకుంటామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి కొప్పుల ఈశ్వ‌ర్‌ను తొలికేబినెట్‌లోకి తీసుకోవాల్సింది. తొలుత డిప్యూటీ సీఎం ప‌ద‌వికి ఈశ్వ‌ర్ పేరు ప‌రిశీల‌న‌కు వ‌చ్చింది. ఆ త‌రువాత ఎందుకో వెన‌క్కి త‌గ్గారు. అనంత‌రం స్పీక‌ర్‌గా అవ‌కాశం ఇద్దామని ప్ర‌య‌త్నించినా కొప్పుల ఈశ్వ‌ర్ ఆస‌క్తి చూప‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో తొలి మంత్రి వ‌ర్గంలో ఈశ్వ‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. కొప్పుల అప్ప‌టి నుంచి కినుక వ‌హిస్తూ వ‌చ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణలోనూ కొప్పుల‌కు నిరాశే ఎదురైంది. దీనిపై కొప్పుల తీవ్ర నిరాశ చెందారు. ఆయ‌న అనుచ‌రులు సైతం తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీంతో ఆయ‌న్ను బుజ్జ‌గించ‌డానికి కంటితుడుపు చ‌ర్య‌గా చీఫ్ విప్ ప‌ద‌వి ఇస్తామ‌న్నారు. అసంతృప్తితో ఉన్న ఈశ్వ‌ర్ ఆ ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి అంత‌గా ఇష్ట‌ప‌డ‌లేదు. కేటీఆర్ రంగంలోకి దిగా కొప్పుల‌కు న‌చ్చ‌జెప్పాడు. అంత‌టితో వివాదం స‌ద్దుమ‌ణిగింది. నిజానికి పార్టీ ఆవిర్భావం నుంచి ఈశ్వ‌ర్ నిజాయ‌తీగా ప‌నిచేస్తున్నార‌ని పేరు తెచ్చుకున్నారు. పైగా క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కేసీఆర్ న‌మ్మిన‌బంటు. అందుకే సామాజిక స‌మీక‌ర‌ణాల్లో భాగంగా మంత్రివ‌ర్గంలో చోటు ఆల‌స్య‌మైనా ఈశ్వ‌ర్ ఎద‌రుచూస్తున్నారు త‌ప్ప ఏనాడూ బ‌య‌ట‌ప‌డ‌లేదు. తాజాగా క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ ఈశ్వ‌ర్‌ను ఈసారి మంత్రిని చేస్తాన‌ని ప్ర‌క‌టించి ఆయ‌న అనుచ‌రుల్లో ఆనందాన్ని నింపారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కేసీఆర్ వారాసిగూడ‌లో ఇలాంటి హామీనే ఇచ్చారు. ప‌ద్మారావును మీరు ఎమ్మెల్యే చేసి పంపండి, నేను మంత్రిని చేసి పంపుతా అని సికింద్రాబాద్ ప్ర‌జ‌ల‌కు మాట ఇచ్చి నిల‌బెట్టుకున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను తల‌చుకొంటూ కొప్పుల అనుచ‌రులు సైతం త‌మ నాయకుడికి మంత్రి ప‌ద‌వి ఖాయమ‌ని సంబ‌రాల్లో మునిగారు.